
మనం రోజూ ఒక ముద్ద ఇంత రుచిగా తినగలుగుతున్నామంటే కారణం... కరివేపాకు. తన సువాసనతో మీ నాసికాపుటాలతో పాటు మీ కడుపులో స్థలాన్నీ విప్పారేలా చేసి... మరో ముద్దను అదనంగా తినేలా చూస్తుందది. ఒక్కరోజు కరివేపాకు లేకుండా మీ వంటలను తినండి. దాని గొప్పదనం మీకు తెలిసివస్తుంది. ఒక అదనపు ముద్దతో పాటు... మరెన్నో అదనాలను సమకూర్చే ఆ కరివేప ఇచ్చే ప్రయోజనాల్లో కొన్ని ఇవి...
ఐరన్ పాళ్లు పుష్కలం కావడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది కరివేప. అనీమియాతో బాధపడేవారు తమ వంటల్లో కరివేపాకు ఎక్కువగా తింటే చాలు ఒంటికి మంచి రక్తం పడుతుంది. రక్తహీనతకు స్వాభావికమైన చికిత్స ప్రక్రియ కరివేపాకు. కరివేపలో విటమిన్–ఏ చాలా ఎక్కువ. ఇది చూపును చాలాకాలం పదిలంగా కాపాడటంతో పాటు అకాలదృష్టిదోషాలను నివారిస్తుంది. క్యాల్షియమ్, ఫాస్ఫరస్ కరివేపలో చాలా ఎక్కువ. అందుకే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తుంది. మెగ్నీషియమ్, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు దోహదం చేయడంతో పాటు మేని నిగారింపునకు దోహదం చేస్తుంది.కరివేపలో పీచు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చాలా శక్తిమంతమైనవి కావడంతో ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం... మనదేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కరివేపను తాలింపునకు వాడే ప్రాంతాల్లో పెద్దపేగు, మలద్వార (కోలో–రెక్టల్) క్యాన్సర్లు చాలా తక్కువ. అంతేకాదు... జపాన్‌లోని మెజియో యూనివర్సిటీకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ కెమిస్ట్రీకి చెందిన నిపుణుల అధ్యయనంలో కరివేపాకులో క్యాన్సర్‌ను అరికట్టే గుణం ఉందని స్పష్టంగా తేలింది. లుకేమియా, పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్లను కరివేప సమర్థంగా నివారిస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌కు కరివేప మంచి విరుగుడు. ఒంట్లోని విషాలను కరివేప సమర్థంగా విరిచేస్తుంది. కాలేయం ఆరోగ్యాన్ని దీర్ఘకాలం కాపాడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment