Palm jaggery
-
తాటిబెల్లం ఏయే వ్యాధులను నయం చేస్తుందంటే..!
తాటిబెల్లం మనం వాడుతున్న పంచదారకి అద్భతమైన ప్రత్యామ్నాయం. నిజానికి మనం రోజు తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది. కాని దీన్ని తయారుచేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది. దీనిలో తీపి రుచి తప్ప ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఈ తాటిబెల్లం దేవుడు ఇచ్చిన ప్రకృతి ప్రసాదంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీన్ని తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. ఇందులో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాల తోపాటు అనేక విటమిన్లు దీనిలో ఉంటాయి. ఆహారం జీర్ణం కావడానికి బాగా ఉపయోగపడుతుంది. అందువల్లే కొన్ని ప్రాంతాల్లో ఆహారం తీసుకున్న తర్వాత తాటిబెల్లం ముక్క తింటారు. పేగులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇందులో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి ఆస్తమాని తగ్గించేందుకు దోహదపడుతుంది. అంతేగాదు ఎముకలకు బలాన్ని ఇచ్చి కాల్షియం, పోటాషియం, భాస్వరం తదితరాలు ఉంటాయి. దీన్ని తరుచుగా తీసుకోవడం వల్ల నీరసం రాదు, పైగా శరీర పుష్టి, వీర్య వృద్ధిని కలిగిస్తుంది. ఎలాంటి వ్యాధులకు చెక్ పెడుతుందంటే.. తాటి బెల్లం తినడం వల్ల క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది శ్వాసకోస, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులులో ఉండే విష పదార్థాలను బయటికి పంపించి పేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. దీనిలో ఫైబర్ అధికం ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్తి చికిత్సకు సహయపడుతుంది. శరీరంలోని హానికర టాక్సిన్ను బయటికి పంపించి మలబద్ధక సమస్యను నివారిస్తుంది. పొడి దగ్గు, ఆస్మా వంటి శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఉదయాన్నే దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగగ్రెయిన్ తలనొప్పి తగ్గుతుంది. ఇది కొవ్వుని కరిగించి అధికి బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్త్రీలలో బహిష్టు సమస్యలను అరికడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ ప్యూరిఫై చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలోని వేడిని తొలగిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. దీనిని రోజు 25-30 గ్రాముల వరకు తీసుకోవచ్చు. చివరగా ఇది ఎక్కువగా గుంటూరు జిల్లా నిజామా పట్నం మండలం కాలిలో దొరుకుతుంది అలాగే గోదావరి జిల్లా నిడదవోలు,తాడేపల్లిగూడెం,చాగల్లు,కొవ్వూరు,పెదవేగి దేవరపల్లి, గోపాలపురం, భీమవరం, వీరవాసరం, తణుకులో ఎక్కువగా దొరుకుతుంది. దీంతో చేసుకునే సింపుల్ స్నాక్ ఐటెం తాటి బెల్లం నువ్వుల లడ్డు: కావాల్సిన పదార్థాలు: తాటి బెల్లం 2 కప్పులు నువ్వులు 2 కప్పులు తయారీ విధానం: తాటి బెల్లం కోరి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఒక గిన్నెలో నువ్వులు తీసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించుకోవాలి. వచ్చిన నువ్వులు, తాటి బెల్లం కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ నుంచి మిశ్రమాన్ని తీసి చిన్న చిన్న ఉండలు చేసుకుంటే తాటి బెల్లం ఉండలు తయారవుతాయి. (చదవండి: వర్షాకాలం..వ్యాధుల కాలం..ఈ జాగ్రత్తలు పాటిస్తే..వ్యాధులు పరార్!) -
తాటి నీరా తరుణమిదే!
తాటి చెట్ల నుంచి నీరాను సేకరించడం డిసెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుంది. తాటి నీరా అత్యంత ఆరోగ్యదాయకమైన ప్రకృతిసిద్ధమైన పానీయం. తాటిచెట్టు గెలల నుంచి స్రవించే పోషక ద్రవాన్ని పులియకుండా సేకరిస్తే నీరా, పులియబెట్టి సేకరిస్తే కల్లు అవుతాయి. తాజా నీరా చక్కటి రుచితో అంతకుమించిన పోషకాలతో కూడి ఉంటుంది. దీన్ని హెల్త్ డ్రింక్‌గా తాగవచ్చు. తాటినీరాతో బెల్లం, పాకం(సిరప్), పంచదార, పటిక బెల్లం తయారు చేయవచ్చు. ఇళ్లలో, బేకరీల్లో చక్కెరకు బదులుగా వీటిని వాడుకోవచ్చు. తాటి ఉత్పత్తుల గ్లైసెమిక్ ఇండెక్స్(జి.ఐ.) తక్కువ కాబట్టి సాధారణ వ్యక్తులతోపాటు షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాడుకోవచ్చని తూ.గో. జిల్లా పందిరిమామిడిలోని ఉద్యాన పరిశోధనా కేంద్రానికి చెందిన ఫుడ్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త పి. సి. వెంగయ్య చెబుతున్నారు. ఈ పరిశోధనా కేంద్రంలో తాటి నీరాతో వివిధ ఉత్పత్తుల తయారీ కోసం అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పారు. గీత కార్మికులు, రైతులు, గ్రామీణులకు శిక్షణ ఇస్తున్నారు. తాటి నీరా ప్రకృతి సిద్ధంగా తాటి చెట్టు నుంచి లభించే పానీయాన్ని పులియకుండా సేకరిస్తే.. దాన్ని నీరా అంటారు. ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. నీరా తియ్యగా ఉండటమే కాకుండా సుక్రోజు వంటి పిండి పదార్థాలు ఎక్కువగా కలిగి ఉంటుంది. నీరాలో ఇంకా అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. నీరా చక్కెర శాతం ఎక్కువగా కలిగిన పానీయం. దీనిలో చక్కెరతోపాటు ఐరన్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్, ఆస్కార్బిక్ ఆమ్లాలు వంటి విటమిన్లు ఉన్నాయి. నీరా జీర్ణశక్తిని పెంచుతుంది. కామెర్లు వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉన్న నీరాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాడవచ్చు. దీనిలో మినరల్స్, అవశ్యకమైన అమైనో ఆమ్లాలు, బి–కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. గర్భవతులకు, బలహీనంగా ఉన్న పిల్లల ఆరోగ్య రక్షణకు ఉపయోగించే ఆయుర్వే ఔషధాల్లో నీరాను వాడుతున్నారు. గర్భవతులు నీరాను వారానికి మూడు లేదా నాలుగు రోజులు తీసుకోవడం వల్ల పుట్టబోయే శిశువు మంచి రంగులో, ఆరోగ్యంగా జన్మిస్తుంది. బలహీనంగా ఉన్న పిల్లలకు రోజూ తక్కువ మోతాదులో ఇస్తే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు. మధుమేహం, ఊబకాయం, దంత క్షయం ఉన్న వారికి నీరా ఉపయోగపడుతుంది. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన కేలరీలు తక్కువగా ఉండే పదార్థాలు ఇష్టపడేవారు నీరాతో తయారు చేసిన పదార్థాలను వాడవచ్చు. తాటి నీరా సిరప్ (పాకం), బెల్లం, పంచదారను ఇళ్లలో, బేకరీలో వివిధ రకాల పదార్థాల తయారీలో చక్కెరకు బదులుగా వాడవచ్చు. నీరాను పాకం, బెల్లం, పంచదార వంటి పదార్థాలుగా మార్చడం వలన వీటిని సాంప్రదాయ వంటలు, ఇతర పదార్థాల తయారీలో చెరకు నుంచి తయారు చేసిన బెల్లం, పంచదారకు బదులుగా వాడవచ్చు. తాటి పటిక బెల్లం తాజాగా సేకరించిన నీరా (తాజా నీరా ఉదజని సూచిక 7–8 ఉంటుంది)ను 103–105 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద బాగా మరిగించాలి. నీరా బాగా మరిగి దాదాపు మూడో వంతు వరకు ఇగిరిన తర్వాత మంటను ఆర్పివేసి.. సన్నని దారాలు లేదా తీగలతో తయారు చేసిన క్రిష్టలైజర్లో పోయాలి. దీన్ని కదలకుండా, గాలి తగలకుండా ఉన్న చోటనే 35–40 రోజుల పాటు ఉంచాలి. తరువాత దారాలు లేదా తీగలకు అంటుకొని ఏర్పడిన స్ఫటికాల(అదే పటిక బెల్లం)ను బయటకు తీసి కడిగి, ఆరబెట్టి నిల్వచేసుకోవచ్చు. తాటి బెల్లం తాటి నీరాతో బాండీలో పోసి మరిగించి సులభంగానే బెల్లం తయారు చేసుకోవచ్చు. తొలుత 103–105 డిగ్రీల ఉష్ణోగ్రతతో బాగా మరగబెట్టి, తరువాత తక్కువ మంట మీద కలుపుతూ ఉండాలి. చిక్కబడిన తర్వాత అచ్చులలో పోస్తే బెల్లం తయారవుతుంది. ఎటువంటి ఎంజైములు, రసాయనాలు కలపనవసరం లేదు. తాటి పంచదార తాటి చెట్ల పెంపకంలో రసాయనాలు వాడే అవసరం లేదు. కాబట్టి తాటి నీరాతో తయారు చేసే పంచదారను కూడా ప్రకృతి సిద్ధంగా, ఏ విధమైన రసాయనాలు శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. రసాయనాలు వాడకుండానే తాటి పంచదారను తయారు చేసుకోవచ్చు. ఇంతులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. నీరా పంచదారను వాడటం వలన బరువు తగ్గడం, మధుమేహం అదుపులో ఉండటంతోపాటు సీరమ్ కొలస్ట్రాల్ శాతాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో కూడా నీరా పంచదార ఉపయోగపడుతుంది. తాజా నీరా(ఉదజని సూచిక 7–8)ను 103–105 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరిగించి, బాగా చిక్కబడిన తరువాత క్రిస్టలైజర్, సెంట్రిఫ్యూజులను ఉపయోగించి పంచదారను తయారు చేస్తారు. తాటి సిరప్ (పాకం) తాజా నీరాను బాణలిలో పోసి 103–105 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బాగా మరిగించాలి. నీరా బాగా మరిగి దాదాపు సగం పరిమాణానికి తగ్గినప్పుడు మంటను ఆర్పివేసి, చల్లబర్చి గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. దీన్ని చక్కెరకు బుదులుగా వాడుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. టీ, కాఫీలలోను, కషాయాల లోను, బేకరీ ఉత్పత్తులలోను, ఐస్‌క్రీమ్‌ల తయారీలోను నీరా సిరప్‌ను ఎక్కువగా వాడతారు. 4 కోట్ల తాటి చెట్లున్నా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 4 కోట్ల తాటిచెట్లు ఉన్నాయి. ముదురు చెట్ల నుంచి డిసెంబర్ నుంచి 4 నెలల పాటు నీరాను సేకరించవచ్చు. చెరకు రసంతో తయారు చేసే పంచదార, బెల్లం కన్నా తాటి బెల్లం, తాటి పంచదార ఎంతో మేలైనవి. ఈ సహజ తీపి ఉత్పత్తులను గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేహ రోగులు కూడా తినొచ్చు. ఇంత ప్రయోజనకరమైన తాటి చెట్లలో 1 శాతాన్ని కూడా మనం ఉపయోగించుకోకపోవడం దురదృష్టకరం. ప్రతి తాటి చెట్టు నుంచి ఏటా గరిష్టంగా రూ. 10 వేల ఆదాయం పొందవచ్చు. గ్రామీణులకు ఉపాధి అవకాశాలను ఇవ్వగల శక్తి తాటి, ఈత చెట్లకు ఉందని ప్రభుత్వాలు, గీత కార్మికులు, రైతులు గుర్తించాలి. – పి. సి. వెంగయ్య (94931 28932), సీనియర్ శాస్త్రవేత్త (ఫుడ్‌సైన్స్, టెక్నాలజీ), అఖిల భారత తాటిపరిశోధనా పథకం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పందిరి మామిడి, తూ. గో. జిల్లా తాటి నీరాతో తయారవుతున్న తాటి బెల్లం, తాజా తాటి నీరా -
కట్టె గానుగ నూనె.. తాటి బెల్లం!
జాతిపిత గాంధీజీ పుట్టి నేటికి 150 ఏళ్లు. గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న గాంధీజీ.. ఆ కల సాకారానికి ఆరోగ్యదాయకమైన మన సంప్రదాయక ఆహార సంస్కృతి పరిరక్షణపై దృష్టిసారించారు. కట్టె గానుగలతో స్వచ్ఛమైన నూనెలు, తాటి బెల్లం వంటి ఆరోగ్యదాయకమైన దేశీ ఆహార పదార్థాలతోనే ప్రజల ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుందని నమ్మి.. ఆ దిశగా సమాజాన్ని నడిపించారు. అయితే, కాలక్రమంలో ప్రపంచీకరణ పుణ్యాన ఇవి మరుగున పడిపోవడం.. ఫలితంగా అనేక జబ్బులు గతమెన్నడూ ఎరుగని రీతిలో విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలు, చెక్క గానుగ వంట నూనెలు, తాటి బెల్లం వంటి మన సంప్రదాయ విశిష్ట ఆహారాల ద్వారానే జబ్బులను జయించడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతామని స్వతంత్ర వైద్యులు, ఆహార శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నూనె గింజలను సాగు చేస్తున్న రైతులు ఇంటి దగ్గరే సొంతంగా చెక్క గానుగలను స్వల్ప పెట్టుబడితోనే ఏర్పాటు చేసుకుంటే ఆరోగ్యదాయకమైన గానుగ నూనెలను ఉత్పత్తి చేసి, మంచి ఆదాయం గడించవచ్చు. గీత కార్మికుల సొసైటీలకు తాటి, ఈత నీరా తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులు ఇస్తే.. తమిళనాడు, కర్ణాటకల్లో మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా తాటి బెల్లం ఉత్పత్తిని విస్తృతంగా చేపట్టవచ్చు. తద్వారా గ్రామాల్లోనే వేలాది మందికి ఉపాధి లభించడంతోపాటు ప్రజలకు అమృతాహారాన్ని అందించవచ్చు. మధుమేహ రోగులు సైతం నిశ్చింతగా వాడదగినది, రోగనిరోధక శక్తిని పెంపొందించేది.. తాటి బెల్లమని నిపుణులు సూచిస్తున్నారు! చెక్క గానుగలు, తాటి బెల్లం తయారీ కేంద్రాల ఏర్పాటుకు శిక్షణతోపాటు సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందని గాంధీజీ స్ఫూర్తితో నడుస్తున్న ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్(కేంద్ర ప్రభుత్వ సంస్థ) చెబుతోంది. మహాత్ముడి బోధనలు నేడు మనకు అందిస్తున్న ఆహార స్వరాజ్య స్ఫూర్తి ఇదే! ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్నకొద్దీ రసాయనాలు వాడకుండా తయారు చేసే కట్టె గానుగ వంట నూనెల(కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్)కు తిరిగి ఆదరణ పెరుగుతోంది. దీంతో, నగరాలు, పట్టణాల్లో వీటికి గిరాకీ పెరుగుతోంది. వేరుశనగలు, కుసుమలు, నువ్వులు, కొబ్బరిని సాగు చేస్తున్న రైతులు, రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వీటితో కట్టె గానుగ నూనెలు తీసి అమ్మితే.. ఏడాది పొడవునా మంచి ఆదాయం లభిస్తుంది. కట్టె గానుగలను ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు రుణాలు పొందడానికి అవకాశం ఉంది. సబ్సిడీ రుణాలు పొందడానికి కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ తోడ్పాటును అందిస్తున్నది. హైదరాబాద్‌లోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ రాష్ట్ర కార్యాలయంలో గ్రామీణ పరిశ్రమల విభాగాధికారి మాడుగుల హరి అందించిన వివరాల ప్రకారం.. రైతులు, రైతు సంఘాలతోపాటు.. రైతులు కానప్పటికీ యువతీ యువకులు కూడా సయితం చెక్క గానుగలను గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. కట్టె గానుగల నిర్వహణకు అవసరమైన సాంకేతిక శిక్షణ అందించడంలో ఖాదీ కమీషన్ తోడ్పడుతుంది. ఇప్పటికీ ఎద్దు గానుగలు నడుస్తున్నాయి.. సంప్రదాయ పద్ధతిలో ఎద్దుతో నడిచే కట్టె గానుగలను ఏర్పాటు చేసుకొని, నిర్వహించడం వ్యయప్రయాసలతో కూడి ఉన్నదైనప్పటికీ గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటకలలో కొందరు ఈ రంగంలో కృషి చేస్తున్న వారు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్, మైసూరుకు చెందిన దేశిరి సంస్థ నిర్వాహకులు నవీన్(99458 11771) వంటి వారు కూడా ఎద్దుతో నడిచే కట్టె గానుగలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని, నిర్వహించడంతోపాటు ఇతరులకూ సహాయ సహకారాలను అందిస్తున్నారు. మోటారుతో నడిచే కట్టె గానుగలు ఎద్దులకు బదులు 2 హెచ్. పి.– 3 ఫేజ్ మోటారుతో చిన్న సైజు కట్టె గానుగలను ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమీషన్, వార్థాలోని జమన్‌లాల్ బజాజ్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గతంలోనే అభివృద్ధి చేశాయి. వీటిని చాలా తక్కువ స్థలంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ, ఆవాల నుంచి వీటి ద్వారా నూనె గానుగ ఆడవచ్చు. 8 గంటల్లో 100–120 కిలోల నూనె గింజలను ఆడవచ్చు. 6“6 అడుగుల చోటు, ఇద్దరు పనివారు చాలు. ధర రూ. లక్ష వరకు ఉంటుందని హైదరాబాద్‌లోని ఖాదీ కమీషన్ అధికారులు తెలిపారు. ఖాదీ కమిషన్ ఆధ్వర్యంలో నెల రోజుల శిక్షణ కట్టె గానుగలను గ్రామీణ/పట్టణ ప్రాంతాల్లో నెలకొల్పుకోవడానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని, శిక్షణా సదుపాయాలను ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ అందిస్తున్నది. నాసిక్(మహారాష్ట్ర)లోని డా. అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో అభ్యర్థులకు నెల రోజుల శిక్షణ ఇస్తారు. వసతి ఉచితం. శిక్షణ, మెస్ చార్జీలు కలిపి ఒకరికి రూ. 6,400 ఖర్చవుతుంది. ప్రయాణ ఖర్చులు అదనం. ఈ నెల రోజుల్లో గానుగ నిర్వహణలో పూర్వానుభవం లేని వారు కూడా పూర్తిగా నేర్చుకోగలుగుతారని ఖాదీ కమిషన్ అధికారులు తెలిపారు. రైతు/రైతు సహకార సంఘాలు/ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు/ మహిళా సహకార సంఘాలు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు/ మైనారిటీలు/ ఎస్సీ, ఎస్టీలు/ ఓబీసీలు లేదా వ్యక్తిగతంగా యువతీ యువకులు సైతం ఎద్దుతో నడిచే/ మోటారుతో నడిచే కట్టెగానుగలు నెలకొల్పుకోవడానికి రూ. 10 లక్షల వరకు బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలు పొందవచ్చు. ఇందుకు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ తోడ్పడుతుంది. రుణం పొందటం ఎలా? కట్టె గానుగలకు రుణం కావాల్సిన వారు ఖాదీ కమిషన్ వెబ్సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ పరిశీలించి, అర్హుల ధరఖాస్తులను బ్యాంకులకు పంపుతుంది. బ్యాంకులు ధరఖాస్తుదారులను పిలిచి, వారి వివరాలను తెలుసుకొని, సంతృప్తి చెందితే రుణం మంజూరు చేస్తారు. రుణ మంజూరు తర్వాత ధరఖాస్తుదారులకు 10 రోజులపాటు బ్యాంకు/ ఖాదీ కమిషన్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ ఇస్తారు. రుణ మొత్తంలో 10% ధరఖాస్తుదారులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తొలి విడత రుణాన్ని బ్యాంకు మేనేజర్ విడుదల చేస్తారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సబ్సిడీ (మార్జిన్ మనీ) మొత్తం కోసం బ్యాంకు మేనేజర్ ప్రతిపాదన పంపుతారు. ఆ మొత్తం విడుదలై లబ్ధిదారుల ఖాతాలో డిపాజిట్ అవుతుంది. గానుగ సక్రమంగా నడుస్తూ, నెలవారీ కిస్తీలు సజావుగా చెల్లిస్తూ ఉంటే.. 3 ఏళ్ల తర్వాత ఆ సబ్సిడీ మొత్తం మేరకు అప్పు, వడ్డీతో సహా, తగ్గిపోతుంది. 15%– 35% వరకు సబ్సిడీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రుణాలపై సబ్సిడీ గ్రామీణ జనరల్ అభ్యర్థులకు 25%, అర్బన్ (మునిసిపల్ కార్పొరేషన్/మునిసిపాలిటీ/నగరపంచాయతీ) అభ్యర్థులకు 15% సబ్సిడీ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఓబీసీ, మైనిరిటీ/ మాజీ సైనికులు/ దివ్యాంగులకు గ్రామీణులకైతే 35%, అర్బన్వాసులైతే 25% వరకు సబ్సిడీ లభిస్తుంది. తాటి/ఈత బెల్లం తయారీపై చెన్నైలో శిక్షణ తాటి, ఈత చెట్ల నీరా నుంచి తయారు చేసే బెల్లం అత్యంత ఆరోగ్యదాయకమైనదని గాంధీజీ ఆనాడే గుర్తించారు. దేశీ ఆహారం విశిష్టతనెరిగిన డా. ఖాదర్‌వలి వంటి నిపుణులు ఇప్పుడూ చెబుతూనే ఉన్నారు. తాటి/ఈత చెట్ల నుంచి స్వచ్ఛమైన ఆహార పానీయం నీరాను సేకరించి బెల్లం, పంచదార, పటిక బెల్లం వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. తయారీ పద్ధతులపై చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ పామ్గుర్ అండ్ పామ్ ప్రోడక్ట్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నది. తాటి/ఈత ఉత్పత్తులపై పూర్తిస్థాయి శిక్షణ 4 నెలలు. శిక్షణ ఇప్పించడానికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ సిద్ధంగా ఉంది. చెట్టు నుంచి ఈ ఆహార పానీయాన్ని పులవక ముందు సేకరిస్తే పోషక విలువలతో కూడిన నీరా వస్తుంది. అదే పానీయం పులిస్తే కల్లుగా మారుతుంది. ఎక్సైజ్ శాఖ అనుమతి తప్పనిసరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోట్ల సంఖ్యలో తాటి, ఈత చెట్లు ఉన్నాయి. అయితే, వీటి నుంచి ప్రస్తుతం కల్లు మాత్రమే గీస్తున్నారు. ఈ చెట్లన్నీ ఎక్సైజ్ శాఖ ఆధీనంలో ఉంటాయి. తమ పొలంలో ఉన్న తాటి/ఈత చెట్ల నుంచి కూడా రైతులు ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి పొందనిదే నీరా సేకరించుకోవడానికి వీలు లేదు. గీత కార్మిక సొసైటీలకు కల్లు గీతకు లైసెన్సులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కల్లు వినియోగం నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో లక్షలాది గీత కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో నీరా తీయడానికి ఎక్సైజ్ శాఖ అనుమతి మంజూరు చేస్తే తాటి/ఈత నీరాతో బెల్లం తదితర ఆరోగ్యదాయకమైన ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. తాటి/ఈత బెల్లానికి షుగర్‌ను పెంచే లక్షణం ఉండదు. మధుమేహం ఉన్న వారు కూడా ఈ బెల్లాన్ని వినియోగించవచ్చని, దీని వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెంపొందుతుందని వైద్యులు చెబుతుండటంతో గీత కార్మికులకు మంచి ఆదాయం సమకూరుతుంది. ఆరోగ్యం కోసం కట్టె గానుగలను రక్షించుకోవాలి కట్టె గానుగ నూనె ఎంతో ఆరోగ్యదాయకం. చిన్న వయసులోనే మనుషులు లేనిపోని జబ్బుల పాలవడం, అర్థాయుష్షు.. వంటి విపరిణామాలకు తింటున్న ఆహారం సరైనది కాకపోవడమే కారణం. ఎద్దుతో నడిచే కట్టె గానుగతో తీసిన వంట నూనెలు ఎంతో ఆరోగ్యదాయకం. గాంధీ కలలుకన్న గ్రామస్వరాజ్యానికి కట్టె గానుగ నూనె ఒక ప్రతీక. గ్రామంలో పండే నూనె గింజలు, గ్రామంలో చెట్టు నుంచి వచ్చే కట్టె గానుగ, కట్టె గానుగను తయారు చేసే విశిష్ట నైపుణ్యం కలిగిన కళాకారుడి పరిరక్షణ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుంది. మహాత్ముడి స్ఫూర్తిని బతికించుకోవాలన్న తపనతో 2013 శ్రీరామనవమికి తొలి కట్టె గానుగను ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఈ గానుగల సంఖ్య ఐదుకు పెరిగింది. మా గానుగ చూసి కర్ణాటకలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు 10 చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. జన్యుమార్పిడి పత్తి గింజల నూనెను వంటనూనెలతో కల్తీ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. అటువంటి కల్తీ నూనెల నుంచి మన జాతి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కట్టె గానుగల దేశీ సంస్కతి పరిరక్షణకు అందరం పూనుకోవాలి. కట్టె గానుగ తయారు చేసే కార్పెంటర్లు ఒకరిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. యువతకు శిక్షణ ఇప్పించడం ద్వారా ఈ విశిష్ట కళను కాపాడుకోవాలి. యూనివర్సిటీలు దీనిపై కోర్సు పెట్టాలి. – విజయరామ్, సేవ్ స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్ ఫోన్లు: 040–27654337, 27635867 ఎవరిని సంప్రదించాలి? చెక్క గానుగలు, తాటి/ ఈత బెల్లం తయారీ యూనిట్లు.. చిరుధాన్యాలు, పప్పుధాన్యాల శుద్ధి యంత్రాల యూనిట్లు.. మామిడి తాండ్ర, పచ్చళ్ల తయారీ, నిమ్మ, అనాస, ఉసిరి, బొప్పాయి, సపోట, అరటి తదితర పండ్లతో తయారు చేసే అనేక ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు, నైపుణ్య శిక్షణలు అందించడానికి ఖాదీ కమిషన్ తోడ్పడుతుంది. ఆంధ్ర, తెలంగాణవాసులు చెక్క గానుగలు, తాటి/ఈత బెల్లం తయారీ యూనిట్ల ఏర్పాటుపై పూర్తి వివరాలకు.. హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్ ఆవరణలో గల ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమీషన్ సంచాలకులు వి. చందూలాల్ లేదా గ్రామీణ పరిశ్రమల అధికారి మాడుగుల హరిని 040–29704463 నంబరులో ఆఫీసు వేళల్లో సంప్రదించచ్చు. www.kvic.org.in -
తాటి బెల్లంతో ఆరోగ్యం.. ఆదాయం!
తాటి చెట్ల నుంచి నీరాను సేకరించి ఆరోగ్యదాయకమైన తాటి బెల్లం, తాటి బెల్లం పొడిని ఇంటి వద్దనే సులువుగా తయారు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని (ఆడ, మగ) తాటి చెట్ల నుంచి నీరాను సేకరించవచ్చు. రోజుకు ఒక చెట్టు నుంచి 6 లీటర్ల వరకు నీరాను తీయవచ్చు. దాదాపు 100 లీటర్ల నీరా నుంచి 13-14 కిలోల బెల్లం పొందవచ్చు. ఈ విధంగా తాటి నీరాతో ఇంటి వద్దనే బెల్లం తయారు చేస్తే ఒక గీత కార్మికుడు రోజుకు రూ. 700 -రూ. 1000 వరకు ఆదాయం పొందవచ్చు. తాటి బెల్లం పొడికి మరింత ధర వస్తుంది. గీత కార్మికులు తాటి చెట్ల ద్వారా ఏడాది పొడవునా ఆదాయం పొందే మార్గాలున్నాయని పందిరిమామిడి (తూ. గో. జిల్లా) ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త వెంగయ్య చెబుతున్నారు. ఆయన అందించిన ప్రత్యేక సమాచారం ‘సాగుబడి’ పాఠకుల కోసం.. గ్రామీణ భారతంలో తాటి చెట్టు అత్యంత ప్రాధాన్యత గల చెట్టు. ఈ చెట్టులో పనికిరాని భాగమంటూ లేదు. మన దేశంలో తీరప్రాంత రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, గోవా, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్లో తాటి చెట్లు అధికంగా ఉన్నాయి. భారతదేశంలో సుమారు 12 కోట్ల తాటి చెట్లు ఉన్నట్టు అంచనా. అందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి. తాటి, ఖర్జురా, కొబ్బరి చెట్ల నుంచి కాయలను ఉపయోగించుకోవడం మనకు తెలుసు. కానీ, ఈ చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తుల ద్వారా బెల్లాన్ని, బెల్లం పొడిని కూడా తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఈ చెట్ల నుంచి తీసే నీరా ద్వారా బెల్లం, బెల్లం పొడి తయారు చేయవచ్చు. తాటి నీరాలో ఎక్కువ చక్కెర ఉంటుంది. తాటి చెట్లు రసాయనాలతో ప్రమేయం లేకుండా సహ జ సిద్ధంగా పెరగడం, విరివిగా లభించటం వల్ల చాలా ప్రాముఖ్యత ఉంది. తాటి నుంచి లభ్యమయ్యే విలువైన పదార్థాలలో నీరా అతి ముఖ్యమైనది. తాటి గెలల నుంచి ఊరే రసాన్ని తాజాగా ఉన్నప్పుడు నీరా అంటారు. తాజా నీరా మంచి వాసన, స్పష్టమైన రంగుతో తియ్యగా ఉంటుంది. పులిసిన నీరాను కల్లు అంటారు. ఇది మత్తును క లుగ జే స్తుంది. ఆడ, మగ చెట్ల నుంచి కూడా నీరా లభిస్తుంది. నవంబర్ నుంచే మగ తాటి చెట్ల నీరా! తాటి నీరాలో సుమారు 12-15 వరకు చక్కెర శాతం ఉంటుంది. ఆడ చె ట్ల నుంచి లభించే నీరాలో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. ఆడ చెట్లలో జనవరి నుంచి మే వరకు లభిస్తుంది. మగ చెట్లలో ముందుగా అంటే నవంబర్ నుంచి వస్తుంది. ముదిరిన కాయల నుంచి అక్టోబరు వరకు నీరా వస్తుంది. గీత కార్మికులు నీరాతో తాటి బెల్లం, తాటి బెల్లం పొడిని ఇంటి స్థాయిలోనే తయారు చేయవచ్చు. బెల్లం, చక్కెరకు బదులుగా వీటిని వాడుకోవచ్చు లేదా అమ్ముకొని ఉపాధి పొందవచ్చు. రసాయనాలు లేని ఆరోగ్యదాయకమైనవి కాబట్టి తాటి బెల్లం, తాటి బెల్లం పొడికి పట్టణ, నగర మార్కెట్లలో మంచి ధర కూడా లభిస్తున్నది. ఒక గీతకార్మికుడు రోజుకు సుమారు 12-15 చెట్లు గీయగలడు. ఒక చెట్టుకు సుమారు 1 లీటరు నుంచి 6 లీటర్ల వరకు నీరా వస్తుంది. ఒక చెట్టు నుంచి సాలీనా ఏడాదికి 150 లీటర్ల నీరాను సేకరించవచ్చు. ఈ విధంగా గీత కార్మికులకు సంవత్సరం మొత్తం పని లభించడమే కాకుండా.. అధిక ఆదాయం కూడా లభిస్తుంది. తాటి బెల్లంలో పోషకాలు ఘనం.. పులియని తాజా నీరా నుంచి తాటి బెల్లాన్ని తయారు చేస్తారు. ఈ బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు 76.86, రెడ్యూసింగ్ చక్కెర 1.66, కొవ్వు 0.19, మాంసకృత్తులు 1.04, కాల్షియం 0.86, ఫాస్ఫరస్ 0.05, ఖనిజ లవణాలు 3.15 శాతం, ఇనుము ఉంటాయి. పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తాటి బెల్లం చాలా ఉపయోగం. తాటి బెల్లంతో రక్తహీనతకు చెక్ తాటి బెల్లం విశిష్టత గురించి 100 సంవత్సరాల క్రితం ‘వస్తుగుణ దీపిక’లో రాసి ఉంది. తాటి బెల్లాన్ని క్రమం తప్పకుండా 20 గ్రా. తీసుకోవటం వల్ల అనేక రకాలయిన వ్యాధులు నయం అవుతాయి. ముఖ్యంగా స్త్రీలలో, చిన్న పిల్లల్లో రక్తహీనతను త గ్గిస్తుంది. అంతే కాకుండా తాటి బెల్లాన్ని వాడటం వల్ల వీర్య పుష్టి, దేహ పుష్టి కలుగుతుంది. శరీరానికి చల్లదనం కలిగిస్తుంది. తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం కలిగి ఉండటం వల్ల రక్తపోటు, గుండె వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. దాదాపు 100 లీటర్ల నీరా నుంచి 13-14 కిలోల బెల్లం పొందవచ్చు. తాటి బెల్లం ధర సుమారు కిలో రూ. 200 వరకు ఉంది. ఈ విధంగా తాటి నీరాతో ఇంటి వద్దనే బెల్లం తయారు చేస్తే ఒక గీత కార్మికుడు రోజుకు రూ. 700 -రూ. 1000 వరకు ఆదాయం లభిస్తుంది. జనవరి నుంచి మే వరకు బెల్లం తయారీ ద్వారా ఉపాధి పొందవచ్చు. ఔషధ విలువలు కలిగిన ఈ బెల్లాన్ని ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ వాడుతున్నారు. పటిక బెల్లం, చాక్లెట్లు సహా వివిధ తీపి ఆహార పదార్థాల తయారీలోనూ తాటి బెల్లాన్ని వాడొచ్చు. తాటి బెల్లం పొడి తయారీ సులువే! నీరా నుంచి బెల్లంతో పాటు బెల్లం పొడిని తయారు చేయవచ్చు. బాణలి లేదా పాన్‌లో కాచిన పాకాన్ని అచ్చుల్లో పోస్తే బెల్లం తయారవుతుంది. మంట ఆర్పేసి అలాగే తిప్పుతూ ఉంటే సులువుగానే బెల్లం పొడి సిద్ధమవుతుంది. వినియోగదారులు పంచదారకు బదులుగా వాడుకోవడానికి బెల్లం పొడి అనువుగా ఉంటుంది. తాటి బెల్లానికన్నా బెల్లం పొడికి మార్కెట్లో అధిక ధర లభిస్తుంది. - సేకరణ : సాగుబడి డెస్క్ (తూ. గో. జిల్లా పందిరిమామిడిలోని ఉద్యాన పరిశోధనా కేంద్రం (డా. వై ఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం) సీనియర్ ఆహార -సాంకేతిక విజ్ఞాన శాస్త్ర విభాగం సీనియర్ శాస్త్రవేత్త పి.సి.వెంగయ్యను 94931 28932 నంబరులో సంప్రదించవచ్చు) తాటి బెల్లం తయారీ విధానం.. తాటి నీరాను మరగబెట్టడం ద్వారా బెల్లాన్ని తయారు చేస్తారు. సేకరించే సమయంలో నీరా ఉదజని సూచిక (పీహెచ్) 7.5 ఉండాలి. నీరా తీసే విధానం: 1. పులియకుండా తాజా నీరాను సేకరించేందుకు సున్నం (1 శాతం) వాడాలి. దీని కోసం సేకరించే పాత్రలో సున్నాన్ని పూతగా పూయాలి. ఇది పులియడాన్ని ఆలస్యం చేస్తుంది. ఈ విధంగా సేకరించిన నీరాను వెంటనే 22-24 గేజ్ గల జిఇ షీట్‌తో చేసిన బాణలిలో పోసి, వేడి చేయాలి. రెండు పొంగులు వచ్చే వరకు మరగబెట్టి, చల్లార్చి, వడపోయాలి. ఈ దశలో పీహెచ్‌ను చూడాలి. కొంచెం సూపర్‌ను కలపడం ద్వారా పిహెచ్ 7.5 ఉండే విధంగా చూసి వేడి చేయాలి. నీరా మరుగుతున్నప్పుడు వచ్చే తెట్టును తీసి వేయాలి. ఇలా చే స్తే సున్నం విరుగుతుంది. ఈ విధంగా దాదాపు 2 నుంచి 3 గంటలు మరగబెడితే.. నీరా బాగా చిక్కబడుతుంది. ఈ దశలో ఒక బొట్టును చల్లని నీటిలో వేసి బెల్లం ఏర్పడే దశను గుర్తించవచ్చు. నీటిలో ఇది పాకంలా ఉండకు వస్తుంది. ఉండకు వచ్చిన వెంటనే బాగా కలపడం ద్వారా చల్లార్చి ఫ్రేములో పోస్తే.. మనకు కావలసిన ఆకారంలో బెల్లం అచ్చులు పొందవచ్చు. 2. పందిరిమామిడి పరిశోధనా స్థానంలో పరీక్షించబడిన కూలింగ్ బాక్స్ ఉపయోగించి సులువుగా తాజా నీరాను సేకరించవచ్చు. ఈ విధంగా సేకరించిన నీరాను వెంటనే 22-24 గేజ్గల జిఇషీట్తో చేసిన బాణలి లేదా పాన్‌లో పోసి వేడి చేయాలి. రెండు పొంగులు వచ్చే వరకు వేడి చేసి, చల్లార్చాలి. ఈ విధంగా దాదాపు 2-3 గంటలు మరగబెడితే.. బెల్లం పాకం బాగా చిక్కబడుతుంది. ఇది నీటిలో పాకంలా ఉండకు వస్తుంది. ఉండకు వచ్చిన వెంటనే బాగా కలపాలి. తర్వాత చల్లార్చి ఫ్రేములో పోయడం ద్వారా కావలసిన ఆకారంలో బెల్లం అచ్చులు పొందవచ్చు. తాటి బ్లెలం తయారీలో తీసుకోవలసిన జాగ్రత్తలు : నీరాను మరగబెడుతున్నప్పుడు బాగా కలపడం ద్వారా అడుగు అంటకుండా చూడాలి. నీరాను సేకరించినప్పుడు పీహెచ్ 7.5 లేదా 8 ఉండాలి పెనానికి కొంచెం నూనె పూయటం ద్వారా బెల్లం వృథా కాకుండా చూడవచ్చు. చెక్కతో చేసిన ఫ్రేమును నీటిలో నానబెట్టి వాడితే బెల్లం అచ్చులు సులువుగా వస్తాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి నాణ్యమైన తాటి బెల్లం పొందవచ్చు.