Indira Kranthi Patham
-
ఐకేపీ అక్రమాల్లో మరో కోణం
కోవూరు(నెల్లూరు) : ఇందిరా క్రాంతిపథంలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల మండలంలోని పోతిరెడ్డిపాళెం గ్రామంలో కొందరు పొదుపు మహిళల నుంచి ఓ అధికారిణి దాదాపు 5 లక్షల వరకు అక్రమంగా వసూలు చేసిందని ఆ గ్రామ పొదుపు మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. కోవూరు ఐకేపీ కార్యాలయంలో సీసీగా పని చేస్తున్న గాజులపల్లి వెంకటసుబ్బమ్మపై పలు ఆరోపణలు వస్తున్నా ఐకేపీ అధికారులు అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే వెంకటసుబ్బమ్మ చేసే అవినీతి అక్రమాల్లో ఐకేపీ అధికారులు కూడా వాటలు ఉన్నాయోమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై పోతిరెడ్డిపాళెం గ్రామ పొదుపు మహిళలు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో పాటు డీఆర్డీఏ పీడీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి వున్నారు. పొదుపు మహిళల కథనం మేరకు.. గాజులపల్లి వెంకటసుబ్బమ్మ గతంలో సీతారామపురం, ఉదయగిరి ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో దాదాపు 23 లక్షల రూపాయలు అవినీతికి పాల్పడిందని అప్పటి జిల్లా స్థాయి అధికారులు విధుల నుంచి తొలగించారు. ఎనిమిది మాసాల పాటు విధులకు హాజరు కాకుండా సస్పెన్షన్ లో ఉన్న వెంకటసుబ్బమ్మ అక్క డ నుంచి నేరుగా కోవూరు ఐకేపీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కూడా పద్ధతి మార్చుకోకుండా అదే ఒరవడిని కొనసాగిస్తుంది. ఎవరైనా గ్రూపు సభ్యులు బ్యాంకులకు అప్పులు ఉన్నారన్న విషయం తెలిస్తే వెంటనే వారి వద్దకు వెళ్ళి మీ అప్పు మొత్తాన్ని ఒకేసారి రద్దు చేసేందుకు అధికారులతో మాట్లాడుతానని, మొత్తంలో సగం చెల్లిస్తే సరిపోతుందని వారి వద్ద నుంచి సగం మొత్తాన్ని తీసుకొని ఆ నగదును ఎవరకీ చెల్లించకుండా వెంకటసుబ్బమ్మ తినేస్తూ ఉండేదని మహిళలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకులు అండదండలు... పొదుపు మహిళలను మోసం చేస్తూ అక్రమంగా వసూళ్ల దందా చేపడుతున్న వెంకటసుబ్బమ్మను ఐకేపీ అధికారులు ఏమీ అనవద్దని టీడీపీ పార్టీకి చెందిన బడా నాయకులు ఐకేపీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. త్వరలో ఐకేపీలో బదిలీల పర్వం ప్రారంభమవుతుందన్న విషయం తెలుసుకొన్న వెంకటసుబ్బమ్మ కోవూరు నుంచి బదిలీ చేయకుండా చూడాలని పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నుంచి ఐకేపీ అధికారులకు ఫోన్లు చేయించడం జరిగింది. ఐకేపీ అధికారులు కూడా వెంకటసుబ్బమ్మ విషయంలో మీనమేషాలు లెక్కించడం పరిపాటిగా మారింది. -
కమీషన్ కోసం రోడ్డెక్కిన మహిళలు
చిన్నకోడూరు: రైతుల ధాన్యం దళారుల పాలు కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొనుగోళ్ల ప్రక్రియలో అవినీతి చోటుచేసుకుంది. గ్రామాల్లో రైతుల నుంచి ధాన్యం, మక్కలు కొనుగోలు చేసేందుకు ఇందిర క్రాంతి పథం పర్యవేక్షణలో స్థానిక మహిళా సం ఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆరేళ్ల క్రితం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్‌లో ప్రారంభమైన కొనుగోలు కేంద్రంలోని మహిళా సంఘాలకు నేటికి కమీషన్ డబ్బు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆరు సంవత్సరాలుగా రబీ, ఖరీఫ్ సీజన్లో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన మహిళా సంఘాలకు సర్కార్ నుంచి కమీషన్ అందిన దాఖలాలు లేవు. ఈ విషయంలో ఐకేపీ సిబ్బందికి కమీషన్ వస్తోందన్న సంగతి తెలుసుకున్న గ్రామైక్య సంఘం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంనగర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామైక్య సంఘం సభ్యులు 2008 సంవత్సరం నుంచి ప్రతి యేటా నిర్వహిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. వారి సేవలకు ప్రభుత్వం కమీషన్ రూపంలో నగదు ప్రోత్సాహకాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. అయితే వారికి తెలియకుండా ఐకేపీ అధికారులు ఈ కమీషన్‌ను గుటుక్కు మనిపిస్తున్నారు. నిజానికి ఈ కమీషన్ వస్తుందనే విషయం మహిళలకు తెలియలేదు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మహిళలు ఆందోళనకు దిగారు. సుమారు రూ. 30 నుంచి 40 లక్షల వరకు తమకు ధాన్యం అమ్మిన కమీషన్ రాకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించా రు. విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన గ్రామ సీఏ సాయికృష్ణ, ఐకేపీ ఏపీఎం ఆంజనేయులను వారు నిలదీసి, వాగ్వాదానికి దిగారు. రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఎస్ఐ ఆనంద్‌గౌడ్ అక్కడికి అక్కడికి వచ్చి ఆందోళనకారులను సముదాయించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో సమస్యను సామరస్యంగా చర్చించుకుందామని చెప్పడంతో వారు రాస్తారోకో విరమించారు. కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకొని ఐకేపీ అధికారుల అవినీతిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008 నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేకపోవడంతో తమకు కమీషన్ అందలేదన్నారు. తమకు అన్యాయం చేసిన వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఏపీఎం ఆంజనేయులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రికార్డులు లేవని, వివరాలను సంగారెడ్డిలోని కార్యాలయంలో పరిశీలించాక సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. -
సంపద ఒకరిది.. సోకు మరొకరిది!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియలో మిల్లర్లు కొత్త రకం అక్రమాలకు తెర తీశారు. ఇప్పటి వరకు ఒకటి, రెండేళ్లు ఆలస్యంగా ఇస్తూ లాభాలు ఆర్జించిన మిల్లర్లు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. నేరుగా స్వాహా చేయకుండా... ప్రభుత్వం ధాన్యాన్ని బగడువు ముగిసిన తర్వాత అధికారులు బియ్యం ఇవ్వాలని అడిగితే... మిల్లర్లకు బదులుగా బ్యాంకులే అడ్డం పడుతున్నాయి. ఇలా ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని జిల్లాలోని పలువురు మిల్లర్లు, బ్యాంకులతో కలిసి ప్రభుత్వ ధాన్యాన్ని స్వాహా చేసే పనులకు దిగారు. కొడకండ్ల మండలం పెద్దవంగరలో ఉన్న చిల్లంచెర్ల ఆగ్రోటెక్ ఇండస్ట్రీ ఇదే పని చేసింది. గత ఖరీఫ్, రబీలో ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ), వ్యవసాయ సహకార సంఘాలు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే రైస్ మిల్లర్లకు ఇచ్చింది. రెండు సీజన్లలోని ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు ఈ నెల 30లోపు బియ్యం అప్పగించాల్సి ఉంటుంది. ఇలా 6236 టన్నుల ధాన్యం తీసుకున్న చిల్లంచెర్ల ఆగ్రోటెక్ ఇండస్ట్రీ మళ్లీ బియ్యం ఇచ్చే విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించింది. గడువు ముగుస్తున్నా ఇవ్వాల్సిన బియ్యంలో 70 శాతమే ఇచ్చింది. మిగిలిన బియ్యం విషయంలో అధికారులు వాస్తవ పరిస్థితిని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ఈ మిల్లర్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో తనఖా పెట్టి కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు అధికారులు గుర్తిం చారు. మిల్లులో ఉన్న సరుకును వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేయగా, రుణం తీరే వరకు కుదరదంటూ బ్యాంకు అధికారులు జిల్లా యంత్రాంగానికి తెలిపారు. ఈ మేరకు కోర్టు నుంచి ఆదేశాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ విధానాల్లోని లోపాలే వల్లే ఇలా జరిగిందని గుర్తించిన పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ జి.కిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై కలెక్టర్ వద్ద ఇటీవల ప్రత్యేకంగా విచారణ జరిగినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి ఉషారాణి ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. తనఖా పెట్టిన సరుకుతో సంబంధం లేకుండా బియ్యాన్ని గడువులోపు ఇచ్చేందుకు మిల్లర్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా 84 శాతమే.. గత ఖరీఫ్, రబీలో ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి 1.88 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి. పౌర సరఫరాల శాఖ ఈ ధాన్యాన్ని జిల్లాలోని 89 రైస్ మిల్లులకు ఇచ్చింది. 2013-2014 లెవీ సీజన్ ముగిసే సెప్టెంబర్ 30 లోపు ఈ ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మిల్లర్లు భారత ఆహార సంస్థ, పౌర సరఫరాల సంస్థకు అప్పగించాల్సి ఉంది. తుది గడువుకు ఇంకా రెం డు రోజులే ఉంది. జిల్లాలో మాత్రం ఇప్పటికి 86 శాతం బియ్య మే పౌర సరఫరాల సంస్థకు చేరింది. మొత్తం 89 మిల్లుల్లో వంద శాతం బియ్యం ఇచ్చినవి 19 మాత్రమే. 99 శాతం లెవీ పూర్తి చేసిన మిల్లులు 36, యాభై శాతంలోపు బియ్యం కోటా అప్పగించిన మిల్లులు నాలుగు ఉన్నాయి. ప్రభుత్వం ప్రమాణాల ప్రకారం క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 68 కిలోల బియ్యం వస్తాయి. ఈ లెక్కన ధాన్యం తీసుకున్న మిల్లర్లు ఇంకా 17,360 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. -
చెల్లెకు లక్ష.. అన్న రక్ష
* మహిళలను మహరాణులను చేసిన వైఎస్ * దేశంలోనే తొలిసారిగా ‘పావలా వడ్డీ’కి శ్రీకారం * వృద్ధ మహిళలకు ఆసరాగా ‘అభయ హస్తం’ (కె. శ్రీకాంత్‌రావు): మహిళల స్వావలంబనకు, సాధికారతకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎనలేని కృషి చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళల కోసం ఇందిరా క్రాంతి పథం కింద స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలను విశేషంగా పెంచారు. అంతేగాక బ్యాంకులిచ్చే రుణాలపై వడ్డీ అధికంగా ఉండటంతో ఆ భారాన్ని తగ్గించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా పావలా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు వైఎస్. మహిళా సంఘాలకు రుణాలివ్వడానికి బ్యాంకులు పూర్తి వెనుకడుగు వేస్తున్న సమయంలో ఈ పథకానికి ఆయన రూపకల్పన చేశారు. మహిళలు తీసుకున్న రుణంలో అసలుతో పాటు వడ్డీ చెల్లిస్తే ఆ వడ్డీని వారికి తిరిగి చెల్లించే (రీయింబర్స్) విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటిదాకా ఏకంగా 14 శాతం ఉన్న వడ్డీ ‘పావలా’ పథకంతో ఒక్క సారిగా 4 శాతానికి తగ్గిపోవడం భారీ ప్రభావం చూపింది. వడ్డీ చెల్లించడానికి మహిళా సంఘాలు ఆసక్తి కనబరచడమే గాక నెలనెలా క్రమం తప్పకుండా అసలును, వడ్డీని చెల్లించడం ప్రారంభించాయి. దాంతో బ్యాంకులకు కూడా రుణాలు మురిగి పోవన్న భరోసా ఏర్పడింది. దాంతో అవి మహిళా సంఘాలకు రుణాలిచ్చే పరిమి తిని పెంచుతూ పోయాయి. ఖజానాపై పావలా వడ్డీ భారం వందల కోట్ల రూపాయలకు చేరుకున్నా వైఎస్ వెనకడుగు వేయలేదు. మహిళా సంఘాలకు అవసరమైన నిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా, ఎప్పటికప్పుడు నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. పండుటాకులకు ఆసరా... 60 ఏళ్లు దాటిన వృద్ధ మహిళలకు ఆసరాగా నిలిచేందుకు, వారు కుటుంబానికి భారం కాకుండా ఉండేందుకు వైఎస్ ప్రారంభించిన బీమా తరహా పథకం అభయహస్తం. 18-59 ఏళ్ల మధ్య వయసు మహిళలంతా ఇందులో చేరడానికి అర్హులు. వారు రోజుకు ఒక రూపాయి పొదుపు చేస్తే అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. 60 ఏళ్లు నిండినప్పటి నుంచి ప్రతి నెలా రూ.500 నుంచి రూ.2,250 దాకా పించన్ వస్తుంది. కొద్ది నెలల్లోనే దాదాపు 45 లక్షల మంది మహిళలు ఈ పథకంలో చేరారు. 4.5 లక్షల మంది వృద్ధులకు ప్రతి నెలా రూ.500 పెన్షన్ మంజూరైంది. ఆయన అనంతరం... వైఎస్ తదనంతరం మహిళా సంఘాలకిచ్చే రుణాన్ని రోశయ్య హయాంలో రూ.5 లక్షలకు పరిమితం చేశారు. అంతకు మించినా, బ్యాంకులకు సకాలంలో వాయిదాలు చెల్లించకపోయినా పావలా వడ్డీ వర్తించదన్నారు. చెల్లించినా సకాలంలో వడ్డీ ఇవ్వకుండా సతాయించారు. అభయహస్తం పథకాన్ని రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు దాదాపు ఆపేసినంత పని చేశాయి! పథకంలో చేరడానికి కూడా అనేక ఆంక్షలు విధించారు. కిరణ్ ‘వడ్డీ లేని రుణాల పథకం’ ప్రకటించినా, తొలి ఆరు నెలలు పైసా కూడా చెల్లించలేదు. రూ.27,000 కోట్ల రుణాలు వైఎస్ సీఎం అయ్యేనాటికి రాష్ట్రంలో 5 లక్షల మహిళా సంఘాలుంటే, ఆయన హయాంలో ఏకంగా 4.5 లక్షలకు పైగా కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మహిళా సంఘాలకు లభించే బ్యాంకు రుణంగా ఎప్పుడూ గరిష్టంగా రూ.25 వేలకు మించలేదు. కానీ వైఎస్ మరణించే నాటికి ప్రతి గ్రూపుకూ సగటున లభించిన బ్యాంకు రుణం ఏకంగా రూ.1.6 లక్షలకు పెరిగింది. అంటే దాదాపు 8 రెట్లు! ఇక బాబు హయాంలో లభించిన బ్యాంకు రు ణాలు రూ.1,898 కోట్లు మాత్రమే ఉంటే వైఎస్ మరణించే నాటికి అవి ఏకంగా రూ.27,000 కోట్లకు చేరాయి. పావలా వడ్డీ పథకం కింద వైఎస్ తన హయాంలో దాదాపు రూ.500 కోట్లు పావలా వడ్డీ కోసం మహిళలకు రీయింబర్స్ చేశారు. అలాగే 2004కు ముందు 5 లక్షల మహిళా సంఘాల్లో 50 లక్షల కంటే తక్కువ మంది సభ్యులుంటే ప్రస్తుతం 12.5 లక్షల సంఘాల్లో 1.25 కోట్ల మంది సభ్యులున్నారు! జగన్ హామీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి రాగానే దాదాపు రూ.20 వేల కోట్ల మహిళా సంఘాల రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించారు. వడ్డీ లేని రుణ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని, నిరుపేద మహిళలతో మరిన్ని సంఘాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని, మహిళా సంఘాలు వాయిదా రోజున అసలు చెల్లించకపోయినా వారికి వడ్డీ రాయితీని అమలు చేస్తామని వివరించారు. -
వద్దనుకున్నవారే.. ముద్దయ్యారు!
విద్యార్థులు వద్దన్నవారే.. వర్సిటీ పెద్దలకు ముద్దవుతున్నారు. అర్హతలు లేకపోయినా.. నిబంధనలు అంగీకరించకపోయినా వారినే చంకనెక్కించుకుంటున్నారు. తమ అంతేవాసులైతే చాలు పోస్టులు కట్టబెడుతూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. వారినే తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. ఇదేమిటని అడిగిన విద్యార్థులను ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారు. గతంలో పనికిరారని తొలగించిన వారినే.. ఇప్పుడు మళ్లీ తీసుకొని తమ పక్షపాత ధోరణిని మరోమారు బట్టబయలు చేసుకున్నారు. ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీకి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి ఆ విద్యాసంస్థ ఉన్నతాధికారి సొంత వర్గం సేవకు ఉపయోగపడుతోంది. వర్సిటీ, విద్యార్థుల భవిష్యత్తు కంటే తన బంధుగణానికి, సామాజక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఆయన దీన్ని వినియోగిస్తున్నారు. ఈ విషయంలో నిబంధనలను కాలరాస్తూ విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ మండలికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ మండలి కూడా వర్సిటీ పరిస్థితి తెలుసుకునేందుకు ప్రయత్నించకుండా మొక్కుబడిగా హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీలో జరుగుతున్న కొన్ని నియామకాలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. గత నవంబర్‌లో గణితం విద్యార్థులు తమకు బగాది శ్రీనివాసరావు అనే టీచింగ్ అసోసియేట్ చెప్పే పాఠాలు అర్థం కావటం లేదని, ఆయన తమకొద్దని వైస్ చాన్సలర్ లజపతిరాయ్‌కి ఫిర్యాదు చేశారు. ఆ శ్రీనివాసరావు వీసీకి దగ్గరి బంధువన్న విషయం అప్పట్లో విద్యార్థులకు తెలియదు. వీసీ సైతం అలాగే వ్యవహరించి ఆయన్ను తక్షణం తొలగిస్తున్నట్లు విద్యార్థులకు చెప్పారు. రెండో సెమిస్టర్నాటికి కొత్త నియామకాలు చేపట్టాలని అప్పటి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య(ప్రస్తత రెక్టార్)ను సైతం ఆదేశించారు. ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. పీహెచ్డీ, నెట్, స్లెట్‌లలో ఏదో ఒక అర్హత ఉన్న వారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి డాక్టరేట్ చేసిన జి.కిరణ్‌కుమార్ అనే వ్యక్తిని తీసుకున్నారు. అప్పటి వరకు కోర్సు కో ఆర్డినేటర్‌గా ఉన్న రవికిశోర్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించి కిరణ్ కుమార్‌కు అప్పగించారు. మిగతా డిపార్ట్మెంట్లలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. కాగా వీసీ బంధువైన బగాది శ్రీనివాసరావును తొలగించినట్లే తొలగించి మళ్లీ అదే ఉద్యోగం కట్టబెట్టారు. డాక్టరేట్ చేసిన అభ్యర్థులు రానందువల్లే ఆయన్ను మళ్లీ నియమించినట్లు సమర్థించుకుంటున్నారు. ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ)లో పని చేస్తున్న డాక్టర్ చింతాడ రామ్మోహన్రావు(ప్రస్తుతం అక్కడ దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు)ను యూనిసెఫ్ జిల్లా కో ఆర్డినేటర్‌గా నియమించడంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సర్వే ముగిసినా, ఆయన్ను ఇక్కడే కొనసాగిస్తూ న్యాయశాస్త్ర విభాగంలో అతిధి బోధకునిగా నియమించారు. ప్రస్తుతం అక్కడ ఏడుగురు టీచింగ్ అసోసియేట్లు ఉన్నారు. పోస్టుల ఖాళీలు కూడా లేవు. దాంతో రామ్మోహనరావును కొనసాగించడానికి తమలో ఎవరిని తొలగిస్తారోనన్న భయం ఆ ఏడుగురిలో నెలకొంది. అయితే ఈ అతిధి బోధకునికి జీతం చెల్లిస్తున్నట్టు గానీ, అధికారికంగా నియమించినట్లు గానీ సమాచారం లేదు. ఇక్కడి కోర్సు కో ఆర్డినేటర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేయటంతో ప్రారంభంలో కొన్ని క్లాసులు ఇచ్చారు. ప్రస్తుతం కొన్ని సబ్జెక్టులను పూర్తిగా అతనికే అప్పగించారు. జియోసైన్స్ విభాగంలో ఉన్న ఇద్దరు బోధకులు చెప్పింది తమకు అర్థం కావడం లేదని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆ కోర్సు చేస్తున్న విద్యార్థులు వీసీకి నేరుగా ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ఇద్దరు టీఏలను తొలగించి డాక్టరేట్ చేసిన ముగ్గురిని నియమించారు. అయితే కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రజా ప్రతినిధులు సిపార్సుతో తొలగించిన ఎ.ఎ. జయరాజ్‌కు సబ్జెక్టు కాంట్రాక్టరుగా, వై.పెంటమ్మ(పద్మిని)ను ల్యాబ్ అసిస్టెంట్‌గా నియమించారు. ఒక రాష్ట్ర మంత్రి సిఫార్సు మేరకు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పీడీకి అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హోదా కట్టబెట్టడంతోపాటు ఆయనకు ఒక అసిస్టెంట్‌ను కూడా నియమించారు. ఇలా ఉన్నతాధికారి బంధువులు, రాజకీయ నాయకుల సిఫా ర్సులతో అడ్డగోలు నియామకాలు జరిగిపోతున్నాయి. ఫీడ్ బ్యాక్‌తో పని లేదు! వాస్తవానికి బోధన సిబ్బంది నియామకాలు, తొలగింపుల్లో విద్యార్థుల అభిప్రాయాల(ఫీడ్‌బ్యాక్)ను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ దానికి విరుద్ధంగా జరుగుతోంది. పేరుకు విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుంటున్నా.. ఆచరణలో వాటిని తుంగలో తొక్కి ఇష్టానుసారం నియామకాలు జరుపుతున్నారు. ఇదేమిటని అధికారులను నిలదీస్తే డిగ్రీ పట్టాలు తీసుకొని ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఉండదని విద్యార్థులు భయపడుతున్నారు. గతంలో వీసీని ఎదిరించిన లా విద్యార్థి లోకేష్ చౌదిరిని పరీక్షల్లో ఫెయిల్ చేశారు. ఆయన పోరాడి ఫలితాన్ని మార్పించుకున్నారు. ఇదే డిపార్టమెంట్‌కు ఒక విద్యార్థినికి ఇంటర్నల్ మార్కులు తగ్గించేశారు. విధేయతను బట్టే ఇంటర్నల్ మార్కులు వేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాల్యుయేషన్లోనూ ఇదే విధానం అనుసరిస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ నిబంధనల మేరకే..:రిజిస్ట్రార్ అయితే ఈ ఆరోపణలను వర్సిటీ రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ కొట్టిపారేస్తున్నారు. నిబంధనల మేరకే నియామకాలు చేపట్టామన్నారు. ఎల్ఎల్బీలో అతిధి బోధకుని నియామకం గురించి మాత్రం తనకు తెలియదని చెప్పారు. అతనికి జీతం కూడా చెల్లించటం లేదన్నారు. జీయో సైన్సు బోధకుల విషయంలో కమిటీ వేసి తీసుకున్నామని చెప్పారు. తక్కువ మార్కులతో భవిష్యత్తుకు దెబ్బ ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో తమకు చాలా తక్కువ మార్కులు వచ్చాయని, దీనివల్ల తమ భవి ష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ గణితం విద్యార్థులు రెక్టార్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్యకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఎక్కువమందికి ఈ గ్రేడ్ మార్కులు వచ్చాయని.. దీనివల్ల తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. బోధకులు చెప్పిన పాఠ్యాంశాల్లోని ప్రశ్నలు పరీక్షల్లో రాలేదని వైస్‌చాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం చేయలేదన్నారు. దీనివల్ల కనీసం 60 శాతం మార్కులు కూడా రాని పరిస్థితి ఎదురైందని చెప్పారు. అర్హత గల బోధకులు లేకపోవటం, సిలబస్‌లో లేని ప్రశ్నలు రావటం, మూల్యాం కన సక్రమంగా లేకపోవటం వంటి కారణాల వల్లే మార్కులు తగ్గాయని వివరించారు. రెక్టార్ చంద్రయ్య స్పందిస్తూ.. బోధకుల నియామకానికి పీహెచ్డీ, నెట్, స్లెట్ అర్హుల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని, ఆ అర్హతలున్న అభ్యర్థులు రాకపోవటంతో నిబంధనలు సడలించి నియామకాలు చేపట్టామని వివరించారు. పరీక్షలు మెరుగ్గా రాసినా కూడా మార్కులు రాలేదని భావిస్తున్న విద్యార్థులు రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీసం మూడు సబ్జెక్టుల మార్కులపై తమకు అనుమానం ఉందని, అయితే సబ్జెక్టుకు రూ.500 చొప్పున రీవాల్యూయేషన్ ఫీజు చెల్లించటం భారం అవుతుందని విద్యార్థులు పేర్కొన్నారు. రుసుం తగ్గించాలని డిమాండ్ చేశారు. రుసుం తగ్గించటం సాధ్యం కాదని, అయినా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని రెక్టార్ చెప్పారు. దూరవిద్య ద్వారా ఎమ్మెస్సీ(గణితం) చేసినవారికి 80 శాతం వరకు మార్కులు వస్తున్నాయని, రెగ్యులర్ విద్యార్థులమైన తమకు ఇంత తక్కువ మార్కులు వేయటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. పీజీ చేస్తున్న 42 మందిలో నలుగురు ఫెయిల్ కూడా అయ్యారన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
చిక్కిశల్యం!
అనంతపురం టౌన్/అర్బన్/ సిటీ, న్యూస్‌లైన్ : మహిళలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా ఉందనడానికి పై రెండు ఉదంతాలే నిదర్శనం. పేదలకు పౌష్టికాహారం పంపిణీ పేరుతో ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. మాతా, శిశు మరణాలను అరికట్టేందుకు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ), వైద్య, ఆరోగ్య శాఖలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదంతా కాగితాలకే పరిమితం. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో నిధులు, పౌష్టికాహారం పక్కదారి పడుతున్నాయి. ఫలితంగా ఏటా వందల సంఖ్యలో మాతా, శిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. పౌష్టికాహార లోపం కారణంగా రక్తహీనత బారినపడి ఎక్కువ శాతం మహిళలు ప్రసవం సమయంలో చనిపోతున్నారు. గర్భస్థ శిశువుల్లో ఎదుగుదల కూడా ఉండడం లేదు. దీంతో వారూ మృత్యువాత పడుతున్నారు. నిద్రమత్తులో వైద్య, ఆరోగ్య శాఖ రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నా వైద్య, ఆరోగ్య శాఖ మేల్కోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందులోనూ పేదలే అధిక శాతం ఉండడం గమనార్హం. ఈ సమస్యతో ప్రతి రోజూ పలువురు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి వస్తున్నారు. గ్రామీణ , గిరిజన ప్రాంతాల నుంచే అధిక కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజూ ఒకటి నుంచి 50 దాకా రక్తహీనత కేసులు నమోదవుతున్నాయి. వీరిలో అధిక శాతం గర్భిణులుండగా.. చిన్నారులు 20 శాతం వరకు ఉన్నారు. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఐదు లక్షల మంది చిన్నారుల్లో 55 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. వీరి బరువు, ఎత్తును బట్టి ఈ శాతాన్ని గుర్తించారు. అదే రక్తపరీక్ష ద్వారా అయితే మరింత మంది బయటపడే అవకాశం ఉంది. అలాగే 60 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. గ ర్భం దాల్చిన మూడో నెల నుంచే ఐరన్ మాత్రలు అందించాలి. అయితే... క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కన్పించడం లేదు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పురుష ఆరోగ్యకర్తలు, హెల్త్ ఎడ్యుకేటర్లు సరిగా పనిచేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రక్తహీనతతో బాధపడే వారిని ముందస్తుగా గుర్తిస్తే వారికి మెరుగైన వైద్యం అందించి ప్రసవం సులువుగా జరిగేలా చూడవచ్చు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంతో పాటు మాతా శిశు మరణాలను అరికట్టవచ్చు. గర్భిణులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, టీకాలు వేయించుకోకపోవడం వల్ల అభం శుభం తెలియని చిన్నారులు బలైపోవాల్సి వస్తోంది. ఈ ఏడాది కాలంలో రక్తహీనత, బీపీ, శ్వాస సంబంధ వ్యాధులతో 307 మంది గర్భిణులు మరణించారు. ఇందులో 40 శాతం మరణాలు రక్తహీనతతో సంభవించాయని తెలుస్తోంది. చిన్నారుల్లో రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. వీరికి ప్రభుత్వం ఫై సల్ఫేట్ ఐరన్ ఫోలిక్ మాత్రలు అందజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మంది విద్యార్థులకు, లక్ష మంది బడిబయట ఉన్నచిన్నారులకు జవహర్ బాల ఆరోగ్య రక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి గురువారం మాత్రలు అందిస్తున్నారు. ఇవి ఒక్కోసారి వికటిస్తుండడంతో మింగడానికి భయపడుతున్నారు. పక్కదారి పడుతున్న పౌష్టికాహారం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న వారిలో రక్తహీనత నివారణ కోసం పౌష్టికాహారం అందించే బాధ్యతను స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) తీసుకున్నాయి. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా 4,286 కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతి రోజూ 39,526 గర్భిణులు, 38,975 మంది బాలింతలు, 2,95,991 మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరందరికీ రోజూ పౌష్టికాహారంతో పాటు వారంలో రెండురోజులు ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాలి. ఇటీవల కణేకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర, కంబదూరు ప్రాజెక్టుల పరిధిలో ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా రోజూ మధ్యాహ్న భోజనం అందించాలి. ఒక గ్లాసు పాలు, కోడిగుడ్లు కూడా ఇవ్వాలి. అయితే.. క్షేత్ర స్థాయిలో పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. పౌష్టికాహార లోపం నివారణ కోసం పాతికేళ్లకు పైగా ఐసీడీఎస్ అధికారులు కృషి చేస్తున్నా ఫలితాలు కన్పించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇకపోతే ఐసీడీఎస్ కేంద్రాల తరహాలోనే మూడేళ్ల నుంచి ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలోని 24 మండలాల్లో పౌష్టికాహార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారుల ద్వారా రోజూ రూ.5 చొప్పున వసూలు చేసి... రెండు పూటల భోజనం అందించడమే ఈ కేంద్రాల ముఖ్యోద్దేశం. ప్రస్తుతం 24 మండలాల్లో 185 కేంద్రాల ద్వారా దాదాపు 500 మంది గర్భిణులు, 500 మంది బాలింతలు, 600 మంది చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు పూటల భోజనంతో పాటు పాలు, పండ్లు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే... ఈ కేంద్రాలు కూడా సమర్థవంతంగా నడవడం లేదు. లబ్ధిదారుల ద్వారా డబ్బు వసూలు చేస్తుండడం(గతంలో రూ.10 ఉండేది)తో అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేకపోతున్నాయి. ఇప్పటికే 20 కేంద్రాలకు పైగా మూతపడినట్లు సమాచారం. -
కదంతొక్కిన ‘మధ్యాహ్న’ కార్మికులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మధ్యాహ్న భోజన కార్మికులను తొలగిం చాలని ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) పీడీ ఇచ్చి న ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూ నియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ.. ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్న కార్మికులను తొలగించాలని ఐకేపీ పీడీ ఉత్తర్వులు జారీ చేశారని, డిసెంబర్‌లోగా కొత్త వారిని నియమించాలని పేర్కొన్నారని తె లిపారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా జిల్లాలో ఉత్తర్వులు ప్రవేశపెట్టి 12 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించడం సమంజసం కాదన్నారు. జిల్లాలో 6,750 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని, వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన వారిని వెంటనే పనిలోకి తీసుకోవాలని, కోడిగుడ్లకు, అరటిపండ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలన్నారు. ప్రతినెలా మొదటి వారంలోపే బిల్లులు అందేలా చూడాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, వంటషెడ్లు, మంచినీరు, గంజులు, గ్యాస్‌పొయ్యి అందించాలని డిమాం డ్ చేశారు. వంట సరుకులను ప్రభుత్వమే సరఫ రా చేయాలని, ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్ అహ్మద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మోనవ్వ, జిల్లా అధ్యక్షురాలు భారతీబాయి, ఉపాధ్యక్షురాలు రూప, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ముంజం శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు. పలువురి మద్దతు.. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న మధ్యాహ్న భో జన కార్మికులకు పలువురు నాయకులు మ ద్ద తు తెలిపారు. టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షు డు లోకా భూమారెడ్డి, టీడీపీ నాయకులు యూ నిస్ అక్బానీ, మున్సిపల్ మాజీ చైర్మన్ యాసం నర్సింగ్‌రావు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు నారాయణ, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇదేం తిక్క!
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: మక్క రైతుకు సర్కారు నూతన సంవత్సరంలో ఝలక్ ఇచ్చింది. 24 గంటల్లోగా జిల్లాలోని మక్కల కొనుగోలు కేంద్రాలను మూసివేయాలంటూ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో మక్క రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పైగా కేంద్రాల నిర్వహణను పొడిగించాలని రైతు సంఘాలు పెట్టుకున్న అర్జీలు బుట్టదాఖలయ్యాయి. అసలే జిల్లాలోని 14 కొనుగోలు కేంద్రాల్లో భారీగా నిల్వలు పేరుకుపోయాయి. ఈ క్రమంలో సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1.25 లక్షల హెక్టార్లలో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. రైతుకు మద్దతు ధర అందించే సదుద్దేశంతో ప్రభుత్వం ఇం దిరా క్రాంతి పథం ద్వారా కొనుగోలు ప్రక్రియను చేపట్టింది. పెద్ద ఎత్తున వస్తున్న దిగుబడులను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ పర్యవేక్షణలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత అక్టోబర్ నెలలో 14 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చారు. మార్క్‌ఫెడ్ అధికారులు డిసెంబర్ నాటి కి సుమారు 4 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 15 నాటికే కొనుగోలు కేంద్రాలను మూసివేయాల్సి ఉంది. కాని రైతుల వద్ద పెద్ద ఎత్తున మక్కల నిల్వలు ఉండటం, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు సైతం పెద్ద ఎత్తున ఉత్పత్తులు తరలివస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు కొనుగోలు ప్రక్రియను కొద్దిరోజులు పొడగించారు. సుమారు 30 శాతం మక్కలు ఇంకా రైతుల వద్దే ఉన్నాయనే కారణంతో కొనుగోలు కేంద్రాల కొనసాగింపునకు రైతు సంఘాలు ప్రభుత్వానికి అభ్యర్థనలు చేసుకుంది. ఈ క్రమంలో కొత్త ఏడాది జనవరి మాసాంతం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయన్న ధీమాలో ఉన్న మక్కరైతుకు ప్రభుత్వం సోమవారం షాక్ఇచ్చింది. ఈ నెల 7వ తేదీని కొనుగోలుకు చివరి గడువుగా ప్రకటిస్తూ.. బుధవారం నుంచి కొనుగోలు కేంద్రాలను మూసి వేయాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఏంచేయాలో పాలుపోక రైతులు తీవ్రఆందోళనకు గురవుతున్నారు. -
నిధులు గోల్మాల్ !
భద్రాచలం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో(టీపీఎంయూ పరిధిలో)ని 19 మండలాల గిరిజన మహిళల అభివృద్ధి కోసం భద్రాచలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇందిరాక్రాంతి పథం పాలన గాడి తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంతో సంబంధం లేకుండా ట్రైబల్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్(టీపీఎంయూ)పరిధిలోకి వచ్చే ఏజెన్సీ మండలాల్లో మహిళా సమాఖ్యలకు తోడ్పాటునందించేందుకు ఏపీడీ స్థాయి హోదా గల అధికారిని నియమించినప్పటికీ లక్ష్యం నెరవేరటం లేదు. సమాఖ్యల నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు దుబారా అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పర్యవేక్షణాధికారులే కమీషన్లకు కక్కుర్తి పడుతుండటంతో కింది స్థాయి సిబ్బంది సమాఖ్యల నిధులను కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులకు తప్పు డు నివేదికలు ఇస్తూ కాగితాల్లో ప్రగతి చూపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. మహిళా సమాఖ్యల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే పావలా వడ్డీ రుణాలను కూడా సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమాయక గి రిజన మహిళలకు మాయమాటలు చెప్పి వారి తోనే తీర్మానాలు చేయించి డబ్బు డ్రా చేసుకుంటున్నారని, ఆ మొత్తంతో వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని ‘న్యూస్‌లైన్’ పరిశీలన లో తెలిసింది. నిబంధనలు పట్టవా..? అత్యంత నిరుపేదలను గుర్తించేందుకు చేపట్టాల్సిన సర్వేకు అవసరమైన పుస్తకాల ముద్రణలో నిధులు కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణ ఉంది. 19 మండలాల్లో సుమారు లక్ష కుటుంబాలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాలని ఐకేపీ అధికారులు భావించారు. అయితే పుస్తకాల ముద్రణ విషయంలో నిబంధనలు కాలరాశారు. వాస్తవంగా ఈ పనులకు టెండర్లు పిలిచి, ఉన్నతాధికారుల సమక్షంలో తెరవాలి. తక్కువ కోట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ వారికి పనులు అప్పగించాలి. మైదాన ప్రాంత మండలాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (డీపీఎంయూ) అధికారులు ఈ పద్ధతినే జేసీ సమక్షంలో పారదర్శకంగా పనులు చేపట్టారు. కానీ భద్రాచలం ఐకేపీ అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారని, తమకు అనుకూలంగా ఉన్న ఓ ప్రింటింగ్ ప్రెస్ యజమాని నుంచి ఒకే కొటేషన్ తీసుకొని పనులు అప్పగించారని, దీనికి కనీసం ప్రొక్యూర్మెంట్ కమిటీ అనుమతులు కూడా తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. ఖమ్మంలో ఒక పేజీ ముద్రణకు రూ. 0.80 పైసల చొప్పున అప్పగించగా, ఇక్కడి అధికారులు మాత్రం రూ.1.13 పైసలకు కట్టబెట్టారు. గత ఏడాది ఇదే సర్వే పుస్తకాల కోసం ఒక పేజీకి రూ 0.47 పైసలే అప్పటి అధికారులు వెచ్చించడం గమనార్హం. ప్రస్తుతం ముద్రణ కోసం రూ.6.75 లక్షల ఖర్చు చూపిస్తూ బిల్లుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపించేందుకు సిద ్ధమైనట్లు సమాచారం. దీంతో ఐకేపీపై రూ.2 లక్షల వరకు అదనపు భారం పడుతున్నట్లు తెలిసింది. ఈ మొత్తాన్ని సదరు ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఇక్కడి పర్యవేక్షణాధికారికి కమీషన్ రూపంలో ముట్టజెప్పేందుకు ఒప్పం దం కుదుర్చుకున్నారని ఆరోపణలున్నాయి. సమాఖ్యల డబ్బు సొంతానికి... మహిళా సమాఖ్య(వీవో)ల ఖాతాల్లో ఉన్న డబ్బును కొంతమంది ఐకేపీ సిబ్బంది సొంతానికి వాడుకుంటున్నారు. వాటితో వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీఆర్‌పురం మండలం కొటారుగొమ్ము గ్రామ సమాఖ్య నుంచి ఈ ఏడాది మార్చి 11న రూ.50 వేలు మండల సమాఖ్య వారు అప్పుగా తీసుకున్నారు. ఇదే విషయాన్ని కొటారుగొమ్ము వీవో వారు తీర్మానం పుస్తకంలో పొందుపరిచారు. కానీ ఈ డబ్బును వారి వద్ద నుంచి అప్పుగా తీసుకున్నట్లు మండల సమాఖ్య తీర్మానంలో కనిపించకపోవటం గమనార్హం. వీవో నుంచి ఎంఎంఎస్కు డబ్బులు అప్పు ఇచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ అది బ్యాంకు ఖాతా నుంచి ఖాతాకే సర్దుబాటు చేయాలి తప్ప నగదు రూపంలో ఇచ్చే వీలు లేదు. కానీ ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించారు. ఈ వ్యవహారం బయటకు పొక్కటంతో అక్కడి సిబ్బంది తీసుకున్న డబ్బును ఆగస్టు 23న తిరిగి ఇచ్చేశారు. ఈ డబ్బును కొటారుగొమ్ము వీవో వారు తమ ఖాతాలో నగదు రూపంలోనే వేసుకున్నారు. ఒక వేళ ఎంఎంఎస్ డబ్బులు అప్పుగా తీసుకుంటే ఇచ్చేటప్పుడైనా తీర్మానం మేరకు ఖాతానుంచి వీవో ఖాతాకు మాత్రమే జమచేయాలి. ఇక్కడ అలా జరుగకపోవటంతో సమాఖ్యల డబ్బులు సిబ్బంది వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోందని పలువురు అంటున్నారు. ఇదే రీతిన చింతూరు మండలం తులసిపాక గ్రామైక్య సంఘంలోనూ చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఇక్కడ రూ.1.20 లక్షలు తీర్మానం లేకుండానే చిన్న సంఘాలకు అప్పుల పేరుతో బ్యాంకు నుంచి డ్రా చేసిన సిబ్బంది.. వాటితో వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీడీ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో సమాఖ్యల ఆర్థిక లావాదేవీలపై పర్యవేక్షించకపోవడం వల్లే ఇలాటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భద్రాచలం ఐకేపీలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని గిరిజన సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు.