ముంబై: వైద్య వృత్తి వ్యాపారమయం కావడంపై బాంబే హైకోర్టు మండిపడింది. ఈ రోజుల్లో దాదాపు ఆస్పత్రులన్నీ దుకాణాల్లా మారిపోయాయంటూ విమర్శించింది. ఆస్పత్రి బకాయిలు చెల్లించ లేదన్న కారణంగా తన సోదరుడిని ముంబైలోని సబర్బన్ అంధేరీలో ఉన్న సెవెన్‌హిల్స్ అనే ప్రై వేటు ఆస్పత్రి యాజమాన్యం డిశ్చార్జి చేయట్లేదని ఆరోపిస్తూ సంజయ్ ప్రజాపతి అనే నగరవాసి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘వైద్యులు వారి విధులను మర్చిపోయారు. చాలా ఆస్పత్రులు దుకాణాల్లాగా నడుస్తున్నాయి. ప్రతి ఒక్కటీ వ్యాపారంగా మారిపోయింది. డబ్బే ముఖ్యమైపోయింది. ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఇటువంటి దిగజారుడు పరిస్థితులే నెలకొన్నాయి’’ అని జస్టిస్ వి.ఎం. కనడే, పి.డి. కోడేలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. బకాయిలు చెల్లించనంత మాత్రాన రోగులను డిశ్చార్జి చేయకపోవడం అమానవీయమని పేర్కొంది.
బకాయిలు చెల్లించని రోగులను డిశ్చార్జి చేయకుండా ఆపే హక్కులు లేక మార్గదర్శకాలు ఆస్పత్రులకు ఉన్నాయో లేదో ఈ నెల 17లోగా తెలపాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే పిటిషనర్ వాదనను ఆస్పత్రి తోసిపుచ్చింది. రోగికి గత నెల శస్త్రచికిత్స చేశామని...ఆపరేషన్ అనంతర చికిత్సలో భాగంగానే డిశ్చార్జి చేయలేదని తెలిపింది. రోగి కుటుంబంతో చర్చలు జరిపి ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నట్లు కోర్టుకు వివరించింది.