తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న ఓ బాలికను రక్షించేందుకు యువత కదిలింది. రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నా బాలిక ప్రాణం కాపాడేందుకు ముందుకు వచ్చారు. బాలిక కోసం ఏకంగా 63 మంది రక్తదానం చేసి తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. మదురై విల్లాపురం పుదునగర్ వాసులు తమలోని ఐక్యత, సామరస్యాన్ని చాటుకున్నారు.
సాక్షి, చెన్నై : తిరువారూర్‌కు చెందిన రవి కుమార్తె కావ్య(17) కొంత కాలంగా రక్తహీనత సమస్యతో బాధపడుతోంది. గత వారం మదురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆమెకు అత్యధిక యూనిట్లు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రి వర్గాల సూచన మేరకు బయట నుంచి రక్తాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రవికి ఏర్పడింది. అంత స్తోమత లేని దృష్ట్యా ఆస్పత్రి వర్గాలను సంప్రదించాడు. ఎవరైనా రక్తం ఇస్తే ప్రత్యామ్నాయంగా తమ వద్ద ఉన్న రక్తం ఎక్కించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారు సలహా ఇచ్చారు. చదవండి: శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే..
లాక్‌డౌన్ సమయంలో రక్తం దొరకడం గగనమేనని, దాతలు ముందుకు వచ్చే పరిస్థితి లేదని..నెలగా వెలుగు చేసిన ఘటలను అతనికి వివరించారు. దీంతో ఆందోళన చెందిన రవి తన కుమార్తెను రక్షించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. చివరకు మదురై జిల్లా తిరుప్పరగుండ్రం సమీపంలోని విల్లాపురం పుదునగర్‌లో ఉన్న తమ సమీప బంధువుకు గోడు చెప్పుకున్నాడు. పుదునగర్ వాసుల సంక్షేమ సంఘం పేరిట తరచూ ఇక్కడి యువకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం రవికి కలిసి వచ్చింది. దీంతో ఆ సంఘం నిర్వాహకులు ఇబ్రాహీం, సుల్తాన్, షేట్‌లను కలిశారు. చదవండి: 'ఆయన చేసిన పనులను చరిత్ర క్షమించదు'
ఆగమేఘాలపై శిబిరం
రవి కుమార్తె కావ్యను రక్షించేందుకు ఆ సంక్షేమ సంఘంలోని యువత ముందుకు వచ్చింది. జిల్లా కలెక్టర్ అనుమతితో ప్రత్యేక వైద్య శిబిరాన్ని శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేశారు. మతాలకు అతీతంగా అందరూ కదిలారు. ఏకంగా 63 మంది యువకులు రక్తదానం చేశారు. ఇక బాలికను రక్షించాల్సిన బాధ్యత మీదే అంటూ వైద్యులకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడి యువకుల ఐక్యత, సామరస్యం చూసిన ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ వర్గాలు నివ్వెరపోయాయి. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నా పదుల సంఖ్యలో మైనారిటీ యువకులు రక్తదానం చేయడం విశేషం. ఇక్కడి యువత మతాలకు అతీతంగా అన్నదమ్ముళ్లుగా మెలుగుతున్నారని, ఎవరికి చిన్న కష్టం వచ్చినా చలించిపోతారంటూ ఆ సంక్షేమ సంఘం వర్గాలు ప్రశంసించాయి. బాలికకు అవసరం అయ్యే మేరకు తమ వద్ద ఉన్న ఆమె గ్రూపు రక్తాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment