Jagannath Rao
-
చంద్రునిపై వీరవల్లి వాసికి 2 ఎకరాల భూమి
హనుమాన్ జంక్షన్ రూరల్: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ఎన్ఆర్ఐ బొడ్డు జగన్నాథరావు చంద్రుడిపై రెండెకరాల భూమిని కొనుగోలు చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌కు ఉద్యోగరీత్యా వెళ్లిన ఆయన 2005లో ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ గురించి తెలుసుకున్నారు. చంద్రునిపై భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్క్లెయిమ్ డీడ్‌ను ఈ సంస్ధ నిర్వహిస్తోంది. చంద్రునిపై ప్రయోగాలు, చంద్ర మండల ప్రదేశాలపై అన్వేషణ, అభివృద్ధి, పరిశోధనలకు ఆర్థిక సాయం చేసేందుకు అంతర్జాతీయంగా క్రౌడ్ ఫండింగ్ చేపట్టేందుకు లూనార్ రిపబ్లిక్ సొసైటీ ఏర్పడింది. దీంతో న్యూయార్క్‌లోని లూనార్ రిపబ్లిక్ సొసైటీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన బొడ్డు జగన్నాథరావు తన కుమార్తెలు మానస, కార్తీక పేరిట చెరో ఎకరం చొప్పున భూమి కొనుగోలు చేశారు. చంద్రునిపై ఏయే అక్షాంశాలు, రేఖాంశాల మధ్య భూమి కొనుగోలు చేశారో సవివరంగా లూనార్ రిపబ్లిక్ సొసైటీ ఇచ్చిన రిజిస్ట్రేషన్క్లెయిమ్ డీడ్‌పై స్పష్టంగా పేర్కొన్నారు. ల్యాండ్ పార్శిల్ నంబర్లు, చంద్రునిపై అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు గుర్తించిన ప్రాంతాల పేర్లను కూ డా ఇందులో ముద్రించారు. దీంతోపాటు చంద్రునిపై ఉపరితలం వీడియో సీడీ, కొనుగోలు చేసిన ల్యాండ్ మ్యాప్‌ను జగన్నాథరావుకు ఇచ్చారు. తాజాగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్–3 విజయవంతం కావటం, పలు అంతర్జాతీయ సంస్ధలు కూడా చంద్ర మండలంపైకి మానవుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం సంతోషకరమని జగన్నాథరావు అంటున్నారు. -
AP: లాభాల తీపి పెంచేలా
సాక్షి, అమరావతి : పంచదారతో పోలిస్తే బెల్లంలో పోషక విలువలు ఎక్కువ. ఔషధ గుణాలకూ కొదవ లేదు. జీర్ణశక్తిని పెంచడం.. రక్తహీనతను తగ్గించడం వంటి సుగుణాలెన్నో బెల్లానికి ఉన్నాయి. అయినా పంచదారకు ఉన్నంత డిమాండ్ బెల్లానికి లేదు. ఈ నేపథ్యంలోనే బెల్లంతో విలువ ఆధారిత ఇతర ఉత్పత్తుల్ని తయారు చేయడంపై అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం చెరకు రైతులకు, బెల్లం తయారీదారులకు శిక్షణ ఇస్తోంది. తద్వారా వారి ఆదాయాలను.. మరోవైపు బెల్లం వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. బెల్లం పొడి.. మంచి రాబడి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఇతర లవణాలు, ప్రోటీన్ల వల్ల త్వరగా బూజు పట్టడం, నీరు కారటం వంటి కారణాల వల్ల బెల్లం నాణ్యత చెడిపోతుంది. దీనిని నివారించేందుకు అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం బెల్లాన్ని పొడి రూపంలో మార్చే సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఈ పొడి గోధుమ వర్ణంలో పంచదార రేణువుల్లా ఉంటుంది. దీనికి అమెరికా, ఫిలిప్పీన్స్, కొలంబియా, ఇండోనేషియా దేశాల్లో డిమాండ్ ఎక్కువ. చెరకు రసాన్ని స్థిరీకరించిన మోతాదులో స్ప్రే డ్రైయింగ్ ద్వారా పొడి రూపంలో మార్చుకోవచ్చు. చాక్లెట్లు.. కేకుల తయారీ ఇలా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కరిగించిన వెన్నలో కోకో, బెల్లం పొడి కలిపిన మిశ్రమానికి జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు అద్ది చాక్లెట్ అచ్చులలో వేయడం ద్వారా చాక్లెట్లు తయారవుతాయి. ఇదే తరహాలో చోడి పిండి, బెల్లం పొడి కలిపి కూడా చాక్లెట్లను తయారు చేసుకోవచ్చు. బెల్లం కేకు తయారీ కోసం కరిగించిన వెన్నలో బెల్లం పొడి, గోధుమ పిండిలో బేకింగ్ పౌడర్లను కలిపి తయారు చేసుకున్న మిశ్రమానికి కొద్దికొద్దిగా నీళ్లు వేస్తూ కాస్త జారుగా వచ్చేటట్లు కలుపుకోవాలి. ఆ తరువాత మైక్రో ఓవెన్లో 100–190 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 20 నిమిషాల పాటుచేసి.. 5 నిమిషాలపాటు చల్లారిస్తే రుచికరమైన కేక్ తయారవుతుంది. ఓట్స్ కుకీస్.. న్యూట్రీ బార్స్ వెన్న, బెల్లం పొడి కలిపిన మిశ్రమంలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, నానబెట్టిన ఓట్స్, యాలకుల పొడివేసి కలిపిన మిశ్రమాన్ని పాలు లేదా నీళ్లు వేసి చపాతి ముద్దలా చేసి డీప్ ఫ్రిజ్‌లో 10 నిమిషాలు పెట్టాలి. ఆ తర్వాత చపాతి కర్రతో ఒత్తుకుని కావాల్సిన ఆకారాల్లో బిస్కెట్లుగా కోసి ట్రేలో అమర్చి మైక్రో ఓవెన్లో 120 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 20 నిమిషాల పాటు బేకింగ్ చేస్తే రుచికరమైన బెల్లం ఓట్స్ కుకీస్ తయారవుతాయి. న్యూట్రీ బార్స్ తయారీ విషయానికి వస్తే.. బెల్లం లేత పాకం వచ్చిన తర్వాత తొలుత కొర్రలు, సామలు, జొన్నల మిశ్రమాన్ని ఆ తర్వాత వేరుశనగ పప్పు, బెల్లం, యాలకుల పొడిని వేసి బాగా కలిపి ట్రేలో వేసి సమానమైన ముక్కలు చేసి చల్లారనివ్వాలి. ఇలా తయారైన న్యూట్రీ బార్లను ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి గాలి చొరబడని ప్రదేశంలో భద్రపర్చుకోవాలి. బెల్లం పానకం చెరకు రసాన్ని శుద్ధి చేసి మరగబెట్టిన తరువాత చిక్కటి పానకం తయారవుతుంది. దీనిని దోశ, ఇడ్లీలు, గారెలు, రొట్టెలతో చట్నీ లేదా తేనె మాదిరిగా కలిపి తింటారు. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో దీనిని చపాతీలు, పూరీల్లో కూడా వాడుతుంటారు. పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన జాగరీ ప్లాంట్ ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి బెల్లం పానకం లేదా బెల్లం, బెల్లం పొడిని తయారు చేస్తారు. బెల్లం కాఫీ ప్రీమిక్స్.. జెల్లీస్.. సోంపు బెల్లం పొడిని పాలు, యాలకుల పొడితో కలిపి ప్రీమిక్స్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. దీనిని 7.5 గ్రాముల మోతాదులో 100 గ్రాముల వేడి నీళ్లలో కలిపితే రుచికరమైన కాఫీ తయారవుతుంది. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 5 నిమిషాలు మరిగించిన చెరకు రసానికి తగిన మోతాదులో జెలటీన్ అడార్ జెల్‌ని కలిపి చల్లారిన తర్వాత మౌల్డ్‌లో వేసుకుని శీతల ఉష్ణోగ్రత వద్ద భద్రపరిస్తే బెల్లం జెల్లీ రెడీ అవుతుంది. అల్లం లేదా ఉసిరిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని డ్రయ్యర్లో ఆరబెట్టి బెల్లం కోటింగ్ మెషిన్లో 30–70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద తగినంత నీరు కలిపిన బెల్లం పొడి ద్రావణాన్ని కొద్దికొద్దిగా వేస్తే బెల్లం కోటింగ్‌తో రుచికరమైన అల్లం, ఉసిరి ముక్కలు తయారవుతాయి. అదేరీతిలో సోంపును కూడా తయారు చేసుకోవచ్చు. పాస్తా.. నూడిల్స్ బెల్లంతో నూడిల్స్ లేదా పాస్తా తయారు చేసుకోవచ్చు. పుడ్ ఎక్స్‌ట్రూడర్ అనే మెషిన్లో గంటకు 25–35 కేజీల వరకు పాస్తా పదార్థాలను వివిధ ఆకారాల్లో తయారు చేయవచ్చు. బెల్లం పొడి, గోధుమ పిండి, మొక్కజొన్న రవ్వ, మైదా, రాగి పిండి మిశ్రమాన్ని పాస్తా మెషిన్లో ట్యాంక్‌లో వేస్తారు. తగినంత నీళ్లు పోసి 5–10 నిమిషాల పాటు మిక్సింగ్ చేసి మరో 45 నిమిషాల తర్వాత నచ్చిన ఆకారంలో ఉండే ట్రేలలో వేస్తే పాస్తాలు తయారవుతాయి. వాటిని డ్రయ్యర్లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 5 గంటలపాటు ఆరబెడితే చాలు. శిక్షణ ఇస్తున్నాం బెల్లంతో ఇతర ఉత్పత్తుల తయారీలో పాటించాల్సిన సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తున్నాం. విదేశాలకు ఎగుమతి చేసే విధంగా బెల్లం దిమ్మలు, పాకం, పొడి రూపంలో తయారయ్యేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక బెల్లం తయారీ ప్లాంట్ రూపొందించాం – డాక్టర్ పీవీకే జగన్నాథరావు, సీనియర్ శాస్త్రవేత్త, అనకాపల్లి ప్రాంతీయ పరిశోధనా కేంద్రం -
అల్పజీవి ఉపకారం
కథాసారం ‘చచ్చిపో – నీ వల్ల ఎవ్వరికీ ఉపకారం జరిగి ఉండకపోతే నువ్వెందుకూ? చచ్చిపో’ పిచ్చివాడు నవ్వాడు. వెంకట్రావు చెవుల్లో ఆ మాటలు మారుమ్రోగుతున్నాయి. ఆఫీసు నుంచి బయటపడి రోడ్డు మీదికి మరలగానే వెంకట్రావు స్వేచ్ఛగా చేతులు దులుపుకున్నాడు. ఉదయాన్నుంచి తాను రాసిన కాగితాలు, తిన్న చీవాట్లు లెక్కకు మించిపోయినాయి. అనుదినమూ జరిగే విషయాలు అట్టే బాధ పెట్టవు. నిత్యం చచ్చేవాడికి ఏడిచేవాడెవడూ? ‘ఏం వెంకట్రావ్?’ ఎవరో పిలుస్తున్నారు. గిరుక్కున వెనక్కి తిరిగాడు. పూర్వ మిత్రుడు ఆచారి తనవైపే నడచి వస్తున్నాడు. తానూ, వాడూ పూర్వం గడిపిన చక్కటి రోజులూ, వాడి చేష్టలు, తనకనేక విధాల వాడు చేసిన ఉపకారాలు జ్ఞప్తికి వచ్చాయి. ‘ఎప్పుడొచ్చావురా?’ ‘ఇప్పుడే బస్సు దిగాను’ వెంకట్రావుకి మంచి రోజులు కరువు. డబ్బు కరువు. స్నేహితులు కరువు– ఇప్పుడు మాటలూ కరువయ్యాయి. ‘హెల్తు ఆఫీసులో పని మీద వచ్చాను’ ‘అహా.’ ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. కాఫీ హోటలు దగ్గరకి వస్తున్న కొద్దీ వెంకట్రావు గుండెల్లో దడ ఎక్కువ కాసాగింది. ఆవేళ ఒకటో తారీఖు. జీతం తెచ్చుకుంటున్నాడు. ఆచారికి కాఫీ ఇచ్చుకోవాలి. వాడి చేత డబ్బులు ఇప్పిస్తే ఏం బాగుంటుంది? ఆచారి ఏమీ ప్రయత్నం లేకుండానే హోటల్లోకి దారి తీసాడు. వెంకట్రావు గుండెలు చేతుల్లో పెట్టుకుని వెనక నడిచాడు. ఇద్దరూ ఓ మూల కూర్చొన్నారు. సర్వర్ ‘ఏం కావాలి సార్’ అన్నాడు. ‘రెండు స్వీట్...’ ఆచారి నిస్సందేహంగా ఆర్డరు చేసేసరికి గతుక్కుమన్నాడు వెంకట్రావు. రెండు ఆర్లు పన్నెండణాలు. ‘ఒకటే తీసుకురా...’ అన్నాడు ఎంత తగ్గినా మంచిదేనని. ‘అదేమిటిరా? కాశీలో వదిలిపెట్టి వచ్చావేంటీ?’ ‘ఆహా, స్వీటెందుకని’ సర్వరు తెల్లబోయి చూసి, వెళ్ళి రెండు స్వీట్లు తెచ్చాడు. వెంకట్రావు కాలుతున్న ఇనుములాగ నోట్లో పెట్టుకున్నాడు. స్వీట్ ఆరణాలు, హాట్ ఓ పావలా, కాఫీ వెధవది... స్పెషలు హోటలు– ఎనిమిదణాలు. రెండూం పావలా. వెంకట్రావు జేబులోని డబ్బువేపు చూసుకున్నాడు. ఒక్క రూపాయి తగ్గినా రుక్మిణమ్మ చేసే రాద్ధాంతమూ, గోలా చెవిలో మారుమ్రోగ సాగాయి. పోనీ ఆచారిని బిల్లు పే చెయ్యనిస్తే? ‘ఛా’ తనకెన్నిసార్లు ఇచ్చుకోలేదు కాఫీ? ఎలా లేదన్నా ఆచారి చేస్తున్న అయ్యవారి ఉద్యోగం కన్నా ఎక్కువ ఉద్యోగమే చేస్తున్నాడు. బూంది... కాఫీ... సర్వరు ఇచ్చిన బిల్లూ తీసుకున్నాడు వెంకట్రావు. ఇంతసేపూ ఏం మాట్లాడుతున్నాడో తనకి తెలీదు. ఆచారి బిల్లు తీసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు. వెంకట్రావు బిల్లు ఇచ్చుకుని బయటకి నడిచాడు. వెనకాలే ఆచారి రెండు కిళ్ళీలు కొని, ఒకటి వెంకట్రావుకిచ్చాడు. ‘మరి నే వెళ్తానూ’ అన్నాడు ఆచారి. వెంకట్రావుకి తన పరువు ప్రతిష్టలు త్రాసులో ఉన్నట్లు కనిపించాయి. ఆలోచించకుండా ‘రాత్రికి ఇంటికి వచ్చేయ్’ అన్నాడు. ‘చెప్పలేన్రా, మూడొంతులు వస్తాన్లే’ ఆచారి అటువైపు నడిచాడు. వెంకట్రావు ఇంటివైపు నడిచాడు. ∙∙ గుమ్మం ఎక్కి, తలుపు తోసుకుని వెంకట్రావు గదిలోకి వెళ్ళాడు. చొక్కా తీసి కొయ్యపాగాకి తగిలించాడు. రుక్మిణమ్మ ‘ఏం ఆలస్యం అయింది?’ అన్నది. ‘చిన్న పని ఉండి ఆలస్యం అయిందిలే’ అతని జేబు తడుముతున్న రుక్మిణమ్మ ఒకసారి డబ్బంతా లెక్కచూసి, ‘డబ్బు తక్కువుందేం?’ అంది. ‘కొంచెం ఖర్చు చేసాను’ దోషిలా అన్నాడు వెంకట్రావు. ‘ఎందుకనీ?’ ‘స్నేహితుడొచ్చాడులేవే’ ‘ఇలా తగలేస్తారని తెలిసే నేను గోల పెడుతూంటాను. హయ్యో? ఎంత దుబారా? ఎవడో వస్తే మూడు రూపాయల ఖర్చా?’ ‘రెండుంపావలాయే’ అంతటితో ఆ పతివ్రత శాంతించినందుకు సంతోషించాడు. తరువాత విషయం ఇంకా భయపెడుతూనే ఉంది. నెమ్మదిగా, ‘రాత్రికి వాడిని భోజనానికి రమ్మన్నాను’ అన్నాడు. ‘ఎవరినీ?’ ‘నా స్నేహితుడ్నే’ ‘ఇక్కడ సేవ చేసేందుకో మనిషుందని, అడ్డమైన వాళ్ళనీ నా పీకలమీదకి తెచ్చి ఎక్కిస్తే నేనేమీ చెయ్యలేను’ అంది. ‘అదికాదే, వాడు నాకు చాలా...’ ‘వీల్లేదంటే వీల్లేదు’ రూలింగు ఇచ్చేసింది. వెంకట్రావుకి కోపం రాదు. వచ్చినా లాభం లేదనే విషయం తెలుసు. రుక్మిణిని బతిమాలసాగాడు. ఇంకెప్పుడూ ఎవర్నీ ముందరగా తన అనుమతి తీసుకోకుండా భోజనానికి పిలవనని వెంకట్రావు దగ్గర మాట తీసుకుని, రాత్రి మిత్రుడిని పిలిచినందుకు క్షమించింది. ∙∙ వీధి అరుగుమీద కూర్చొని వచ్చేపోయేవాళ్ళని చూస్తున్నాడు వెంకట్రావు. ఎవడో పిచ్చివాడల్లే ఉన్నాడు. వీధంతా ధూళిచేస్తూ వస్తున్నాడు. దారినపోతోన్న ప్రతీవాడి చెయ్యీ పట్టుకుని ఏదో అరుస్తూన్నాడు. ఒకడి చెయ్యి పట్టుకుని, ‘నువ్వు పుట్టినందువల్ల ఏం ఉపకారం జరిగింది?’ అని అడిగాడు. చెయ్యి స్వంతదారు తెల్లబోయి చూస్తుంటే వికటంగా ఒక అట్టహాసం చేసి వాణ్ణి వదిలి మరో చెయ్యి తీసుకున్నాడు. వెంకట్రావు భయపడ్డాడు తన జోలికి వస్తాడని. లేవబోయాడు. అయినా పిచ్చివాడు గభీమని వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. ‘నువ్వు పుట్టినందువల్ల లోకానికి ఏం ఉపకారం జరిగింది?’ అని అరిచాడు. వెంకట్రావు ఇంతసేపూ పిచ్చివాడికి భయపడ్డాడు కాని, ఏదో శాంతితో వెలుగుతూన్న వాడి కళ్ళని చూశాక, అతని ప్రశ్న వెయ్యి రెట్ల బలంతో భయపెట్టసాగింది. ‘చచ్చిపో – నీ వల్ల ఎవ్వరికీ ఉపకారం జరిగి ఉండకపోతే నువ్వెందుకూ? చచ్చిపో’ పిచ్చివాడు నవ్వాడు. వెంకట్రావు చెవుల్లో ఆ మాటలు మారుమ్రోగుతున్నాయి. పిచ్చివాడు వెళ్ళిపోతున్నాడు. వెంకట్రావ్ కూర్చున్న చోటునుంచి లేవలేకపోయాడు. తాను ఎవరికి ఉపకారం చేశాడు? ఎనిమిదయింది. ఆచారి జాడలేదు. అప్పుడే రుక్మిణికి కోపం రాసాగింది. వేగంగా ఆచారి వస్తే బాగుండుననుకున్నాడు. ఎనిమిదిన్నర, తొమ్మిది. ఆచారి రాలేదు. ఈ మాత్రం దానికి నన్ను చంపేరు. స్నేహితుడు వస్తానని ఎందుకు చెప్పాడు? రుక్మిణి మొగుణ్ణీ, మిత్రుణ్ణీ తిట్టి భోజనం చేసింది. కోపంలో వెంకట్రావుకి అన్నం పెట్టడం మరిచిపోయింది. ∙∙ వీధి అరుగుమీద పడుకున్న వెంకట్రావు అర్ధరాత్రి లేచాడు. వెన్నెల విరివిగా కాస్తోంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో అతనికి సాయంత్రం నించీ జరిగినదంతా జ్ఞాపకం వచ్చింది. నువ్వు పుట్టడం వల్ల లోకానికి ఏం ఉపకారం జరిగింది? చిన్నప్పుడు వారాలు చేసుకుని చదివి స్కూల్ ఫైనల్ పాసయ్యాడు. తరువాత గుమాస్తాగా చేరాడు. నాటినుంచి నేటివరకూ అదే ఉద్యోగం. వచ్చిన కాగితానికల్లా నంబరు వెయ్యడం, అది ఎవరికి చెందాలో వాళ్ళకి పంపడం, వెళ్ళాల్సిన కాగితాలకి పోస్టేజి సరిగ్గా అతికించి చిరునామా వ్రాసి పంపడం. ఇందులో ఏం ఉపకారం జరిగింది? గృహస్థుడుగానైనా తానెవరికైనా ఉపకారం చేశాడా? ఈ గయ్యాళి భార్యతో ఎవ్వరికీ ఓ పూట అన్నం పెట్టడానికైనా తనకి స్వతంత్రం లేదు. తనవల్ల ప్రయోజనం లేదు లోకానికి. పిచ్చివాడు చెప్పాడు. తను చచ్చిపోవాలి. వాడు పిచ్చివాడు కాదు, మహాజ్ఞాని. మరణం ద్వారా పొందబోయే సుఖాలు వెంకట్రావు కళ్ళకి కనబడసాగాయి. తప్పు కాగితాలు పంపినందుకు గుమాస్తాలు తిట్టరు. అర్ధమృతుడిగా ఈ జీవితం గడపనక్కరలేదు. వెంకట్రావు లేచాడు. ఎలా చచ్చిపోవాలనే సమస్య ముఖ్యమైనది కాదు. ఊరుబయట నుయ్యి ఉంది. చావుల నుయ్యి. తొందరగా నడవసాగాడు. ఈ కష్టాలకీ, ఈ జీవితానికీ, ఈనాటితో స్వస్తి. నుయ్యి కనిపిస్తోంది వెన్నెట్లో. తనకోసమే అది అక్కడ ఉన్నట్లు కనిపిస్తోంది. నవ్వుదామనుకున్నాడు. నవ్వలేకపోయాడు. కాళ్ళు నెమ్మదిగా అడుగువెయ్యడం ప్రారంభించాయ్. హఠాత్తుగా ఆ ప్రశాంతతని చీల్చుకుంటూ ఓ వికటాట్టహాసం వినిపించింది. భూత ప్రేత పిశాచ... ఎవరూ కాదు. పిచ్చివాడు. నూతి పక్కనించి నడిచివచ్చి వెంకట్రావు చెయ్యి పట్టుకుని, ‘ఎందుకొచ్చావ్?’ అన్నాడు. ‘చచ్చిపోడానికి.’ నిశ్చింతగా చెప్పాడు వెంకట్రావు, నేను ఎవరికీ ఉపకారం చెయ్యలేదు అని. ఈసారి నవ్వాడు పిచ్చివాడు. మూర్ఖుడివి అని అరిచాడు. వెంకట్రావ్ తెల్లబోయాడు. ‘నువ్వు చావద్దు, పో’ అన్నాడు. వెంకట్రావుకి కొండంత ధైర్యం వచ్చింది. ‘కాదు నువ్వే చెప్పావు చావమని.’ ‘లేదు. నువ్వు ఉపకారం చేశావు. నీవల్ల ప్రపంచానికి గొప్ప ప్రమాదం తప్పించబడింది’ అన్నాడు పిచ్చివాడు. ‘నావల్లనా? ఉపకారమా?’ అన్నాడు. ‘నీ భార్య గయ్యాళి కదూ. ఆమెని పెళ్ళాడి ఓ మనిషిని రక్షించావు. ఆ బాధలన్నీ వాడికి బదులు నువ్వు అనుభవిస్తున్నావ్. ఇంతకన్నా ఉపకారం ఏముంది?’ అన్నాడు పిచ్చివాడు. వెంకట్రావు ఇక ముందడుగు వెయ్యలేకపోయాడు. వెనుదిరిగి వేగంగా నడవసాగాడు. తనవల్ల లోకానికి ప్రయోజనం ఉంది. పరుగు... వేగం... మహావేగం. మర్నాడు ఉదయం వెంకట్రావుకి పెద్ద జ్వరం వచ్చింది. అలా జబ్బు పడ్డందుకు రుక్మిణి అతణ్ణి చెడతిట్టి పోసింది. ఇచ్ఛాపురపు జగన్నాథరావు (1931–2017) కథ ‘పరిమళించిన నిర్గంధ కుసుమం’కు ఇది సంక్షిప్త రూపం. జగన్నాథరావు విశాఖపట్నంలో జన్మించారు. ఎక్సైజ్ శాఖలో పని చేశారు. ఆయన రచనలు 13 సంపుటాలుగా వెలువడినాయి. వానజల్లు, చేదు కూడా ఒక రుచే, ఎదురద్దాలు ఆయన కథా సంపుటాల్లో కొన్ని. ఎక్కువగా సంభాషణల పద్ధతిలో ఈయన కథలు రాస్తారు. -
టీబీ మొబైల్ టీముల ప్రారంభం
సిద్దిపేట జోన్ : జిల్లా వ్యాప్తంగా క్షయ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ అదేశాల మేరకు టీబీ మొబైల్ టీములను సోమవారం కలెక్టర్ వెంకట్రామిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాకు చెందిన 5 ద్విచక్ర వాహనాలతో కూడిన సిబ్బంది బృందాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ బృందాలు ఆయా గ్రామాల్లోని క్షయ వ్యాధిగ్రస్తులను కలిసి సలహాలు, సూచనలతో పాటు వారికి ఆరోగ్యపరమైన చికిత్స అందించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రామకృష్ణ, ఉపవైద్యాధికారి శివానందం, జాతీయ ఆరోగ్యమిషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జగన్నాథరావు పాల్గొన్నారు. -
97.2 శాతం మందికి పోలియో వ్యాక్సిన్
రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్ :జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యంలో 97.2 శాతం మంది పిల్లలకు వ్యాక్సిన్ వేశామని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.గీతాంజలి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి జగన్నాథరావు తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు చిన్నారులు 2,40,823 మంది ఉండగా వీరిలో 2,34,111 మందికి పోలియో మందు వేశారని వివరించారు. సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్న మాఫింగ్ కార్యక్రమంలో మిగిలినవారికి వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. ఇంటింటికి వెళ్లి పిల్లలకు వ్యాక్సిన్ వేసి లక్ష్యం సాధించటానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అప్రమత్తత అవసరం : కలెక్టర్ సౌరభ్‌గౌర్ దేశంలో పోలియో మహమ్మారిని ఇప్పటికే నిర్మూలించగలిగామని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సౌరభ్ గౌర్ అన్నారు. జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలోని సంతోషిమాత ఆలయం వద్ద చిన్నారులకు పోలియో మందు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించటం ద్వారా వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని అన్నారు. తల్లిదండ్రుల్లో అవగాహనతోనే పోలియో నిర్మూలన సాధ్యమైందని చెప్పారు. ప్రజలు విజ్ఞతతో వ్యవహరిస్తే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో కూడా ఇదే చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లోనూ జిల్లాను ఆదర్శప్రాయంగా నిలబెట్టాలన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజకుమార్ మాట్లాడుతూ జిల్లాలో 1606 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేశామన్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.గీతాంజలి మాట్లాడుతూ జిల్లాలోని 2,40,823 మంది చిన్నారులకు 7,712 మంది సిబ్బందితో పోలియో చుక్కలు వేయిస్తున్నామని చెప్పారు. ఆదివారం వ్యాక్సిన్ వేసుకోని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో వేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. సామాజిక కార్యకర్త మంత్రి వెంకటస్వామి పల్స్‌పోలియోపై రూపొందించిన కోటు ధరించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి.జగన్నాథరావు, మెప్మా పీడీ మునికోటి సత్యనారాయణ, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, సభ్యురాలు ఆర్.సుగుణ తదితరులు పాల్గొన్నారు.