సాక్షి, చెన్నై: లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఇళ్ల వద్దకే ప్రజలకు అవసరమైన అన్ని రకాల వస్తువులను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం అనుమతి పొందిన దుకాణాలు, కిరాణ కొట్లకు అవకాశం కల్పించారు. అయితే ఈ దుకాణాలకు ఫోన్ చేసి ఆర్డర్లను ఇంటి వద్దకే తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం చెన్నైలో 7,500 మొబైల్ వాహనాలు సిద్ధం చేశారు.
ఈనెల 24 నుంచి వారం రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలకు వారం రోజులకు అవసరమైన సరుకులు సమకూర్చుకున్నారు. అయితే జూన్ 7వ తేదీ వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించింది. దీంతో అనేక ఇళ్లల్లో పప్పుదాన్యలు, బియ్యం తదితర వస్తువుల కోసం అలమటించాల్సిన పరిస్థితి. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం అధికారుల అనుమతితో ఆయా ప్రాంతాల్లోని దుకాణాలు, మొబైల్ దుకాణాల ద్వారా అన్ని రకాల వస్తువులను అందించేందుకు నిర్ణయించారు.
అయితే నేరుగా వెళ్లి కొనుగోలు చేయడానికి వీలు లేదు. ఆయా దుకాణాల మొబైల్ నెంబర్లకు ఫోన్‌చేసి కావాల్సిన వస్తువులను బుక్ చేసుకోవాలని లేదా చీటీల్లో రాసి ఇచ్చి రావాలని తెలిపారు. ఆయా వస్తువులను దుకాణదారులే మొబైల్ వాహనాల ద్వారా ఇళ్లకు సరపరా చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి ఈ అనుమతి కల్పించారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి పొందిన వ్యాపారులు ప్రజలకు నేరుగా వారికి కావాల్సిన వస్తువులను తీసుకెళ్లి విక్రయించే అవకాశం కల్పించారు. ఇందు కోసం చెన్నైలో 7,500 వాహనాలను సిద్ధం చేసినట్టు కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ భేటి తెలిపారు. విక్రయాల నిమిత్తం ఆదివారం కోయంబేడు మార్కెట్ తెరిచి ఉంచారు. దీంతో మార్కెట్ వైపుగా వాహనాలు కిటకిటలాడాయి.
టీకా వేసుకుంటే బిర్యాని
చెన్నై శివారులోని కోవలంలో కరోనా టీకా వేసుకుంటే బంపర్ ఆఫర్‌తో కూడిన కానుకలను ఓ సంస్థ ప్రకటించింది. టీకా వేసుకునేందుకు వచ్చే వారికి బిర్యాని ప్యాకెట్లు, పండ్లు ఫలాలను అందిస్తున్నారు. అలాగే వారి పేర్లను ఓ చీటిలో రాసి బాక్సులో వేస్తున్నారు. చివరి రోజున లక్కీ డ్రా తీయన్నుట్టు ఎవరి పేరు వస్తుందోవారికి బంగారు నాణెం ఇవ్వనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
పుదుచ్చేరిలో లాక్‌డౌన్ పొడిగింపు
పుదుచ్చేరిలో మరో వారం రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఇందుకు తగ్గ ఆదేశాలను ఎల్జీ తమిళి సై సౌందరరాజన్ జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు, ఆంక్షల సడలింపులే అమల్లో ఉంటాయని ఎల్పీ ప్రకటించారు. అలాగే, గ్రామాల్లో కేసుల తగ్గుముఖం లక్ష్యంగా నివారణ చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
చదవండి: ఊరట: జూన్‌లో 12 కోట్ల టీకా డోసులు
Comments
Please login to add a commentAdd a comment