Laxminarasimha
-
స్వామి స్థలం సగం ధరకేనా!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మంగళగిరి లక్ష్మీనరసింహ దేవస్థానానికి చెందిన స్థలాల అమ్మకాల్లో వీజీ టీఎం ఉడా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. గుంటూరు విద్యానగర్‌లో మిగిలిన స్థలాలను టెండరు కమ్ ఆక్షన్ విధానంలో విక్రయించాలని తీసుకున్న నిర్ణయంలో దేవాదాయ శాఖను విస్మరించింది. ఆప్సెట్ ధర నిర్ణయం, దినపత్రికలో నోటిఫికేషన్ ఇవ్వడం వంటి ముఖ్య విషయాలను దేవాదాయశాఖకు తెలియపరచకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. స్వామి వారికి చెందిన 8.25 ఎకరాల భూమిని అభివృద్ధి చేసి విక్రయిం చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఉడా, గత ఏడాది స్థలాలను విక్రయించ గా వచ్చిన నగదును దేవాదాయ శాఖకు జమ చేసింది. తొలి విడత స్థలాల అమ్మకాలు రాష్ట్ర విభజనకు ముందు జరిగాయి. అప్పట్లో బహిరంగ మార్కెట్ కంటే ఆక్షన్‌లోనే తక్కువ రేటు పలికాయనే విమర్శలు వినపడ్డాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యలో వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థలాలకు సహజంగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ స్థలాలకు ఆప్సెట్ ధర తక్కువగా నిర్ణయిస్తూ దినపత్రికల్లో నోటిఫికేషన్ విడుదల చేయడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.గుంటూరు విద్యానగర్‌లో స్వామివారికి చెందిన ప్లాట్లలో 7 మిగిలి పోయాయి. ఇవన్నీ 2000 చదరపు గజాల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. వీటిని ఈ నెల 11న గుంటూరులోని ఉడా కార్యాలయంలో విక్రయించ డానికి టెండరు కమ్ ఆక్షన్ నిర్వహించనున్నారు.ఆసక్తిగల పార్టీలు దరఖాస్తులు తీసుకుని అదే రోజు టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్‌లో పాల్గొనాలని మంగళవారం దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే చదరపు గజానికి నిర్ణయించిన ఆప్సెట్ ధరపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనికితోడు ఉడా ఈ నిర్ణయాన్ని దేవాదాయశాఖకు తెలియపరచకుం డానే దినపత్రికకు నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై ఆ శాఖ ఉద్యోగులంతా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యానగర్‌లో బహిరంగ మార్కెట్లో చదరపు గజం రూ.50,000లకు పైగా ఉంది. అప్సెట్ ధరను రూ.23,000గానే దినపత్రికలో పేర్కొనడంతో స్వామివారి ఆదాయం పడిపోతుందని భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా, దక్షిణ ముఖం కలిగిన స్థలాలు కావడంతో పాటు వాస్తుపరంగా స్వల్ప లోపాలు ఉన్నాయని చెప్పారు. కొనుగోలు చేసిన వ్యక్తులు ఈ లోపాలు సరిచేసుకోవడానికి కొంత స్థలాన్ని వదులుకోవాల్సి ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకుని ఆప్సెట్ ధర తక్కువగా నిర్ణయించామని చెప్పారు. నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో దేవాదాయశాఖకు ముందస్తుగా తెలియపరచకపోయినా, తుదిగా వాటిని ఖరారు చేసే అధికారం ఆ శాఖకే ఉందన్నారు. వారు ఆశించిన స్థాయిలో స్థలాలకు రేటు రాలేదని దేవాదాయశాఖ కమిషనర్ భావిస్తే టెండర్లు రద్దు చేసే అధికారం కూడా కలిగి ఉన్నారని చెప్పారు. ప్రతీసారీ దేవాదాయశాఖకు తెలియచేయాల్సిన అవసరం లేదనే భావనలో ఉడా అధికారులు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పేర్కొన్నారు. -
వడదెబ్బకు ఐదుగురి మృతి
అనుమసముద్రంపేట, న్యూస్‌లైన్ : మండలంలోని పెద్దఅబ్బీపురం గ్రా మానికి చెందిన ఆలూరు లక్ష్మీనరస మ్మ (70) వడదెబ్బకు గురై బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి కు మారుడు వెంకట సుబ్బయ్య కథనం మేరకు... బుధవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెకు స్థానికంగా వైద్యం సేవలందించారు. అర్ధరాత్రి దాటిన తరువాత మరోసారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్యశాలకు తరలించేం దుకు ప్రయత్నిస్తుండగా ప్రాణాలొదిలింది. జలదంకి: జలదంకిలో వడదెబ్బకు గురై అరవ సుబ్బారెడ్డి (80) గురువారం మృతి చెందాడు. సుబ్బారెడ్డిది చేజర్ల కాగా ఇటీవల జలదంకిలోని కుమార్తె ఇంటికి వచ్చాడు. స్థానిక పద్మావతి కల్యాణ మండపంలోని వివాహానికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన గ్రామస్తులు మృతదేహాన్ని అతని కుమార్తె ఇంటికి తరలించారు. అనంతరం సుబ్బారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామమైన చేజర్లకు తీసుకెళ్లారు. ఇందుకూరుపేట: గంగపట్నం గ్రామానికి చెందిన సోప్రాల రమణమ్మ(72) వడదెబ్బకు గురై బుధవారం రాత్రి మృతి చెందింది. అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులకు తట్టుకోలేక ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇది గమనించిన కుమారుడు బాబు వైద్య సేవలందించారు. అయినా ఫలితం లేక రమణమ్మ మృతి చెందింది. యాచకుడి మృతి పొదలకూరు : వేసవి తాపానికి తట్టుకోలేక వడదెబ్బకు గురై గుర్తు తెలియని యాచకుడు(45) గురువారం పొదలకూరులో మృతి చెందాడు. స్థానిక రామనగర్గేటు సెంటరులో భిక్షాటన చేసే వ్యక్తి అక్కడే బస్‌షెల్టర్‌లో తలదాచుకుంటాడు. ఈ క్రమంలో వేసవితాపానికి తాళలేక తుదిశ్వాస విడిచాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఎస్సై ఎం అంజిరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వేటకెళ్లొచ్చి... చిల్లకూరు: మండలంలోని గుమ్మళ్లదిబ్బలో గురువారం సాయంత్రం స్థా నికుడు పోలంగారి శ్రీరాములు(47) వడదెబ్బకు గురై మృతిచెందాడు. చేపల వేటకు వెళ్లొచ్చిన శ్రీరాములు ఎండతీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. -
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై హైకోర్టు స్టే
సింగరాయపాలెం (ముదినేపల్లి రూరల్), న్యూస్‌లైన్ : మండలంలోని సింగరాయపాలెంలో గల వివాదాస్పద స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర హైకోర్టు బ్రేక్ వేసింది. స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందినదిగా భావిస్తున్న స్థలంలో రూ.12 లక్షల మండల పరిషత్ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పంచాయతీ శ్రీకారం చుట్టింది. గత నెల 28న కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు భూమిపూజ కూడా చేశారు. రెవెన్యూ రికార్డుల్లో ఈ స్థలం పోరంబోకు భూమిగా నమోదైనందున పంచాయతీకే సర్వహక్కులూ ఉన్నాయంటూ సంబంధిత అధికారులు వాదించారు. దీనిని దేవాదాయ శాఖాధికారులు ఖండించారు. ఈ స్థలం ఆలయానికి చెందినదేనంటూ కాంప్లెక్స్ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఈ వివాదంపై ‘లక్ష్మీవల్లభా.. నీ ఆస్తి గోవిందా’ శీర్షికతో ‘సాక్షి’ ఈ నెల ఒకటిన కథనం ప్రచురించింది. దీనిపై దేవాదాయశాఖ అధికారులు వెంటనే స్పందించారని ఆలయ ఈవో సీహెచ్ సుధాకరరావు తెలిపారు. వారి ఆదేశంతో కాంప్లెక్స్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయగా న్యాయస్థానం శనివారం స్టే ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఈ భూమి ఆలయానికి చెందినదేనంటూ గతంలో గుడివాడ సబ్‌కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను కోర్టులో దాఖలు చే శామన్నారు. వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి కాంప్లెక్స్ నిర్మాణంపై దేవాదాయ శాఖకు అనుకూలంగా స్టే ఇచ్చినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతులను సంబంధిత అధికారులకు అందజేస్తామన్నారు. -
మడమ నొప్పి తగ్గాలంటే...?
నా వయసు 63. గత నాలుగు నెలలుగా ఎడమకాలు మడమ దగ్గర బాగా నొప్పిగా ఉంది. పడుకుని లేచేటప్పుడు పాదం నేల మీద మోపాలంటే భయం. విపరీతమైన నొప్పిగా ఉంటోంది. ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు. దీనికి సరైన పరిష్కారం చెప్పగలరు. - హనుమాయమ్మ, కర్నూలు ఈ సమస్యను ఆయుర్వేదంలో ‘పార్ష్ణిశూల’గా వివరించారు. ఇది వాతరోగాలలో ఒకటి. నాడీమండలానికి సంబంధించి, శరీరంలోని చివరి భాగాలకు చేరే నరాల అంతిమ శాఖల బలహీనత వల్ల ఈ నొప్పి వస్తుంది. అక్కడి నరాలు కొంచెం వాచడం కూడా సంభవించవచ్చు. దీనికి తోడు మీకు రక్తహీనత కూడా ఉంటే ముందు రక్తవృద్ధికి బలకరమైన ఆహారం తీసుకోండి. ఆకుకూరలు, బొప్పాయి, దానిమ్మ వంటి తాజాఫలాలు, ఖర్జూరం బాగా తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది. మధమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు గాని ఉంటే వాటిని కూడా అదుపులోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ కింద వివరించిన సూచనలు పాటిస్తే ఒక నెలలో మీ ‘మడమ శూల’ నయమవుతుంది. ఆహారం: తాజాఫలాలు, శుష్కఫలాలు, ఆకుకూరలు మంచి ఆహారం. ముడిబియ్యంతో వండిన అన్నం చాలా ప్రయోజనకరం. రెండుపూటలా మూడేసి చెంచాల ‘నువ్వుల పప్పు’ నమిలి తినండి. అదేవిధంగా మినపపప్పుతో చేసిన ఇడ్లీ వంటి అల్పాహారాలు కూడా నరాల శక్తికి బాగా ఉపకరిస్తాయి. వంటకాలలో కేవలం నువ్వుల నూనెనే వాడండి. ఆవుపాలు, ఆవుమజ్జిగ ఉత్తమం. బయటి ఆహారాల జోలికిపోవద్దు. మాంసరసం, కోడిగుడ్లు కూడా మంచిది. విహారం: నొప్పి తగ్గేంతవరకూ ఆ మడమకు ఎంతో కొంత విశ్రాంతి అవసరం. మోటగించి నడవటం, వ్యాయామాలు చేయడం మంచిది కాదు. రెండుపూటలా ప్రాణాయామం చేయండి. మందులు: బృహత్వాత చింతామణిరస (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1 (ఒక పదిరోజులు మాత్రమే). మహాయోగరాజ గుగ్గులు (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 అశ్వగాంధారిష్ట (ద్రావకం): మూడుపూటలా - నాలుగేసి చెంచాలు - నీటితో స్థానిక బాహ్యచికిత్స: మహానారాయణ తైలం, పిండతైలాలను రెండేసి చెంచాలు ఒక పాత్రలో కలుపుకొని, స్వల్పంగా వేడి చేసి మడమచుట్టూ మృదువుగా మర్దన చేయాలి. అనంతరం వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. దీనికోసం మరిగిస్తున్న నీళ్లలో ‘వావిలి ఆకులు’ వేస్తే, ఫలితం ఇంకా శీఘ్రతరమవుతుంది. ఇది రోజూ రెండుపూటలా చేస్తే మంచిది. నా వయసు 44. గత రెండు నెలల నుంచి పాదాల వేళ్ల మధ్య దురద, నీరు కారడం, మంట, నొప్పి ఉంటున్నాయి. ఇవి తగ్గడానికి మంచి మందులు చెప్పండి. - శ్రీదేవి, వరంగల్ వీలున్నంత వరకు పాదాలను ఎక్కువసేపు నీళ్లలో ఉంచవద్దు. అనివార్యమైతే ఎప్పటికప్పుడు పొడిగా, శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి. కల్తీ లేని పసుపుపొడిని వేళ్ల మధ్య అద్దుతుండాలి. మహామరిచాదితైలం: రాత్రిపూట వేళ్ల మధ్యభాగాల్ని పొడిగా శుభ్రం చేసి, ఈ తైలాన్ని పూయాలి. (ఇది పైపూతకు మాత్రమే). గంధక రసాయన (మాత్రలు): ఉదయం 2, రాత్రి 2 పరగడుపున పాలతో సేవించాలి. ఇలా ఒక నెల వాడితే బాధ నయమవుతుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
నవజాత శిశువుకు కామెర్లు... ఏం చేయాలి?
నాకు పదిరోజుల క్రితం ఆడబిడ్డ జన్మించింది. మూడు కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉంది. పుట్టిన మూడో రోజున పాపకు జాండిస్ కనిపించింది. అదే తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు. దీనికేమైనా ఆయుర్వేద మందులు అవసరమా? నాకు పాదాల మీద కొద్దిగా వాపులున్నాయి. వీటికి సరియైన సలహాలను సూచింప ప్రార్థన. -మీనాక్షి, బి.హెచ్.ఇ.ఎల్, హైదరాబాద్. జాండిస్‌ను ఆయుర్వేదంలో ‘కామల’ అంటారు. వాడక భాషలో పచ్చకామెర్లు అని అంటారు. నవజాత శిశువునకు పుట్టిన రెండో రోజుల తర్వాత వచ్చే కామలను ప్రాకృతంగానే పరిగణిస్తారు. కాలేయం క్రియాసామర్థ్యం పరిపక్వతకు చేరుకునే సమయంలో శిశువు బాహ్యవాతావరణానికి సర్దుబాటు కావలసిన పరిస్థితిలో కనిపించే తాత్కాలికమైన మార్పు మాత్రమే ఈ కామల. ఒకటి రెండు వారాల్లో క్రమేణా తగ్గిపోతుంది. ప్రత్యేకమైన మందులేమీ అవసరం లేదు. అదేగాని పుట్టిన 48 గంటలలోపు కామల కనబడితే దాన్ని వ్యాధిగా గుర్తించి పరీక్షలు జరిపి చికిత్స చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్ని జన్మగత వైకల్యాలు కారణం కావచ్చు. ఉదాహరణకు, కాలేయం నుంచి ‘బైలురుబిన్’ బయటకు వచ్చే నాళం మూసుకుని ఉండటం లేదా అధికస్థాయిలో ఎర్రరక్తకణాల విధ్వంసం మొదలైనవి. కాబట్టి మీరేమీ గాబరా పడవద్దు. శిశువునకు మీ పాలను తాపిస్తూ ఉండటం, సాధారణంగా చేసే శిశురక్షణ ప్రక్రియలను పాటిస్తే సరిపోతుంది. ప్రసవమైన మూడు నాలుగు వారాల వరకు తల్లీబిడ్డలకు ఇన్ఫెక్షన్లు రాకుండా పరిశుభ్ర వాతావరణాన్ని పాటించడం అత్యవసరం. మీరుండే గదిలోనికి ఎవ్వరినీ రానీయవద్దు. తల్లి, వైద్యుడు, ధాత్రి (నర్సు) తప్ప ఇతరులెవ్వరూ శిశువుని తాకకుండా చూసుకోండి. సాధారణంగా ప్రసూతులలో (బాలింతలలో) కొంచెం రక్తహీనత ఉండవచ్చు. నడుంనొప్పి, పాదాలవద్ద కొద్దిగా వాపులు కొందరిలో కనిపించవచ్చు. మీరు పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. కఠోర పథ్యాలు చేయాల్సిన అవసరం లేదు. బయటి ఆహారం, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పదార్థాలు మొదలైనవి మంచివి కావు. తాజాగా వండిన వేడి ఆహారం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే కాయగూరలు, తాజాఫలాలు, జీడిపప్పు, బాదంపప్పు, ఖర్జూరం వంటి ఎండు ఫలాలు మంచిది. ప్రతిరోజూ ఉదయం బార్లీ నీళ్లు, ఆవు మజ్జిగ తాగండి. నువ్వులు, బెల్లం తినండి. రోజూ రెండు లీటర్ల ఆవుపాలు తాగితే మీకు స్తన్యం బాగా ఉత్పత్తి అవుతుంది. ఆహారంలో అల్లం, వెల్లుల్లి, తగురీతిలో తినడం మంచిది. అదేపనిగా పడుకోకుండా కొంచెం శారీరక శ్రమ కలిగే తేలికపాటి వ్యాయామాలు చేయండి. రెండుపూటలా ఐదేసి నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి. ప్రసవానంతరం ఆరోగ్యం కుదుటపడటానికి సహకరించే ఈ కింద సూచించిన ఆయుర్వేద మందులు వాడండి. పునర్నవాది మండూర (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 బాలింత కాఢ నెం. 1 (ద్రావకం) : ఉదయం 2 చెంచాలు, రాత్రి రెండు చెంచాలు రెండు వారాలు తాగండి. ఆ తర్వాత... బాలింత కాఢ నెం. 2 (ద్రావకం) : ఉదయం 2 చెంచాలు, రాత్రి చెంచాలు రెండు వారాలు తాగండి. శిశువునకు : అరవిందాసవ (ద్రావకం): ఐదుచుక్కలు ఉదయం, ఐదు చుక్కలు సాయంత్రం తాగించాలి (తేనెతో). వీలుంటే శిశువుని (బట్టలు లేకుండా) ప్రభాత సూర్యకిరణాలలో ఐదునిమిషాలు ఉంచితే మంచిది. ‘బలాతైలం’తో శిశువునకు మృదువుగా అభ్యంగం చేసి, అనంతరం సున్నిపిండితో, వేడినీటి స్నానం చేయించండి. గమనిక : శిశువుతో శారీరకంగానూ, మానసికంగానూ చాలా సున్నితంగా, నాజూకుగా వ్యవహరించాలని ఆయుర్వేద ప్రాచీన శిశువైద్యనిపుణుడు ‘కశ్యపుడు’ స్పష్టీకరించాడు. కొంతమంది మంత్రసానులు, నాటువైద్యులు, శిశువుల కాళ్ళు, చేతులు అతిగా వంకరలు తిప్పుతూ వ్యాయామాలు చేయిస్తుంటారు. అది ప్రమాదకరమని గుర్తుంచుకోండి. అలాంటివి చేయించి శిశువును క్షోభకు గురిచేయవద్దు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్