కామెర్లకు పసరు మందు వాడకండి! | Do not use the drug pasaru jaundice! | Sakshi
Sakshi News home page

కామెర్లకు పసరు మందు వాడకండి!

Published Tue, Mar 15 2016 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

Do not use the drug pasaru jaundice!

కౌన్సెలింగ్
 
మా నాన్నగారి వయసు 56 ఏళ్లు. ఇటీవల అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించాం. ఎలాంటి సమస్యలూ లేవు అని డాక్టర్ చెప్పారు. వారం క్రితం నిద్రలో ఉన్నప్పుడు తనకు ఆయాసం వచ్చిందని నాన్న చెబుతున్నారు. ఇదేమైనా గుండెపోటుకు దారితీస్తుందా?
 - వజీర్ అహ్మద్, గుంటూరు

సాధారణంగా స్థూలకాయుల్లోనూ, శారీరక శ్రమ లేనివారిలోనూ, ఆస్తమా ఉన్నా, రక్తహీనత ఉన్నా ఆయాసం వస్తుంది. మీరు చెబుతున్న అంశాలను బట్టి మీ నాన్నగారికి శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఆయాసం  కనిపిస్తుంది తప్ప అది గుండెజబ్బుకు సూచన కాకపోవచ్చు. ఇక గుండెకు రక్తసరఫరా తగ్గడం, గుండె కవాటాల్లో జబ్బు కారణంగా కొందరికి ఆయాసం వస్తుంది. శ్వాస సమస్యలన్నింటినీ గుండెజబ్బుగా అనుమానించకూడదు. ఆయాసంతో పాటు గుండె బరువుగా ఉండటం, చెమటలు పట్టడం, ఛాతీలో మంట, నడవలేకపోవడం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు నొప్పి ఎక్కువ కావడం, పనిచేయడం ఆపగానే నొప్పి తీవ్రత తగ్గడం, ఛాతీలో మొదలైన నొప్పి రెండు చేతులు, దవడలకు లేదా వెన్ను భాగానికి పాకడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలిదశలోనే గుర్తిస్తే కొద్దిపాటి మందులు, జాగ్రత్తలతోనే గుండెజబ్బును అరికట్టవచ్చు. గుండెకు సంబంధించిన సమస్యలు కనిపించగానే సత్వరం చేయాల్సినవి...  తొలిగంట అమూల్యం కాబట్టి కుటుంబ సభ్యులు అతి త్వరగా ఆసుపత్రికి తరలించాలి.  ఈజీటీ, టూ డి ఎకో వంటి పరీక్షలు చేయించాల్సి, తర్వాత జబ్బు ఉన్నట్లు తేలితే దాని తీవ్రతను బట్టి చికిత్సలు చేయించాల్సిన అసవరం ఉంది. ఒకవేళ జబ్బు తీవ్రత తక్కువగా ఉంటే (అంటే గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో 50 శాతం కంటే తక్కువ బ్లాక్స్ ఉంటే) అవసరాన్ని బట్టి స్టాటిన్స్ వంటి మందుల ద్వారా సమస్య జటిలం కాకుండా నివారించవచ్చు. ఈ అడ్డంకులు (బ్లాక్స్) 50 నుంచి 70 శాతం మాత్రమే ఉంటే బార్డర్‌లైన్ ఉన్నాయని అర్థం. ఒకవేళ 90 శాతం కంటే ఎక్కువ బ్లాక్స్ ఉంటే తప్పనిసరిగా స్టెంట్స్ వేయాల్సి ఉంటుంది. చికిత్సతో పాటు మంచి పోషకాహారం తీసుకుంటూ వాకింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ, పొగతాగడం వంటి దురలవాట్లు మానేస్తే మంచిది. దీంతో పాటు హైబీపీ, షుగర్ వ్యాధులు ఉంటే వాటిని నియంత్రించుకోవాలి.    
 
డాక్టర్ ఎన్. కృష్ణారెడ్డి
సీనియర్ కన్సల్టెంట్
కార్డియాలజీ, కేర్
హాస్పిటల్, బంజారా హిల్స్, హైదరాబాద్
 
కౌన్సెలింగ్
 
నేను తరచు జ్వరంతో బాధపడుతున్నాను. కడుపుపై భాగంలో కొద్దిపాటి నొప్పి కూడా ఉంటోంది. ఇటీవల కామెర్లు వస్తే పసరు మందు తీసుకున్నాను. అయినా తరచు కడుపునొప్పితో పాటు జ్వరం వస్తూనే ఉంది. మా డాక్టర్ గారిని అడిగితే తగ్గే వరకూ పసరు తీసుకొమ్మని అంటున్నారు.
 - యాదగిరి రెడ్డి, నల్లగొండ

 మీ లక్షణాలను బట్టి మీరు హెపటైటిస్-సి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పసరుమందు వాడకండి. మీ ఇన్ఫెక్షన్ పసరుతో తగ్గదు. హెపటైటిస్-సి వైరస్ కారణంగా ఈ కాలేయ వ్యాధి వస్తుంటుంది. వైరస్ సోకిన రక్తమార్పిడి లేదా ఇంజెక్షన్ సూదుల వల్ల, వ్యాధి సోకిన గర్భవతుల్లో తల్లి నుంచి బిడ్డకు, దంపతుల్లో ఒకరికి ఉంటే మరొకరికి ఇది సోకడం మామూలే.
 నిర్ధారణ: ఈ వ్యాధి నిర్ధారణ కోసం మొదట హెపటైటిస్-సి యాంటీబాడీ టెస్ట్ అనే రక్తపరీక్ష చేస్తారు. ఆ తర్వాత వ్యాధి తీవ్రత (వైరల్ లోడ్) తెలుసుకునేందుకు హెచ్‌సీవీ ఆర్‌ఎన్‌ఏ పరీక్ష చేస్తారు. వీటితో పాటు జీనోటైప్ పరీక్షల వల్ల రోగికి చికిత్స అందించాల్సిన వ్యవధి, దానికి రోగి ప్రతిస్పందించే తీరుతెన్నులు తెలుస్తాయి. ఇందులోనే కొన్ని ‘జీనోటైప్స్’కు చెందిన వ్యాధుల్లో కాలేయం నుంచి ముక్క తీసి పరీక్షించాల్సి ఉంటుంది. వ్యాధి మరింత ముదరకుండా ఉన్నవారికి చికిత్స బాగానే పనిచేస్తుంది. ఒకవేళ వ్యాధి బాగా ముదిరితే కనిపించే దుష్ర్పభావాలు... అంటే రక్తస్రావం, పొట్టలో నీరు చేరడం (అసైటిస్), వ్యాధి మెదడుకు చేరడం వంటివి కనిపిస్తే మాత్రం అది కాలేయ క్యాన్సర్‌కు దారితీసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ వ్యాధి సోకిన వారు ఎంత త్వరగా పరీక్షలు చేయించుకొని, దానికి అనుగుణం చికిత్స చేయించుకుంటే అంత మంచిది.
 
డాక్టర్
పి.బాలచంద్ర మీనన్
సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
 
హోమియో కౌన్సెలింగ్
 
 నా వయసు 28. నాకు రుతుక్రమం సరిగా రావట్లేదని డాక్టర్‌ని సంప్రదిస్తే, వారు స్కాన్ తీయించి, పీసీఓడీగా నిర్ధారించారు. వివాహమై ఐదేళ్లు గడిచినా ఈ సమస్య వల్ల సంతానం కలగడం లేదు. ఎన్నో హాస్పిటళ్ల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించడం లేదు. నా ఈ సమస్యకి హోమియో చికిత్స ద్వారా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు.
 - డి. బాలమణి, రాజమండ్రి

 మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, అధిక మానసిక ఒత్తిడి వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. అందులో ఒకటైన పీసీఓడీ సమస్య ఒకటి. ఇది వివాహిత మహిళలలో సంతానలేమికి దారితీస్తుంది. ఇమెచ్యూర్ ఫాలికిల్ (అపరిపక్వమైన అండం) గర్భాశయానికి ఇరువైపులా ఉన్న అండాశయాలపై నీటి బుడగల వలె ఉండటాన్ని పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని అంటారు. సాధారణ రుతుచక్రం ఉన్న మహిళలలో నెలసరి అయిన 11-14 రోజుల మధ్యలో రెండు అండాశయాలలో ఒక అండాశయం నుంచి అండం విడుదలై ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది. కానీ ఈ పీసీఓడీ సమస్య ఉన్న మహిళలలో అండం విడుదల కాకుండా అపరిపక్వత చెంది అండాశయపు గోడలపై నీటిబుడగల వలె ఉండిపోతాయి. ఇలా రెండు ఆండాశయాలపై కనిపిస్తే దీనిని ైబె లేటరల్ పీసీఓడీ అంటారు.

కారణాలు: ఎఫ్.ఎస్.హెచ్, ఈస్ట్రోజన్, టెసోస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, ఆహారపు నియమాలు పాటించకపోవడం, పిండి, కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వంశపారంపర్యత వంటి అంశాలు కారణాలుగా చెప్పవచ్చు.

లక్షణాలు: నెలసరి రాకపోవడం, నెలసరి సరిగా వచ్చినా, అండాశయం నుండి అండం విడుదల కాకపోవడం, నెలసరిలో 4-5 రోజులు కావలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువరోజుల పాటు కొనసాగడం, నెలసరి ఆగి ఆడి రావడం, రెండు రుతుచక్రాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, బరువు పెరగడం, కొంతమందిలో  బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి కూడా గమనించవచ్చు. జుట్టు రాలడం, ముఖం, వీపుపై మొటిమలు రావడం, మెడచుట్టూ, మోచేతి భాగాలలో చర్మం మందంగా, నల్లగా మారడం, ముఖంపైన, ఛాతీపైన మగవారి మాదిరిగా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు గమనించవచ్చు.
 
దుష్ఫలితాలు: ఇన్‌ఫెర్టిలిటీ, ఒబేసిటీ, టైప్ 2 డయాబెటిస్.
 
హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో సంతానలేమికి అందించే కాన్‌స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా రోగి మానసిక మరియు శారీరక తత్వాన్ని  బట్టి హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేసి ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా సంతానలేమి, ఇతర కాంప్లికేషన్లు ఉన్నా వాటిని తప్పక తగ్గించవచ్చు. మీరు వెంటనే హోమియోవైద్యనిపుణులను సంప్రదించగలరు.
 
 డాక్టర్
 శ్రీకాంత్ మోర్లావర్
 ఫౌండర్ చైర్మన్
 హోమియోకేర్ ఇంటర్నేషనల్
 హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement