హనుమాన్ జంక్షన్ రూరల్: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ బొడ్డు జగన్నాథరావు చంద్రుడిపై రెండెకరాల భూమిని కొనుగోలు చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌కు ఉద్యోగరీత్యా వెళ్లిన ఆయన 2005లో ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ గురించి తెలుసుకున్నారు. చంద్రునిపై భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌క్లెయిమ్ డీడ్‌ను ఈ సంస్ధ నిర్వహిస్తోంది.
చంద్రునిపై ప్రయోగాలు, చంద్ర మండల ప్రదేశాలపై అన్వేషణ, అభివృద్ధి, పరిశోధనలకు ఆర్థిక సాయం చేసేందుకు అంతర్జాతీయంగా క్రౌడ్ ఫండింగ్ చేపట్టేందుకు లూనార్ రిపబ్లిక్ సొసైటీ ఏర్పడింది. దీంతో న్యూయార్క్‌లోని లూనార్ రిపబ్లిక్ సొసైటీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన బొడ్డు జగన్నాథరావు తన కుమార్తెలు మానస, కార్తీక పేరిట చెరో ఎకరం చొప్పున భూమి కొనుగోలు చేశారు. చంద్రునిపై ఏయే అక్షాంశాలు, రేఖాంశాల మధ్య భూమి కొనుగోలు చేశారో సవివరంగా లూనార్ రిపబ్లిక్ సొసైటీ ఇచ్చిన రిజిస్ట్రేషన్‌క్లెయిమ్ డీడ్‌పై స్పష్టంగా పేర్కొన్నారు.
ల్యాండ్ పార్శిల్ నంబర్లు, చంద్రునిపై అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు గుర్తించిన ప్రాంతాల పేర్లను కూ డా ఇందులో ముద్రించారు. దీంతోపాటు చంద్రునిపై ఉపరితలం వీడియో సీడీ, కొనుగోలు చేసిన ల్యాండ్ మ్యాప్‌ను జగన్నాథరావుకు ఇచ్చారు. తాజాగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్–3 విజయవంతం కావటం, పలు అంతర్జాతీయ సంస్ధలు కూడా చంద్ర మండలంపైకి మానవుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం సంతోషకరమని జగన్నాథరావు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment