97.2 శాతం మందికి పోలియో వ్యాక్సిన్
Published Mon, Jan 20 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్ :జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యంలో 97.2 శాతం మంది పిల్లలకు వ్యాక్సిన్ వేశామని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.గీతాంజలి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి జగన్నాథరావు తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు చిన్నారులు 2,40,823 మంది ఉండగా వీరిలో 2,34,111 మందికి పోలియో మందు వేశారని వివరించారు. సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్న మాఫింగ్ కార్యక్రమంలో మిగిలినవారికి వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. ఇంటింటికి వెళ్లి పిల్లలకు వ్యాక్సిన్ వేసి లక్ష్యం సాధించటానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
అప్రమత్తత అవసరం : కలెక్టర్ సౌరభ్‌గౌర్
దేశంలో పోలియో మహమ్మారిని ఇప్పటికే నిర్మూలించగలిగామని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సౌరభ్ గౌర్ అన్నారు. జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలోని సంతోషిమాత ఆలయం వద్ద చిన్నారులకు పోలియో మందు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించటం ద్వారా వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని అన్నారు. తల్లిదండ్రుల్లో అవగాహనతోనే పోలియో నిర్మూలన సాధ్యమైందని చెప్పారు. ప్రజలు విజ్ఞతతో వ్యవహరిస్తే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో కూడా ఇదే చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అన్ని రంగాల్లోనూ జిల్లాను ఆదర్శప్రాయంగా నిలబెట్టాలన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజకుమార్ మాట్లాడుతూ జిల్లాలో 1606 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేశామన్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.గీతాంజలి మాట్లాడుతూ జిల్లాలోని 2,40,823 మంది చిన్నారులకు 7,712 మంది సిబ్బందితో పోలియో చుక్కలు వేయిస్తున్నామని చెప్పారు. ఆదివారం వ్యాక్సిన్ వేసుకోని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో వేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. సామాజిక కార్యకర్త మంత్రి వెంకటస్వామి పల్స్‌పోలియోపై రూపొందించిన కోటు ధరించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి.జగన్నాథరావు, మెప్మా పీడీ మునికోటి సత్యనారాయణ, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, సభ్యురాలు ఆర్.సుగుణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement