నెత్తురు లేదు..సత్తువ రాదు.. | Debt, Accessory, dealers, companies, large discount | Sakshi
Sakshi News home page

నెత్తురు లేదు..సత్తువ రాదు..

Published Sat, Jun 28 2014 12:00 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

నెత్తురు లేదు..సత్తువ రాదు.. - Sakshi

నెత్తురు లేదు..సత్తువ రాదు..

మాటలే మిగులుతున్నాయి.. మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మన్యంలో జవసత్వాలు లేని బతుకులు పాలకుల నిర్లక్ష్యాన్ని, సిబ్బంది అక్రమాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.  మారుమూల గూడేల్లో పౌష్టికాహారలోపం, రక్తహీనత కారణంగా మాతాశిశు మరణాలు ఆగక సాగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో  పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల కోసం ఉద్దేశించిన పోషకాహారం, మందులు, టీకాలు చాలా చోట్ల పక్కదారి పడుతున్నాయి.

పాడేరు: రక్తహీనత, పౌష్టికాహార లోపంతో మన్యం విలవిలలాడుతోంది. గర్భిణులు, బాలింత లు, శిశువులను ఆహార సంబంధ సమ్యులు పట్టి పీడిస్తున్నాయి.  వీరందరికీ ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నప్పటికీ గిరిజనులను రక్తహీనత సమస్య  పీడిస్తూనే ఉంది. మన్యంలో శిశు మరణాలు వెయ్యికి 215 ఉంటున్నాయి. అధికారులు వీటిని తగ్గించి చూపిస్తున్నారు. అంతా బాగానే ఉందని బాకా ఊదేస్తున్నారు. కానీ వాస్తవాలు కలవరపరుస్తున్నాయి. వర్షాలతో జలకాలుష్యం పుణ్యమా అని విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కలుషిత జలాలకు తోడు ఆహారపు అలవాట్లు అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. పౌష్టికాహారలోపం, రక్తహీనత తోడై ఏటికేడాది మాయదారి రోగాలు ఏజెన్సీ వాసులను కర్కశంగా తోడేస్తున్నాయి.
 
ఏజెన్సీలోని 11 మండలాల్లో 1122 అంగన్‌వాడీ, 1144 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 17,829 మంది గర్భిణులు, బాలింతలు, 38,321 మంది 3 ఏళ్ళలోపు చిన్నారులు, 30,322 మంది 6 ఏళ్ళలోపు చిన్నారులు, 29,748 మంది కిశోర బాలికలు మన్యంలో ఉన్నట్టు అధికారుల రికార్డులు పేర్కొంటున్నాయి. వీరి మంచిచెడ్డలు చూడాల్సిన అంగన్‌వాడీ కేంద్రాల పై అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. పౌష్టికాహారం పంపిణీలో లోపాలు చోటుచేసుకుంటున్నాయి. కిశోర బాలికల్లో కూడా హిమోగ్లోబిన్  తక్కువగా ఉంటోంది. రక్తహీనత కారణంగా ప్రసవ సమయంలో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు.

2013-14 ఆర్థిక సంవత్సరంలో ఏజెన్సీవ్యాప్తంగా 557 శిశువులు, 264 మంది తల్లులు మృతి చెందారు. హుకుంపేట, ఉప్ప, మినుములూరు, ఈదులపాలెం, జి.మాడుగుల, గన్నెల, పెదబయలు, కేడీపేట, గెమ్మెలి, డుంబ్రిగుడ, మాడగడ, గోమంగి, కిలగాడ ఆరోగ్య కేంద్రాల్లో అధికంగా మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్, మేలో 38 మంది శిశువులు, ఏడుగురు తల్లులు చనిపోయారు. గురువారం రాత్రి మరో శిశువు పాడేరు ఆస్పత్రిలో మృతి చెందింది. ముంచంగిపుట్టు మండలం పెద్దాపుట్టుకు చెందిన వంతాల సువర్ణ ప్రసవ వేదనతో గురువారం పాడేరు ఆస్పత్రిలో చేరగా అతికష్టం మీద కాన్పు జరిగింది.  పుట్టిన బిడ్డ వెంటనే మరణించింది. తల్లికి   వైద్యసేవలు అందిస్తున్నారు.
 
అస్తవ్యస్తంగా పౌష్టికాహారం పంపిణీ
 
గూడెంకొత్తవీధి: పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ అస్తవ్యస్తంగా ఉంది. మండలంలో 83 అంగన్వాడీ, 120 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రధాన కేంద్రాలకు మినహా మారుమూల గ్రామాల లో ఒక రోజుకు కేటాయించిన పౌష్టికాహారాన్ని వారం, పది రోజులకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
 
అధికారుల పర్యవేక్షణ లోపం

 
చింతపల్లి: అధికారుల పర్యవేక్షణ లోపంతో అంగన్‌వాడీలలో పిల్లలకు పౌష్టికాహారం నామమాత్రంగానే అందుతోంది. మారుమూల గూడేల్లో అదీ ఉండదు. పుచ్చిపోయిన పప్పులు, చిన్న పరిమాణంలో ఉన్న కోడిగుడ్లు ఇస్తున్నారు. చాలా కేంద్రాల్లో సక్రమంగా గుడ్లు పంపిణీ చేయడం లేదు. మినీ అంగన్వాడీ కేంద్రాలల్లో పిల్లలకు వండి పెట్టకుండా తల్లితండ్రులకు బియ్యం, పప్పు, నూనె వంటివి పంపిణీ ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. చిలకలమామిడిలో శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రం తెరవలేదు. సమావేశమంటూ పిల్లలకు భోజనమే పెట్టలేదు. చౌడుపల్లిలో పుచ్చిపోయిన పప్పు తినేందుకు పిల్లలు అయిష్టత చూపారు.

 అంగన్‌వాడీ కేంద్రాలు-    2,266
 గర్భిణులు, బాలింతలు-    17,829
 మూడేళ్ళలోపు చిన్నారులు-    38,321
 ఆరేళ్ళలోపు చిన్నారులు-    30,322
 కిశోర బాలికలు-    29,748
 గతేడాది చనిపోయిన శిశువులు-    557
 మృతి చెందిన తల్లులు-    264

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement