శరీరంలో ఐరన్ లోపించడంతోపాటు పలు ఇతర కారణాల వల్ల కూడా చాలా మందికి రక్తహీనత సమస్య వస్తుంటుంది. అయితే అన్ని జబ్బులకూ మన శరీరంలో ముందస్తుగా లక్షణాలు కనిపించినట్లే.. రక్తహీనత ఉన్నవారిలోనూ పలు లక్షణాలు కనిపిస్తాయి.
వాటిని ముందుగానే గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఎవరిలో అయినా సరే రక్తహీనత ఉందని తెలిపేందుకు వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో... రక్తహీనతను నివారించేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
రక్తహీనత ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొద్ది నిమిషాలు నడిచినా లేదా తేలికపాటి శారీరక శ్రమ చేసినా శ్వాస తీసుకోలేకపోతుంటారు. ఈ సమస్య ఉంటే రక్తహీనత ఉందో, లేదో పరీక్షలు చేయించుకుని, ఆ మేరకు మందులు వాడాలి. రక్తం తక్కువగా ఉంటే రక్తకణాల సంఖ్య కూడా తగ్గుతుంది కాబట్టి చర్మం రంగు మారుతుంది. ఇలా గనక ఉంటే రక్తహీనతే అని అనుమానించాలి.
తగినంత రక్తం లేకపోతే అవయవాలకు ఆక్సిజన్ ను సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఛాతి భాగంలో కొందరికి నొప్పిగా అనిపిస్తుంది. అయితే గ్యాస్ లేదా గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఛాతి నొప్పి వస్తుంది కనుక.. వైద్యున్ని సంప్రదిస్తే ఆ సమస్యకు తగిన కారణాన్ని కనుక్కోవచ్చు.
కొన్ని చిత్రమైన లక్షణాలు
రక్తహీనత ఉన్నవారికి మంచు ముక్కలు, పెన్సిళ్లు, పెయింట్, గోడకు రాసిన సున్నం తదితర పదార్థాలను తినాలపిస్తుంటుంది. ఈ రకమైన వింత లక్షణాలు ఉంటే దాన్ని రక్తహీనగా అనుమానించాల్సి ఉంటుంది.
∙తరచూ తలనొప్పి వస్తున్నా రక్తహీనత అందుకు కారణం అయి ఉండవచ్చు. ఈ క్రమంలో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తే తలనొప్పి కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కనుక తలనొప్పి వస్తున్న వారు రక్తహీనత ఉందని అనుమానించి, పరీక్షలు చేయించుకుని, ఆ విషయాన్ని నిర్దారించుకుని మందులను వాడితే సమస్య నుంచి బయట పడవచ్చు.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
రక్తహీనతకు సరైన మందు మంచి ఆహారం తీసుకోవడమే. ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, మాంసాహారం తీసుకోవాలి. యుక్తవయసులో అమ్మాయిల నుంచి బిడ్డకు జన్మనిచ్చే మహిళల వరకూ అందరికీ ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి.
►బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలను నిత్యం తీసుకోవాలి. మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు.
► రక్తహీనతతో బాధపడే వారు సోయాబీన్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది దేహానికి పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది. బీట్‌రూట్ లో ఐరన్, ప్రొటీన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది.
► రక్తహీనత తగ్గడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలలో నువ్వులది ప్రథమ స్థానం అని చెప్పవచ్చు. నువ్వులను విడిగా కానీ బెల్లంతో కలిపి కాని తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది.
► బెల్లం, వేరుసెనగ పప్పు కలిపి తిన్నా మంచిది. ∙తేనెలో ఐరన్, కాపర్, మాంగనీస్ లు పుష్కలంగా ఉంటాయి. గ్లాసు గోరువెచ్చటి నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తాగితే చాలా బలం. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తీసుకోరాదు.
► అరటిపళ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ రక్తహీనత నివారణకు ఉపకరిస్తాయి. ఇక కిస్‌మిస్, ఉల్లి, క్యారట్, ముల్లంగి, టమాటాలు క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment