మడమ నొప్పి తగ్గాలంటే...? | Heel Pain Relief ...? | Sakshi
Sakshi News home page

మడమ నొప్పి తగ్గాలంటే...?

Published Tue, Dec 10 2013 12:28 AM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM

Heel Pain Relief ...?

నా వయసు 63. గత నాలుగు నెలలుగా ఎడమకాలు మడమ దగ్గర బాగా నొప్పిగా ఉంది. పడుకుని లేచేటప్పుడు పాదం నేల మీద మోపాలంటే భయం. విపరీతమైన నొప్పిగా ఉంటోంది. ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు. దీనికి సరైన పరిష్కారం చెప్పగలరు.
 - హనుమాయమ్మ, కర్నూలు

 
 ఈ సమస్యను ఆయుర్వేదంలో ‘పార్ష్ణిశూల’గా వివరించారు. ఇది వాతరోగాలలో ఒకటి. నాడీమండలానికి సంబంధించి, శరీరంలోని చివరి భాగాలకు చేరే నరాల అంతిమ శాఖల బలహీనత వల్ల ఈ నొప్పి వస్తుంది. అక్కడి నరాలు కొంచెం వాచడం కూడా సంభవించవచ్చు. దీనికి తోడు మీకు రక్తహీనత కూడా ఉంటే ముందు రక్తవృద్ధికి బలకరమైన ఆహారం తీసుకోండి. ఆకుకూరలు, బొప్పాయి, దానిమ్మ వంటి తాజాఫలాలు, ఖర్జూరం బాగా తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది. మధమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు గాని ఉంటే వాటిని కూడా అదుపులోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ కింద వివరించిన సూచనలు పాటిస్తే ఒక నెలలో మీ ‘మడమ శూల’ నయమవుతుంది.
 
 ఆహారం:
తాజాఫలాలు, శుష్కఫలాలు, ఆకుకూరలు మంచి ఆహారం. ముడిబియ్యంతో వండిన అన్నం చాలా ప్రయోజనకరం. రెండుపూటలా మూడేసి చెంచాల ‘నువ్వుల పప్పు’ నమిలి తినండి. అదేవిధంగా మినపపప్పుతో చేసిన ఇడ్లీ వంటి అల్పాహారాలు కూడా నరాల శక్తికి బాగా ఉపకరిస్తాయి. వంటకాలలో కేవలం నువ్వుల నూనెనే వాడండి. ఆవుపాలు, ఆవుమజ్జిగ ఉత్తమం. బయటి ఆహారాల జోలికిపోవద్దు. మాంసరసం, కోడిగుడ్లు కూడా మంచిది.
 
 విహారం: నొప్పి తగ్గేంతవరకూ ఆ మడమకు ఎంతో కొంత విశ్రాంతి అవసరం. మోటగించి నడవటం, వ్యాయామాలు చేయడం మంచిది కాదు. రెండుపూటలా ప్రాణాయామం చేయండి.
 
 మందులు:  
 బృహత్‌వాత చింతామణిరస (మాత్రలు)  ఉదయం 1, రాత్రి 1 (ఒక పదిరోజులు మాత్రమే).  
 మహాయోగరాజ గుగ్గులు (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1  
 అశ్వగాంధారిష్ట (ద్రావకం): మూడుపూటలా - నాలుగేసి చెంచాలు - నీటితో
 
 స్థానిక బాహ్యచికిత్స:
 మహానారాయణ తైలం, పిండతైలాలను రెండేసి చెంచాలు ఒక పాత్రలో కలుపుకొని, స్వల్పంగా వేడి చేసి మడమచుట్టూ మృదువుగా మర్దన చేయాలి. అనంతరం వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. దీనికోసం మరిగిస్తున్న నీళ్లలో ‘వావిలి ఆకులు’ వేస్తే, ఫలితం ఇంకా శీఘ్రతరమవుతుంది. ఇది రోజూ రెండుపూటలా చేస్తే మంచిది.
 
 నా వయసు 44. గత రెండు నెలల నుంచి పాదాల వేళ్ల మధ్య దురద, నీరు కారడం, మంట, నొప్పి ఉంటున్నాయి. ఇవి తగ్గడానికి మంచి మందులు చెప్పండి.
 - శ్రీదేవి, వరంగల్

 
 వీలున్నంత వరకు పాదాలను ఎక్కువసేపు నీళ్లలో ఉంచవద్దు. అనివార్యమైతే ఎప్పటికప్పుడు పొడిగా, శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి.  
 కల్తీ లేని పసుపుపొడిని వేళ్ల మధ్య అద్దుతుండాలి.

 
 మహామరిచాదితైలం:
రాత్రిపూట వేళ్ల మధ్యభాగాల్ని పొడిగా శుభ్రం చేసి, ఈ తైలాన్ని పూయాలి. (ఇది పైపూతకు మాత్రమే).  
 గంధక రసాయన (మాత్రలు): ఉదయం 2, రాత్రి 2 పరగడుపున పాలతో సేవించాలి. ఇలా ఒక నెల వాడితే బాధ నయమవుతుంది.
 
 డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
 అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
 సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
 హుమయున్ నగర్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement