వద్దనుకున్నవారే.. ముద్దయ్యారు! | who are agianst they only supported | Sakshi
Sakshi News home page

వద్దనుకున్నవారే.. ముద్దయ్యారు!

Published Thu, Feb 20 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

who are agianst they only supported

విద్యార్థులు వద్దన్నవారే.. వర్సిటీ పెద్దలకు ముద్దవుతున్నారు. అర్హతలు లేకపోయినా.. నిబంధనలు అంగీకరించకపోయినా వారినే చంకనెక్కించుకుంటున్నారు. తమ అంతేవాసులైతే చాలు పోస్టులు కట్టబెడుతూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. వారినే తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. ఇదేమిటని అడిగిన విద్యార్థులను ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారు. గతంలో పనికిరారని తొలగించిన వారినే.. ఇప్పుడు మళ్లీ తీసుకొని తమ పక్షపాత ధోరణిని మరోమారు బట్టబయలు చేసుకున్నారు.
 
 ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్:
 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీకి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి ఆ విద్యాసంస్థ ఉన్నతాధికారి సొంత వర్గం సేవకు ఉపయోగపడుతోంది. వర్సిటీ, విద్యార్థుల భవిష్యత్తు కంటే తన బంధుగణానికి, సామాజక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఆయన దీన్ని వినియోగిస్తున్నారు. ఈ విషయంలో నిబంధనలను కాలరాస్తూ విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ మండలికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ మండలి కూడా వర్సిటీ పరిస్థితి తెలుసుకునేందుకు ప్రయత్నించకుండా మొక్కుబడిగా హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీలో జరుగుతున్న కొన్ని నియామకాలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.
 
   గత నవంబర్‌లో గణితం విద్యార్థులు తమకు బగాది శ్రీనివాసరావు అనే టీచింగ్ అసోసియేట్ చెప్పే పాఠాలు అర్థం కావటం లేదని, ఆయన తమకొద్దని వైస్ చాన్సలర్ లజపతిరాయ్‌కి ఫిర్యాదు చేశారు. ఆ శ్రీనివాసరావు వీసీకి దగ్గరి బంధువన్న విషయం అప్పట్లో విద్యార్థులకు తెలియదు. వీసీ సైతం అలాగే వ్యవహరించి ఆయన్ను తక్షణం తొలగిస్తున్నట్లు విద్యార్థులకు చెప్పారు. రెండో సెమిస్టర్‌నాటికి కొత్త నియామకాలు చేపట్టాలని అప్పటి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య(ప్రస్తత రెక్టార్)ను సైతం ఆదేశించారు. ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. పీహెచ్‌డీ, నెట్, స్లెట్‌లలో ఏదో ఒక అర్హత ఉన్న వారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి డాక్టరేట్ చేసిన జి.కిరణ్‌కుమార్ అనే వ్యక్తిని తీసుకున్నారు. అప్పటి వరకు కోర్సు కో ఆర్డినేటర్‌గా ఉన్న రవికిశోర్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించి కిరణ్ కుమార్‌కు అప్పగించారు. మిగతా డిపార్ట్‌మెంట్లలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. కాగా వీసీ బంధువైన బగాది శ్రీనివాసరావును తొలగించినట్లే తొలగించి  మళ్లీ అదే ఉద్యోగం కట్టబెట్టారు. డాక్టరేట్ చేసిన అభ్యర్థులు రానందువల్లే ఆయన్ను మళ్లీ నియమించినట్లు సమర్థించుకుంటున్నారు.
 
   ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ)లో పని చేస్తున్న డాక్టర్ చింతాడ రామ్మోహన్‌రావు(ప్రస్తుతం అక్కడ దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు)ను యూనిసెఫ్ జిల్లా కో ఆర్డినేటర్‌గా నియమించడంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ  సర్వే ముగిసినా, ఆయన్ను ఇక్కడే కొనసాగిస్తూ న్యాయశాస్త్ర విభాగంలో అతిధి బోధకునిగా నియమించారు. ప్రస్తుతం అక్కడ ఏడుగురు టీచింగ్ అసోసియేట్లు ఉన్నారు. పోస్టుల ఖాళీలు కూడా లేవు. దాంతో రామ్మోహనరావును కొనసాగించడానికి తమలో ఎవరిని తొలగిస్తారోనన్న భయం ఆ ఏడుగురిలో నెలకొంది.  అయితే ఈ అతిధి బోధకునికి జీతం చెల్లిస్తున్నట్టు గానీ, అధికారికంగా నియమించినట్లు గానీ  సమాచారం లేదు. ఇక్కడి కోర్సు కో ఆర్డినేటర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేయటంతో ప్రారంభంలో కొన్ని క్లాసులు ఇచ్చారు. ప్రస్తుతం కొన్ని సబ్జెక్టులను పూర్తిగా అతనికే అప్పగించారు.
 
   జియోసైన్స్ విభాగంలో ఉన్న ఇద్దరు బోధకులు చెప్పింది తమకు అర్థం కావడం లేదని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆ కోర్సు చేస్తున్న విద్యార్థులు వీసీకి నేరుగా ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ఇద్దరు టీఏలను తొలగించి డాక్టరేట్ చేసిన ముగ్గురిని నియమించారు. అయితే కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రజా ప్రతినిధులు సిపార్సుతో తొలగించిన ఎ.ఎ. జయరాజ్‌కు సబ్జెక్టు కాంట్రాక్టరుగా, వై.పెంటమ్మ(పద్మిని)ను ల్యాబ్ అసిస్టెంట్‌గా నియమించారు. ఒక రాష్ట్ర మంత్రి సిఫార్సు మేరకు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పీడీకి అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హోదా కట్టబెట్టడంతోపాటు ఆయనకు ఒక అసిస్టెంట్‌ను కూడా నియమించారు. ఇలా ఉన్నతాధికారి బంధువులు, రాజకీయ నాయకుల సిఫా ర్సులతో అడ్డగోలు నియామకాలు జరిగిపోతున్నాయి.
 
 ఫీడ్ బ్యాక్‌తో పని లేదు!
 వాస్తవానికి బోధన సిబ్బంది నియామకాలు, తొలగింపుల్లో విద్యార్థుల అభిప్రాయాల(ఫీడ్‌బ్యాక్)ను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ దానికి విరుద్ధంగా జరుగుతోంది. పేరుకు విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుంటున్నా.. ఆచరణలో వాటిని తుంగలో తొక్కి ఇష్టానుసారం నియామకాలు జరుపుతున్నారు. ఇదేమిటని అధికారులను నిలదీస్తే డిగ్రీ పట్టాలు తీసుకొని ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఉండదని విద్యార్థులు భయపడుతున్నారు. గతంలో వీసీని ఎదిరించిన లా విద్యార్థి లోకేష్ చౌదిరిని పరీక్షల్లో ఫెయిల్ చేశారు. ఆయన  పోరాడి ఫలితాన్ని మార్పించుకున్నారు. ఇదే డిపార్టమెంట్‌కు ఒక విద్యార్థినికి ఇంటర్నల్ మార్కులు తగ్గించేశారు. విధేయతను బట్టే ఇంటర్నల్ మార్కులు వేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాల్యుయేషన్‌లోనూ ఇదే విధానం అనుసరిస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 అన్నీ నిబంధనల మేరకే..:రిజిస్ట్రార్  
 అయితే ఈ ఆరోపణలను వర్సిటీ రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ కొట్టిపారేస్తున్నారు. నిబంధనల మేరకే నియామకాలు చేపట్టామన్నారు. ఎల్‌ఎల్‌బీలో అతిధి బోధకుని  నియామకం గురించి మాత్రం తనకు తెలియదని చెప్పారు. అతనికి జీతం కూడా చెల్లించటం లేదన్నారు. జీయో సైన్సు బోధకుల విషయంలో కమిటీ వేసి తీసుకున్నామని చెప్పారు.
 
 తక్కువ మార్కులతో భవిష్యత్తుకు దెబ్బ
 ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో తమకు చాలా తక్కువ మార్కులు వచ్చాయని, దీనివల్ల తమ భవి ష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ గణితం విద్యార్థులు రెక్టార్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్యకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఎక్కువమందికి ఈ గ్రేడ్ మార్కులు వచ్చాయని.. దీనివల్ల తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. బోధకులు చెప్పిన పాఠ్యాంశాల్లోని ప్రశ్నలు పరీక్షల్లో రాలేదని వైస్‌చాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం చేయలేదన్నారు. దీనివల్ల కనీసం 60 శాతం మార్కులు కూడా రాని పరిస్థితి ఎదురైందని చెప్పారు. అర్హత గల బోధకులు లేకపోవటం, సిలబస్‌లో లేని ప్రశ్నలు రావటం, మూల్యాం కన సక్రమంగా లేకపోవటం వంటి కారణాల వల్లే మార్కులు తగ్గాయని వివరించారు.
 
 రెక్టార్ చంద్రయ్య స్పందిస్తూ.. బోధకుల నియామకానికి పీహెచ్‌డీ, నెట్, స్లెట్ అర్హుల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని, ఆ అర్హతలున్న అభ్యర్థులు రాకపోవటంతో నిబంధనలు సడలించి నియామకాలు చేపట్టామని వివరించారు. పరీక్షలు మెరుగ్గా రాసినా కూడా మార్కులు రాలేదని భావిస్తున్న విద్యార్థులు రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీసం మూడు సబ్జెక్టుల  మార్కులపై తమకు అనుమానం ఉందని, అయితే సబ్జెక్టుకు రూ.500 చొప్పున రీవాల్యూయేషన్ ఫీజు చెల్లించటం భారం అవుతుందని విద్యార్థులు పేర్కొన్నారు. రుసుం తగ్గించాలని డిమాండ్ చేశారు. రుసుం తగ్గించటం సాధ్యం కాదని, అయినా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని రెక్టార్ చెప్పారు. దూరవిద్య ద్వారా ఎమ్మెస్సీ(గణితం) చేసినవారికి 80 శాతం వరకు మార్కులు వస్తున్నాయని, రెగ్యులర్ విద్యార్థులమైన తమకు ఇంత తక్కువ మార్కులు వేయటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. పీజీ చేస్తున్న 42 మందిలో నలుగురు ఫెయిల్ కూడా అయ్యారన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement