రాయచూరు : జిల్లాలోని మహిళలు, చిన్నారుల్లో రోజురోజుకూ రక్తహీనత పెరుగుతోంది. ముఖ్యంగా 6 నుంచి 59 నెలల పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనత పెరుగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రక్తహీనతను నివారించేందుకు పంపిణీ అవుతున్న ఐరన్, పోలిక్ ఆసిడ్ మాత్రల కొరత తీవ్రంగా ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2013-14కుగాను జరిపిన సర్వేలో జిల్లాలో ఎక్కువ సంఖ్యలో పిల్లలు, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్టు తేలింది.
పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లే పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనత పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. సర్వే వివరాల మేరకు 6 నుంచి 50 నెలల వయసు పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో 77.3 శాతం మంది, అలాగే నగర ప్రాంతాల్లో 73.4 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 6 నుంచి 9 ఏళ్ల గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో 64.1 మంది, అలాగే నగరాల్లో 58.5 శాతం మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు.
10 నుంచి 19 ఏళ్ల పిల్లల్లో గ్రామీణ ప్రాంతాల్లో 62 శాతం మంది, నగరాల్లో 57.7 శాతం మంది ఆడపిల్లలు రక్తహీనత బారిన పడ్డారు. వయస్సుకురాని వారిని కూడా రక్తహీనత వెంటాడుతోంది. 15 నుంచి 19 ఏళ్లలోపు వారిలో 53.6 శాతం మంది, అలాగే నగరాల్లో 48.3 యువతు రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భిణుల్లో రక్తహీనత పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామీణుల్లో 67 శాతం మంది, నగరాల్లో 60.6 శాతం మంది గర్భిణులు దీంతో సతమతమవుతున్నారు.
తద్వారా తల్లీబిడ్డలు మృత్యువాతపడుతున్నారు. ఇటీవల ఆహారశైలి మారడంతో పౌష్టికాహారం అందడం లేదు. ముఖ్యంగా ఇనుము ధాతువు ఎక్కువగా ఉన్న కాయగూరలు, ఆహారాలు తినడం లేదు. ఈ విషయమై జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నారాాయణ మాట్లాడుతూ రక్తహీనత పెరుగుతుండడం ఆందోళనకరమన్నారు.
శాఖ ఆధ్వర్యంలో తగినంత శ్రద్ధ తీసుకుని రక్తహీనత నివారణకు కృషిచేస్తామన్నారు. స్థానిక నిధుల ద్వారా 3 లక్షల ఐరన్ మాత్రలు కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని తెలిపారు.
పెరుగుతున్న రక్తహీనత
Published Thu, Oct 23 2014 6:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 PM
Advertisement