చెల్లెకు లక్ష.. అన్న రక్ష
* మహిళలను మహరాణులను చేసిన వైఎస్
* దేశంలోనే తొలిసారిగా ‘పావలా వడ్డీ’కి శ్రీకారం
* వృద్ధ మహిళలకు ఆసరాగా ‘అభయ హస్తం’
(కె. శ్రీకాంత్‌రావు): మహిళల స్వావలంబనకు, సాధికారతకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎనలేని కృషి చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళల కోసం ఇందిరా క్రాంతి పథం కింద స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలను విశేషంగా పెంచారు. అంతేగాక బ్యాంకులిచ్చే రుణాలపై వడ్డీ అధికంగా ఉండటంతో ఆ భారాన్ని తగ్గించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా పావలా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు వైఎస్. మహిళా సంఘాలకు రుణాలివ్వడానికి బ్యాంకులు పూర్తి వెనుకడుగు వేస్తున్న సమయంలో ఈ పథకానికి ఆయన రూపకల్పన చేశారు. మహిళలు తీసుకున్న రుణంలో అసలుతో పాటు వడ్డీ చెల్లిస్తే ఆ వడ్డీని వారికి తిరిగి చెల్లించే (రీయింబర్స్) విధానాన్ని తీసుకొచ్చారు.
అప్పటిదాకా ఏకంగా 14 శాతం ఉన్న వడ్డీ ‘పావలా’ పథకంతో ఒక్క సారిగా 4 శాతానికి తగ్గిపోవడం భారీ ప్రభావం చూపింది. వడ్డీ చెల్లించడానికి మహిళా సంఘాలు ఆసక్తి కనబరచడమే గాక నెలనెలా క్రమం తప్పకుండా అసలును, వడ్డీని చెల్లించడం ప్రారంభించాయి. దాంతో బ్యాంకులకు కూడా రుణాలు మురిగి పోవన్న భరోసా ఏర్పడింది. దాంతో అవి మహిళా సంఘాలకు రుణాలిచ్చే పరిమి తిని పెంచుతూ పోయాయి. ఖజానాపై పావలా వడ్డీ భారం వందల కోట్ల రూపాయలకు చేరుకున్నా వైఎస్ వెనకడుగు వేయలేదు. మహిళా సంఘాలకు అవసరమైన నిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా, ఎప్పటికప్పుడు నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
పండుటాకులకు ఆసరా...
60 ఏళ్లు దాటిన వృద్ధ మహిళలకు ఆసరాగా నిలిచేందుకు, వారు కుటుంబానికి భారం కాకుండా ఉండేందుకు వైఎస్ ప్రారంభించిన బీమా తరహా పథకం అభయహస్తం. 18-59 ఏళ్ల మధ్య వయసు మహిళలంతా ఇందులో చేరడానికి అర్హులు. వారు రోజుకు ఒక రూపాయి పొదుపు చేస్తే అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. 60 ఏళ్లు నిండినప్పటి నుంచి ప్రతి నెలా రూ.500 నుంచి రూ.2,250 దాకా పించన్ వస్తుంది. కొద్ది నెలల్లోనే దాదాపు 45 లక్షల మంది మహిళలు ఈ పథకంలో చేరారు. 4.5 లక్షల మంది వృద్ధులకు ప్రతి నెలా రూ.500 పెన్షన్ మంజూరైంది.
ఆయన అనంతరం...
వైఎస్ తదనంతరం మహిళా సంఘాలకిచ్చే రుణాన్ని రోశయ్య హయాంలో రూ.5 లక్షలకు పరిమితం చేశారు. అంతకు మించినా, బ్యాంకులకు సకాలంలో వాయిదాలు చెల్లించకపోయినా పావలా వడ్డీ వర్తించదన్నారు. చెల్లించినా సకాలంలో వడ్డీ ఇవ్వకుండా సతాయించారు. అభయహస్తం పథకాన్ని రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు దాదాపు ఆపేసినంత పని చేశాయి! పథకంలో చేరడానికి కూడా అనేక ఆంక్షలు విధించారు. కిరణ్ ‘వడ్డీ లేని రుణాల పథకం’ ప్రకటించినా, తొలి ఆరు నెలలు పైసా కూడా చెల్లించలేదు.
రూ.27,000 కోట్ల రుణాలు
వైఎస్ సీఎం అయ్యేనాటికి రాష్ట్రంలో 5 లక్షల మహిళా సంఘాలుంటే, ఆయన హయాంలో ఏకంగా 4.5 లక్షలకు పైగా కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మహిళా సంఘాలకు లభించే బ్యాంకు రుణంగా ఎప్పుడూ గరిష్టంగా రూ.25 వేలకు మించలేదు. కానీ వైఎస్ మరణించే నాటికి ప్రతి గ్రూపుకూ సగటున లభించిన బ్యాంకు రుణం ఏకంగా రూ.1.6 లక్షలకు పెరిగింది. అంటే దాదాపు 8 రెట్లు! ఇక బాబు హయాంలో లభించిన బ్యాంకు రు ణాలు రూ.1,898 కోట్లు మాత్రమే ఉంటే వైఎస్ మరణించే నాటికి అవి ఏకంగా రూ.27,000 కోట్లకు చేరాయి. పావలా వడ్డీ పథకం కింద వైఎస్ తన హయాంలో దాదాపు రూ.500 కోట్లు పావలా వడ్డీ కోసం మహిళలకు రీయింబర్స్ చేశారు. అలాగే 2004కు ముందు 5 లక్షల మహిళా సంఘాల్లో 50 లక్షల కంటే తక్కువ మంది సభ్యులుంటే ప్రస్తుతం 12.5 లక్షల సంఘాల్లో 1.25 కోట్ల మంది సభ్యులున్నారు!
జగన్ హామీ..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి రాగానే దాదాపు రూ.20 వేల కోట్ల మహిళా సంఘాల రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించారు. వడ్డీ లేని రుణ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని, నిరుపేద మహిళలతో మరిన్ని సంఘాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని, మహిళా సంఘాలు వాయిదా రోజున అసలు చెల్లించకపోయినా వారికి వడ్డీ రాయితీని అమలు చేస్తామని వివరించారు.