సింగరాయపాలెం (ముదినేపల్లి రూరల్), న్యూస్‌లైన్ : మండలంలోని సింగరాయపాలెంలో గల వివాదాస్పద స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర హైకోర్టు బ్రేక్ వేసింది. స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందినదిగా భావిస్తున్న స్థలంలో రూ.12 లక్షల మండల పరిషత్ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పంచాయతీ శ్రీకారం చుట్టింది. గత నెల 28న కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు భూమిపూజ కూడా చేశారు.
రెవెన్యూ రికార్డుల్లో ఈ స్థలం పోరంబోకు భూమిగా నమోదైనందున పంచాయతీకే సర్వహక్కులూ ఉన్నాయంటూ సంబంధిత అధికారులు వాదించారు. దీనిని దేవాదాయ శాఖాధికారులు ఖండించారు. ఈ స్థలం ఆలయానికి చెందినదేనంటూ కాంప్లెక్స్ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఈ వివాదంపై ‘లక్ష్మీవల్లభా.. నీ ఆస్తి గోవిందా’ శీర్షికతో ‘సాక్షి’ ఈ నెల ఒకటిన కథనం ప్రచురించింది. దీనిపై దేవాదాయశాఖ అధికారులు వెంటనే స్పందించారని ఆలయ ఈవో సీహెచ్ సుధాకరరావు తెలిపారు.
వారి ఆదేశంతో కాంప్లెక్స్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయగా న్యాయస్థానం శనివారం స్టే ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఈ భూమి ఆలయానికి చెందినదేనంటూ గతంలో గుడివాడ సబ్‌కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను కోర్టులో దాఖలు చే శామన్నారు. వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి కాంప్లెక్స్ నిర్మాణంపై దేవాదాయ శాఖకు అనుకూలంగా స్టే ఇచ్చినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతులను సంబంధిత అధికారులకు అందజేస్తామన్నారు.
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై హైకోర్టు స్టే
Published Tue, Jan 7 2014 12:19 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
Advertisement
Advertisement