సాక్షి ప్రతినిధి, గుంటూరు: మంగళగిరి లక్ష్మీనరసింహ దేవస్థానానికి చెందిన స్థలాల అమ్మకాల్లో వీజీ టీఎం ఉడా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. గుంటూరు విద్యానగర్‌లో మిగిలిన స్థలాలను టెండరు కమ్ ఆక్షన్ విధానంలో విక్రయించాలని తీసుకున్న నిర్ణయంలో దేవాదాయ శాఖను విస్మరించింది. ఆప్‌సెట్ ధర నిర్ణయం, దినపత్రికలో నోటిఫికేషన్ ఇవ్వడం వంటి ముఖ్య విషయాలను దేవాదాయశాఖకు తెలియపరచకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
స్వామి వారికి చెందిన 8.25 ఎకరాల భూమిని అభివృద్ధి చేసి విక్రయిం చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఉడా, గత ఏడాది స్థలాలను విక్రయించ గా వచ్చిన నగదును దేవాదాయ శాఖకు జమ చేసింది.
తొలి విడత స్థలాల అమ్మకాలు రాష్ట్ర విభజనకు ముందు జరిగాయి. అప్పట్లో బహిరంగ మార్కెట్ కంటే ఆక్షన్‌లోనే తక్కువ రేటు పలికాయనే విమర్శలు వినపడ్డాయి.
ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యలో వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థలాలకు సహజంగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
అయితే ఆ స్థలాలకు ఆప్‌సెట్ ధర తక్కువగా నిర్ణయిస్తూ దినపత్రికల్లో నోటిఫికేషన్ విడుదల చేయడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.గుంటూరు విద్యానగర్‌లో స్వామివారికి చెందిన ప్లాట్లలో 7 మిగిలి పోయాయి. ఇవన్నీ 2000 చదరపు గజాల విస్తీర్ణం కలిగి ఉన్నాయి.
వీటిని ఈ నెల 11న గుంటూరులోని ఉడా కార్యాలయంలో విక్రయించ డానికి టెండరు కమ్ ఆక్షన్ నిర్వహించనున్నారు.ఆసక్తిగల పార్టీలు దరఖాస్తులు తీసుకుని అదే రోజు టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్‌లో పాల్గొనాలని మంగళవారం దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే చదరపు గజానికి నిర్ణయించిన ఆప్‌సెట్ ధరపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
దీనికితోడు ఉడా ఈ నిర్ణయాన్ని దేవాదాయశాఖకు తెలియపరచకుం డానే దినపత్రికకు నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై ఆ శాఖ ఉద్యోగులంతా వ్యతిరేకత వ్యక్తం చేశారు.
ప్రస్తుతం విద్యానగర్‌లో బహిరంగ మార్కెట్‌లో చదరపు గజం రూ.50,000లకు పైగా ఉంది. అప్‌సెట్ ధరను రూ.23,000గానే దినపత్రికలో పేర్కొనడంతో స్వామివారి ఆదాయం పడిపోతుందని భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా, దక్షిణ ముఖం కలిగిన స్థలాలు కావడంతో పాటు వాస్తుపరంగా స్వల్ప లోపాలు ఉన్నాయని చెప్పారు. కొనుగోలు చేసిన వ్యక్తులు ఈ లోపాలు సరిచేసుకోవడానికి కొంత స్థలాన్ని వదులుకోవాల్సి ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకుని ఆప్‌సెట్ ధర తక్కువగా నిర్ణయించామని చెప్పారు.
నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో దేవాదాయశాఖకు ముందస్తుగా తెలియపరచకపోయినా, తుదిగా వాటిని ఖరారు చేసే అధికారం ఆ శాఖకే ఉందన్నారు.
వారు ఆశించిన స్థాయిలో స్థలాలకు రేటు రాలేదని దేవాదాయశాఖ కమిషనర్ భావిస్తే టెండర్లు రద్దు చేసే అధికారం కూడా కలిగి ఉన్నారని చెప్పారు. ప్రతీసారీ దేవాదాయశాఖకు తెలియచేయాల్సిన అవసరం లేదనే భావనలో ఉడా అధికారులు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పేర్కొన్నారు.
స్వామి స్థలం సగం ధరకేనా!
Published Wed, Sep 3 2014 1:20 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement