చిక్కిశల్యం! | Anemia increasing in ladies and childrens | Sakshi
Sakshi News home page

చిక్కిశల్యం!

Published Tue, Jan 28 2014 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM

Anemia increasing in ladies and childrens

అనంతపురం టౌన్/అర్బన్/ సిటీ, న్యూస్‌లైన్ : మహిళలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా ఉందనడానికి పై రెండు ఉదంతాలే నిదర్శనం. పేదలకు పౌష్టికాహారం పంపిణీ పేరుతో ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. మాతా, శిశు మరణాలను అరికట్టేందుకు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ), వైద్య, ఆరోగ్య శాఖలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదంతా కాగితాలకే పరిమితం.

వాస్తవానికి క్షేత్ర స్థాయిలో నిధులు, పౌష్టికాహారం పక్కదారి పడుతున్నాయి. ఫలితంగా ఏటా వందల సంఖ్యలో మాతా, శిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. పౌష్టికాహార లోపం కారణంగా రక్తహీనత బారినపడి ఎక్కువ శాతం మహిళలు ప్రసవం సమయంలో చనిపోతున్నారు. గర్భస్థ శిశువుల్లో ఎదుగుదల కూడా ఉండడం లేదు. దీంతో వారూ మృత్యువాత పడుతున్నారు.  

 నిద్రమత్తులో వైద్య, ఆరోగ్య శాఖ
 రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నా వైద్య, ఆరోగ్య శాఖ మేల్కోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందులోనూ పేదలే అధిక శాతం ఉండడం గమనార్హం. ఈ సమస్యతో ప్రతి రోజూ పలువురు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి వస్తున్నారు. గ్రామీణ , గిరిజన ప్రాంతాల నుంచే అధిక కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజూ ఒకటి నుంచి 50 దాకా రక్తహీనత కేసులు నమోదవుతున్నాయి. వీరిలో అధిక శాతం గర్భిణులుండగా.. చిన్నారులు 20 శాతం వరకు ఉన్నారు.

ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఐదు లక్షల మంది చిన్నారుల్లో 55 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. వీరి బరువు, ఎత్తును బట్టి ఈ శాతాన్ని గుర్తించారు. అదే రక్తపరీక్ష ద్వారా అయితే మరింత మంది బయటపడే అవకాశం ఉంది. అలాగే 60 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. గ ర్భం దాల్చిన మూడో నెల నుంచే ఐరన్ మాత్రలు అందించాలి. అయితే... క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కన్పించడం లేదు.

ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పురుష ఆరోగ్యకర్తలు, హెల్త్ ఎడ్యుకేటర్లు సరిగా పనిచేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రక్తహీనతతో బాధపడే వారిని ముందస్తుగా గుర్తిస్తే వారికి మెరుగైన వైద్యం అందించి ప్రసవం సులువుగా జరిగేలా చూడవచ్చు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంతో పాటు మాతా శిశు మరణాలను అరికట్టవచ్చు. గర్భిణులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, టీకాలు వేయించుకోకపోవడం వల్ల అభం శుభం తెలియని చిన్నారులు బలైపోవాల్సి వస్తోంది.  

 ఈ ఏడాది కాలంలో రక్తహీనత, బీపీ, శ్వాస సంబంధ వ్యాధులతో 307  మంది గర్భిణులు మరణించారు. ఇందులో 40 శాతం మరణాలు రక్తహీనతతో సంభవించాయని తెలుస్తోంది. చిన్నారుల్లో రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. వీరికి ప్రభుత్వం ఫై సల్ఫేట్ ఐరన్ ఫోలిక్ మాత్రలు అందజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మంది విద్యార్థులకు, లక్ష మంది బడిబయట ఉన్నచిన్నారులకు జవహర్ బాల ఆరోగ్య రక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి గురువారం మాత్రలు అందిస్తున్నారు. ఇవి ఒక్కోసారి వికటిస్తుండడంతో మింగడానికి భయపడుతున్నారు.

 పక్కదారి పడుతున్న పౌష్టికాహారం
 గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న వారిలో రక్తహీనత నివారణ కోసం పౌష్టికాహారం అందించే బాధ్యతను స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) తీసుకున్నాయి. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా 4,286 కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతి రోజూ 39,526 గర్భిణులు, 38,975 మంది బాలింతలు, 2,95,991 మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

వీరందరికీ రోజూ పౌష్టికాహారంతో పాటు వారంలో రెండురోజులు ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాలి. ఇటీవల కణేకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర, కంబదూరు ప్రాజెక్టుల పరిధిలో ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా రోజూ మధ్యాహ్న భోజనం అందించాలి. ఒక గ్లాసు పాలు, కోడిగుడ్లు కూడా ఇవ్వాలి. అయితే.. క్షేత్ర స్థాయిలో పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. పౌష్టికాహార లోపం నివారణ కోసం పాతికేళ్లకు పైగా ఐసీడీఎస్ అధికారులు కృషి చేస్తున్నా ఫలితాలు కన్పించకపోవడమే ఇందుకు నిదర్శనం.

ఇకపోతే ఐసీడీఎస్ కేంద్రాల తరహాలోనే మూడేళ్ల నుంచి ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలోని 24 మండలాల్లో పౌష్టికాహార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారుల ద్వారా రోజూ రూ.5 చొప్పున వసూలు చేసి... రెండు పూటల భోజనం అందించడమే ఈ కేంద్రాల ముఖ్యోద్దేశం. ప్రస్తుతం 24 మండలాల్లో 185 కేంద్రాల ద్వారా దాదాపు 500 మంది గర్భిణులు, 500 మంది బాలింతలు, 600 మంది చిన్నారులకు  పౌష్టికాహారం అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు పూటల భోజనంతో పాటు పాలు, పండ్లు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే... ఈ కేంద్రాలు కూడా సమర్థవంతంగా నడవడం లేదు. లబ్ధిదారుల ద్వారా డబ్బు వసూలు చేస్తుండడం(గతంలో రూ.10 ఉండేది)తో అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేకపోతున్నాయి. ఇప్పటికే  20 కేంద్రాలకు పైగా మూతపడినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement