తాటి బెల్లంతో ఆరోగ్యం.. ఆదాయం!
తాటి చెట్ల నుంచి నీరాను సేకరించి ఆరోగ్యదాయకమైన తాటి బెల్లం, తాటి బెల్లం పొడిని ఇంటి వద్దనే సులువుగా తయారు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని (ఆడ, మగ) తాటి చెట్ల నుంచి నీరాను సేకరించవచ్చు. రోజుకు ఒక చెట్టు నుంచి 6 లీటర్ల వరకు నీరాను తీయవచ్చు. దాదాపు 100 లీటర్ల నీరా నుంచి 13-14 కిలోల బెల్లం పొందవచ్చు. ఈ విధంగా తాటి నీరాతో ఇంటి వద్దనే బెల్లం తయారు చేస్తే ఒక గీత కార్మికుడు రోజుకు రూ. 700 -రూ. 1000 వరకు ఆదాయం పొందవచ్చు. తాటి బెల్లం పొడికి మరింత ధర వస్తుంది. గీత కార్మికులు తాటి చెట్ల ద్వారా ఏడాది పొడవునా ఆదాయం పొందే మార్గాలున్నాయని పందిరిమామిడి (తూ. గో. జిల్లా) ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త వెంగయ్య చెబుతున్నారు. ఆయన అందించిన ప్రత్యేక సమాచారం ‘సాగుబడి’ పాఠకుల కోసం..
గ్రామీణ భారతంలో తాటి చెట్టు అత్యంత ప్రాధాన్యత గల చెట్టు. ఈ చెట్టులో పనికిరాని భాగమంటూ లేదు. మన దేశంలో తీరప్రాంత రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, గోవా, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్‌లో తాటి చెట్లు అధికంగా ఉన్నాయి. భారతదేశంలో సుమారు 12 కోట్ల తాటి చెట్లు ఉన్నట్టు అంచనా. అందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి. తాటి, ఖర్జురా, కొబ్బరి చెట్ల నుంచి కాయలను ఉపయోగించుకోవడం మనకు తెలుసు. కానీ, ఈ చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తుల ద్వారా బెల్లాన్ని, బెల్లం పొడిని కూడా తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఈ చెట్ల నుంచి తీసే నీరా ద్వారా బెల్లం, బెల్లం పొడి తయారు చేయవచ్చు. తాటి నీరాలో ఎక్కువ చక్కెర ఉంటుంది. తాటి చెట్లు రసాయనాలతో ప్రమేయం లేకుండా సహ జ సిద్ధంగా పెరగడం, విరివిగా లభించటం వల్ల చాలా ప్రాముఖ్యత ఉంది. తాటి నుంచి లభ్యమయ్యే విలువైన పదార్థాలలో నీరా అతి ముఖ్యమైనది. తాటి గెలల నుంచి ఊరే రసాన్ని తాజాగా ఉన్నప్పుడు నీరా అంటారు. తాజా నీరా మంచి వాసన, స్పష్టమైన రంగుతో తియ్యగా ఉంటుంది. పులిసిన నీరాను కల్లు అంటారు. ఇది మత్తును క లుగ జే స్తుంది. ఆడ, మగ చెట్ల నుంచి కూడా నీరా లభిస్తుంది.
నవంబర్ నుంచే మగ తాటి చెట్ల నీరా!
తాటి నీరాలో సుమారు 12-15 వరకు చక్కెర శాతం ఉంటుంది. ఆడ చె ట్ల నుంచి లభించే నీరాలో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. ఆడ చెట్లలో జనవరి నుంచి మే వరకు లభిస్తుంది. మగ చెట్లలో ముందుగా అంటే నవంబర్ నుంచి వస్తుంది. ముదిరిన కాయల నుంచి అక్టోబరు వరకు నీరా వస్తుంది. గీత కార్మికులు నీరాతో తాటి బెల్లం, తాటి బెల్లం పొడిని ఇంటి స్థాయిలోనే తయారు చేయవచ్చు. బెల్లం, చక్కెరకు బదులుగా వీటిని వాడుకోవచ్చు లేదా అమ్ముకొని ఉపాధి పొందవచ్చు. రసాయనాలు లేని ఆరోగ్యదాయకమైనవి కాబట్టి తాటి బెల్లం, తాటి బెల్లం పొడికి పట్టణ, నగర మార్కెట్లలో మంచి ధర కూడా లభిస్తున్నది.
ఒక గీతకార్మికుడు రోజుకు సుమారు 12-15 చెట్లు గీయగలడు. ఒక చెట్టుకు సుమారు 1 లీటరు నుంచి 6 లీటర్ల వరకు నీరా వస్తుంది. ఒక చెట్టు నుంచి సాలీనా ఏడాదికి 150 లీటర్ల నీరాను సేకరించవచ్చు. ఈ విధంగా గీత కార్మికులకు సంవత్సరం మొత్తం పని లభించడమే కాకుండా.. అధిక ఆదాయం కూడా లభిస్తుంది.
తాటి బెల్లంలో పోషకాలు ఘనం..
పులియని తాజా నీరా నుంచి తాటి బెల్లాన్ని తయారు చేస్తారు. ఈ బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు 76.86, రెడ్యూసింగ్ చక్కెర 1.66, కొవ్వు 0.19, మాంసకృత్తులు 1.04, కాల్షియం 0.86, ఫాస్ఫరస్ 0.05, ఖనిజ లవణాలు 3.15 శాతం, ఇనుము ఉంటాయి. పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తాటి బెల్లం చాలా ఉపయోగం.
తాటి బెల్లంతో రక్తహీనతకు చెక్
తాటి బెల్లం విశిష్టత గురించి 100 సంవత్సరాల క్రితం ‘వస్తుగుణ దీపిక’లో రాసి ఉంది. తాటి బెల్లాన్ని క్రమం తప్పకుండా 20 గ్రా. తీసుకోవటం వల్ల అనేక రకాలయిన వ్యాధులు నయం అవుతాయి. ముఖ్యంగా స్త్రీలలో, చిన్న పిల్లల్లో రక్తహీనతను త గ్గిస్తుంది. అంతే కాకుండా తాటి బెల్లాన్ని వాడటం వల్ల వీర్య పుష్టి, దేహ పుష్టి కలుగుతుంది. శరీరానికి చల్లదనం కలిగిస్తుంది. తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం కలిగి ఉండటం వల్ల రక్తపోటు, గుండె వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
దాదాపు 100 లీటర్ల నీరా నుంచి 13-14 కిలోల బెల్లం పొందవచ్చు. తాటి బెల్లం ధర సుమారు కిలో రూ. 200 వరకు ఉంది. ఈ విధంగా తాటి నీరాతో ఇంటి వద్దనే బెల్లం తయారు చేస్తే ఒక గీత కార్మికుడు రోజుకు రూ. 700 -రూ. 1000 వరకు ఆదాయం లభిస్తుంది. జనవరి నుంచి మే వరకు బెల్లం తయారీ ద్వారా ఉపాధి పొందవచ్చు. ఔషధ విలువలు కలిగిన ఈ బెల్లాన్ని ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ వాడుతున్నారు. పటిక బెల్లం, చాక్లెట్లు సహా వివిధ తీపి ఆహార పదార్థాల తయారీలోనూ తాటి బెల్లాన్ని వాడొచ్చు.
తాటి బెల్లం పొడి తయారీ సులువే!
నీరా నుంచి బెల్లంతో పాటు బెల్లం పొడిని తయారు చేయవచ్చు. బాణలి లేదా పాన్‌లో కాచిన పాకాన్ని అచ్చుల్లో పోస్తే బెల్లం తయారవుతుంది. మంట ఆర్పేసి అలాగే తిప్పుతూ ఉంటే సులువుగానే బెల్లం పొడి సిద్ధమవుతుంది. వినియోగదారులు పంచదారకు బదులుగా వాడుకోవడానికి బెల్లం పొడి అనువుగా ఉంటుంది. తాటి బెల్లానికన్నా బెల్లం పొడికి మార్కెట్లో అధిక ధర లభిస్తుంది.
- సేకరణ : సాగుబడి డెస్క్
(తూ. గో. జిల్లా పందిరిమామిడిలోని ఉద్యాన పరిశోధనా కేంద్రం (డా. వై ఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం) సీనియర్ ఆహార -సాంకేతిక విజ్ఞాన శాస్త్ర విభాగం సీనియర్ శాస్త్రవేత్త పి.సి.వెంగయ్యను 94931 28932 నంబరులో సంప్రదించవచ్చు)
తాటి బెల్లం తయారీ విధానం..
తాటి నీరాను మరగబెట్టడం ద్వారా బెల్లాన్ని తయారు చేస్తారు. సేకరించే సమయంలో నీరా ఉదజని సూచిక (పీహెచ్) 7.5 ఉండాలి.
నీరా తీసే విధానం:
1. పులియకుండా తాజా నీరాను సేకరించేందుకు సున్నం (1 శాతం) వాడాలి. దీని కోసం సేకరించే పాత్రలో సున్నాన్ని పూతగా పూయాలి. ఇది పులియడాన్ని ఆలస్యం చేస్తుంది. ఈ విధంగా సేకరించిన నీరాను వెంటనే 22-24 గేజ్ గల జిఇ షీట్‌తో చేసిన బాణలిలో పోసి, వేడి చేయాలి. రెండు పొంగులు వచ్చే వరకు మరగబెట్టి, చల్లార్చి, వడపోయాలి. ఈ దశలో పీహెచ్‌ను చూడాలి. కొంచెం సూపర్‌ను కలపడం ద్వారా పిహెచ్ 7.5 ఉండే విధంగా చూసి వేడి చేయాలి. నీరా మరుగుతున్నప్పుడు వచ్చే తెట్టును తీసి వేయాలి. ఇలా చే స్తే సున్నం విరుగుతుంది. ఈ విధంగా దాదాపు 2 నుంచి 3 గంటలు మరగబెడితే.. నీరా బాగా చిక్కబడుతుంది. ఈ దశలో ఒక బొట్టును చల్లని నీటిలో వేసి బెల్లం ఏర్పడే దశను గుర్తించవచ్చు. నీటిలో ఇది పాకంలా ఉండకు వస్తుంది. ఉండకు వచ్చిన వెంటనే బాగా కలపడం ద్వారా చల్లార్చి ఫ్రేములో పోస్తే.. మనకు కావలసిన ఆకారంలో బెల్లం అచ్చులు పొందవచ్చు.
2. పందిరిమామిడి పరిశోధనా స్థానంలో పరీక్షించబడిన కూలింగ్ బాక్స్ ఉపయోగించి సులువుగా తాజా నీరాను సేకరించవచ్చు. ఈ విధంగా సేకరించిన నీరాను వెంటనే 22-24 గేజ్‌గల జిఇషీట్‌తో చేసిన బాణలి లేదా పాన్‌లో పోసి వేడి చేయాలి. రెండు పొంగులు వచ్చే వరకు వేడి చేసి, చల్లార్చాలి. ఈ విధంగా దాదాపు 2-3 గంటలు మరగబెడితే.. బెల్లం పాకం బాగా చిక్కబడుతుంది. ఇది నీటిలో పాకంలా ఉండకు వస్తుంది. ఉండకు వచ్చిన వెంటనే బాగా కలపాలి. తర్వాత చల్లార్చి ఫ్రేములో పోయడం ద్వారా కావలసిన ఆకారంలో బెల్లం అచ్చులు పొందవచ్చు.
తాటి బ్లెలం తయారీలో తీసుకోవలసిన జాగ్రత్తలు :
నీరాను మరగబెడుతున్నప్పుడు బాగా కలపడం ద్వారా అడుగు అంటకుండా చూడాలి.
నీరాను సేకరించినప్పుడు పీహెచ్ 7.5 లేదా 8 ఉండాలి
పెనానికి కొంచెం నూనె పూయటం ద్వారా బెల్లం వృథా కాకుండా చూడవచ్చు.
చెక్కతో చేసిన ఫ్రేమును నీటిలో నానబెట్టి వాడితే బెల్లం అచ్చులు సులువుగా వస్తాయి.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి నాణ్యమైన తాటి బెల్లం పొందవచ్చు.