సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: మక్క రైతుకు సర్కారు నూతన సంవత్సరంలో ఝలక్ ఇచ్చింది. 24 గంటల్లోగా జిల్లాలోని మక్కల కొనుగోలు కేంద్రాలను మూసివేయాలంటూ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో మక్క రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పైగా కేంద్రాల నిర్వహణను పొడిగించాలని రైతు సంఘాలు పెట్టుకున్న అర్జీలు బుట్టదాఖలయ్యాయి. అసలే జిల్లాలోని 14 కొనుగోలు కేంద్రాల్లో భారీగా నిల్వలు పేరుకుపోయాయి. ఈ క్రమంలో సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది 1.25 లక్షల హెక్టార్లలో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. రైతుకు మద్దతు ధర అందించే సదుద్దేశంతో ప్రభుత్వం ఇం దిరా క్రాంతి పథం ద్వారా కొనుగోలు ప్రక్రియను చేపట్టింది. పెద్ద ఎత్తున వస్తున్న దిగుబడులను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ పర్యవేక్షణలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత అక్టోబర్ నెలలో 14 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చారు. మార్క్‌ఫెడ్ అధికారులు డిసెంబర్ నాటి కి సుమారు 4 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 15 నాటికే కొనుగోలు కేంద్రాలను మూసివేయాల్సి ఉంది. కాని రైతుల వద్ద పెద్ద ఎత్తున మక్కల నిల్వలు ఉండటం, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు సైతం పెద్ద ఎత్తున ఉత్పత్తులు తరలివస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు కొనుగోలు ప్రక్రియను కొద్దిరోజులు పొడగించారు.
సుమారు 30 శాతం మక్కలు ఇంకా రైతుల వద్దే ఉన్నాయనే కారణంతో కొనుగోలు కేంద్రాల కొనసాగింపునకు రైతు సంఘాలు ప్రభుత్వానికి అభ్యర్థనలు చేసుకుంది. ఈ క్రమంలో కొత్త ఏడాది జనవరి మాసాంతం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయన్న ధీమాలో ఉన్న మక్కరైతుకు ప్రభుత్వం సోమవారం షాక్‌ఇచ్చింది. ఈ నెల 7వ తేదీని కొనుగోలుకు చివరి గడువుగా ప్రకటిస్తూ.. బుధవారం నుంచి కొనుగోలు కేంద్రాలను మూసి వేయాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఏంచేయాలో పాలుపోక రైతులు తీవ్రఆందోళనకు గురవుతున్నారు.
ఇదేం తిక్క!
Published Mon, Jan 6 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement
Advertisement