న్యూఢ్లిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. వరసగా మూడో రోజు 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,451 కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 14,241కి చేరాయి. 54 మంది మరణించారు. ఢిల్లీలో ఒక్క రోజే 1,042 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. ఢిల్లీలో స్కూళ్లో ప్రత్యేక క్వారంటైన్ గదులు సిద్ధం చేశారు. విద్యార్థులు లంచ్ బాక్స్‌లను షేర్ చేసుకోద్దని సూచించారు. మరోవైపు తమిళనాడునూ కరోనా వణికిస్తోంది. ఐఐటీ మద్రాసులో 30 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు.
శుక్రవారం 700 మందికి పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు తమిళనాడు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు. స్వల్ప లక్ష్యణాలు ఉన్న విద్యార్థులను కళాశాల ప్రాంగణంలోనే హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు చెప్పారు. క్యాంపస్‌లోని 19 హాస్టళ్లలో కరోనా నిర్మూలన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఢిల్లీ, తమిళనాడుల్లో శుక్రవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను మళ్లీ తప్పనిసరి చేశారు. లేదంటే రూ.500 జరిమానా తప్పదని ప్రభుత్వాలు హెచ్చరించాయి.
షాంఘైలో లాక్‌డౌన్ పొడిగింపు
బీజింగ్: చైనాలోని షాంఘైలో కరోనా కలకలం కొనసాగుతోంది. దాంతో కోవిడ్ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 26 దాకా పొడిగించారు. నాలుగు వారాలుగా లాక్‌డౌన్ అమలు చేస్తూ కఠినమైన ఆంక్షలు విధిస్తుండటంతో అక్కడ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొనడం తెలిసిందే. చైనాలో గురువారం 2,119 కేసులు నమోదయ్యాయి. వాటిలో 1,931 షాంఘైలో వెలుగు చూశాయి. 11 మంది మరణించారు. దాంతో తాజా వేవ్ మృతుల సంఖ్య 36కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment