శ్వాస కష్టంగా ఉంది! | sakshi health councling | Sakshi
Sakshi News home page

శ్వాస కష్టంగా ఉంది!

Published Wed, Jun 14 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

sakshi health  councling

హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 40 ఏళ్లు. ఈ మధ్య మాట్లాడుతున్నా, నడుస్తున్నా ఆయాసంగా ఉంటోంది. మగతగా ఉండటం, త్వరగా అలసిపోవడం, శ్వాస కష్టంగా జరుగుతోంది. చర్మం పాలిపోయినట్లు ఉంది. డాక్టర్‌ రక్తం తక్కువగా ఉందని అన్నారు. నా సమస్యకు పరిష్కారం ఉందా?
– సంధ్యారాణి, నిర్మల్‌

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు అనీమియా (రక్తహీనత)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మన రక్తం ఎర్రగా ఉండటానికి అందులోని హీమోగ్లోబిన్‌ అనే పదార్థం కారణం. మన శరీరంలో 100 గ్రాముల రక్తంలో హీమోగ్లోబిన్‌ పరిమాణం మగవారిలోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. హీమోగ్లోబిన్‌ ఇంతకంటే తక్కువ ఉంటే రక్తహీనతగా పరిగణించవచ్చు. అనీమియా లక్షణాలు కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి.
రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల (రెడ్‌ బ్లడ్‌ సెల్స్‌ / ఎరిథ్రోసైట్స్‌) సంఖ్య తగ్గిపోతుంది. దాంతో వాళ్లలో పాలిపోయిన చర్మం, తెల్లబడ్డ గోళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తహీనత అన్నది ప్రధానంగా మహిళల్లో, పిల్లల్లో ఎక్కువ. పౌష్ఠికాహార లోపం దీనికి ఒక ప్రధాన కారణం.

లక్షణాలు: ∙శ్వాస కష్టంగా ఉండటం ∙అలసట ∙చికాకు ∙మగత ∙తలనొప్పి ∙నిద్రపట్టకపోవడం ∙పాదాలలో నీరు చేరడం ∙ఆకలి తగ్గడం మొదలైనవి.

చికిత్స : వ్యాధికి కారణమయ్యే అంశాలను శరీరం నుంచి తొలగించడం ద్వారా వ్యాధిని తగ్గించవచ్చు. హోమియో విధానంలో ఈ ప్రక్రియలో మందులు జన్యుస్థాయికి వెళ్లి అక్కడ రోగకారణాన్ని కనుగొని, దాన్ని అంకురం నుంచి తొలగిస్తాయి. ఇలా ఈ మందులు సదరు జబ్బు పట్ల మన శరీరానికి పూర్తి రోగనిరోధకత కల్పిస్తాయి. రక్తహీనత సమస్యకు హోమియోలో నేట్రమ్‌మూర్, ఫెర్రమ్‌ఫాస్, కాల్కేరియా ఫాస్, నక్స్‌వామికా, అల్యుమినా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్‌ పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

తెల్లమచ్చలు వస్తున్నాయి!
హోమియో కౌన్సెలింగ్‌

నా శరీరమంతా తెల్లమచ్చలు వచ్చాయి. నలుగురిలో వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అన్నారు. ఇది హోమియో మందులతో తగ్గుతుందా? – సంపత్‌కుమార్, విజయనగరం
చర్మంలో రంగునిచ్చే మెలనోసైట్స్‌ అనే కణాలు తగ్గినప్పుడు తెల్ల మచ్చలు వస్తాయి. దీనిని బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్‌ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్‌’ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. ఈ ఎంజైమ్‌ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. ఫలితంగా మెలనిన్‌ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంంది. ఈ టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు.

కారణాలు: – దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి – కొన్నిసార్లు కాలిన గాయాలు – పోషకాహారలోపం – జన్యుపరమైన కారణాలు – దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్‌ సమస్యలు – మందులు, రసాయనాలు – కొన్ని ఎండోక్రైన్‌ గ్రంథులు స్రవించే హర్మోన్‌లలో లోపాలు – వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం లేదా నిరోధక కణాలు మనపైనే దాడి చేయడం వంటివి బొల్లి వ్యాధికి కొన్ని కారణాలు.

లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాళ్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అదే పరిమాణంలో ఉండిపోవచ్చు.

చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స  ఉంది. ఇందుకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాలి. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత వ్యాధికి అవసరమైన కాన్‌స్టిట్యూషనల్‌ మెడిసిన్‌ను ఇస్తారు. తూజా, నైట్రిక్‌ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్‌ ఆల్బమ్, లాపిస్‌ అల్బా, రస్టాక్స్‌ వంటి మందులతో తెల్లమచ్చలను తగ్గించవచ్చు.
డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్, డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

మెడనొప్పి తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్‌


నా వయసు 32 ఏళ్లు. గత ఏడాది కాలం నుంచి తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్‌ అన్నారు. మందులు వాడుతున్నాను. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?
– కె.ఆర్‌.ఆర్‌., నెల్లూరు

స్పాండిలోసిస్‌ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. స్పాండిలోసిస్‌ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్‌. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటారు.

కారణాలు: ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్‌ ఉంటాయి. ఈ జాయింట్స్‌ అరుగుదల వల్ల నొప్పి రావచ్చుజాయింట్స్‌లో వాటర్‌ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు ∙వెన్నుపూసలు దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి దారి ఉంటుంది. ఆ దారి సన్నబడితే నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది.

లక్షణాలు: మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది.

నిర్ధారణ: ∙వ్యాధి లక్షణాలను బట్టి ∙ఎక్స్‌–రే ∙ఎమ్మారై, సీటీ స్కాన్‌

నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం.

చికిత్స: హోమియో ప్రక్రియలో రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి వారి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. ఇలా కాన్‌స్టిట్యూషనల్‌ చికిత్స అందిస్తే క్రమంగా రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధి తీవ్రత క్రమంగా తగ్గుతుంది. దాంతో క్రమక్రమంగా పూర్తిగా వ్యాధి నివారణ జరుగుతుంది.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీనియర్‌ డాక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement