ఏ తిండిలో ఏముంది? | NIN Designed analyzed with 526 food items | Sakshi
Sakshi News home page

ఏ తిండిలో ఏముంది?

Published Sun, Jan 29 2017 2:38 AM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM

ఏ తిండిలో ఏముంది? - Sakshi

ఏ తిండిలో ఏముంది?

ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం తీసుకోవాలి

పోషకాల వారీగా సమస్త వివరాలతో నివేదిక
526 ఆహార పదార్థాలను విశ్లేషించి రూపొందించిన ఎన్‌ఐఎన్‌
త్వరలో సరికొత్త యాప్‌
తిన్నది చెబితే చాలు.. అందులోని క్యాలరీలు, పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ప్రత్యక్షం

మధుమేహం వచ్చిందా..? ‘‘అన్నం మానేయ్‌. రోజూ రాగి సంకటి తిను.. ఫలానా చెట్టు తీగ భలే పనిచేస్తుందట..’’ ఇలాంటి సలహాలు బోలెడు వినిపిస్తాయి! ఎవరి మాట వినాలో.. ఎవరిది వినవద్దో తెలియక తలపట్టుకునే సందర్భాలూ బోలెడుంటాయి. ఇకపై ఈ సమస్య ఉండదు. ఒక్క మధుమేహం మాత్రమే కాదు.. అన్ని రకాల పోషకాలతో ఆరోగ్యంగా పుష్టిగా ఉండాలంటే ఏం తినాలి? ఏ ఆహారంలో ఎలాంటి పోషకాలున్నాయి? విటమిన్లు, ఖనిజాల మోతాదులు ఎంత? తదితర అంశాలన్నింటితో జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌)  సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసింది. ఇండియన్‌ ఫుడ్‌ కాంపోజిషన్‌ టేబుల్స్‌ (ఐఎఫ్‌సీటీ) పేరుతో ఈ నెల 18న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా చేతుల మీదుగా ఈ నివేదిక విడుదల చేశారు. ఎన్‌ఐఎన్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ టి.లోంగ్వా, సీనియర్‌ శాస్త్రవేత్తలు అందించిన ఆ వివరాలు స్థూలంగా..
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

ఈ నివేదిక ఓ దిక్సూచి..
దేశంలో ఆహార పదార్థాల్లోని పోషకాంశాల మోతాదును అంచనా కట్టి దాదాపు 45 ఏళ్లు గడచిపోయాయి. 1971నాటి నివేదికకు 1989లో కొన్ని అంశాలను చేర్చారు. అయితే ఆహారపు అలవాట్లు, వ్యవసాయ పద్ధతులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల రాక నేపథ్యంలో ఎన్‌ఐఎన్‌ మరో సమగ్ర అధ్యయనాన్ని చేపట్టింది. ఇందుకు దేశం మొత్తాన్ని నైసర్గిక, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఆరు ప్రాంతాలుగా విభజించింది. ఈ ప్రాంతాల నుంచి 526 రకాల ఆహార పదార్థాలు (బియ్యం, గోధుమ మొదలుకొని రకరకాల ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, చేపలు, మాంసం తదితరాలు) సేకరించి విశ్లేషించింది.

కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు పదార్థాలు వంటి 12 స్థూలాంశాల్లో, విటమిన్‌ డి, పాలిఫినాల్స్, కాల్షియం, మెగ్నీషియం, రైబోఫ్లెవిన్‌ వంటి వందకుపైగా సూక్ష్మాంశాల మోతాదును నిశితంగా పరిశీలించింది. వీటన్నింటితో ఇండియన్‌ ఫుడ్‌ కాంపోజిషన్‌ టేబుల్‌ను రూపొందించింది. మధుమేహం, రక్తపోటుతోపాటు అనేక రకాల వ్యాధుల నియంత్రణ, కొన్నింటి చికిత్సలోనూ ఆహారం కీలకపాత్ర పోషిస్తుందన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. డైటీషియన్లు మొదలుకొని, ఆహార రంగంలో ఉన్నవారికి, పిల్లలు, మహిళలు ఇతరులకు పోషకాహారంఅందించే ప్రభుత్వ సంస్థలకు, పరిశోధకులకు ఈ నివేదిక ఓ దిక్సూచిలా ఉండనుంది.

దంపుడా.. పాలిష్డా..?
మల్లెపూల మాదిరిగా తెల్లగా ఉన్న అన్నం తినడం మనలో చాలామందికి అలవాటు. అయితే ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి దీంతో పెద్దగా ప్రయోజనం లేదన్న వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఈ రెండింటిలో ఏది తినడం మేలన్న ప్రశ్నను టి.లోంగ్వా ముందు ఉంచింది. దానికి ఆయన సమాధానమిస్తూ ‘‘చాలామంది దంపుడు బియ్యం మేలని అంటారు. అందులో కొంత నిజం లేకపోలేదు. పైపొరలో అనేక సూక్ష్మ పోషకాలు, బీ విటమిన్లు ఉంటాయి. పాలిష్‌ చేసే క్రమంలో ఇవన్నీ పోతాయి. అయితే ఇందులో ఓ చిక్కుంది. ఇదే పై పొరలో ఫేటేట్లు అనే రసాయనాలు కూడా ఉంటాయి. శరీరం ఇనుము, కాల్షియం వంటి వాటిని శోషించుకోకుండా ఇవి అడ్డుకుంటాయి. ఈ కారణంగానే మేం ఇటీవల బియ్యం పాలిషింగ్‌పై విస్తృత అధ్యయనం చేశాం. ప్రస్తుతం చేస్తున్న పది శాతం మిల్లింగ్‌ స్థానంలో 8 శాతం చేస్తే చాలా వరకూ సమస్యలను అధిగమించవచ్చని మా అధ్యయనంలో తేలింది’’ అని అన్నారు.

స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌లో సమస్తం
అన్ని విధాలుగా పుష్టినిచ్చే ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి ఎంత మేలు/కీడు జరుగుతోందో తెలుసుకోవడమూ అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఎన్‌ సామాన్య ప్రజలందరికీ ఉపయోగపడేలా ఓ స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయనుంది. మీ వయసు, బరువు, ఎత్తు వంటి వివరాలతోపాటు తినే ఆహారం తాలూకూ వివరాలు ఈ అప్లికేషన్‌లో నమోదు చేస్తే చాలు.. మీకు ఎన్ని కేలరీల శక్తి అందింది..? అందులో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాంశాల మోతాదు ఎంత? అన్న వివరాలు తెలిసిపోతాయి. ‘‘మరో మూడు నాలుగు నెలల్లో ఈ అప్లికేషన్‌ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్‌తోపాటు ఐఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై కూడా పనిచేసేలా రూపొందిస్తున్నాం’’ అని ఎన్‌ఐఎన్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌ తెలిపారు.

నివేదికలో ఎన్నో ప్రత్యేకతలు
ఎన్‌ఐఎన్‌ సిద్ధం చేసిన ఈ నివేదిక ఎన్నో విధాలుగా ప్రత్యేకమైంది. ప్రపంచంలోనే తొలిసారి ఈ నివేదికలో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్‌ డి లభించే ఆహార పదార్థాల విస్తృత వివరాలు అందించారు. సూర్యరశ్మి ద్వారా మాత్రమే శరీరం ఈ విటమిన్‌ను తయారు చేసుకోగలదని, కొన్ని రకాల మాంసాహారాల్లోనూ లభిస్తుందని మనకు తెలుసు. అయితే ఈ విటమిన్‌ ఏ ఏ కాయగూరలు, ఆకు కూరలు, తిండిగింజల్లో ఎంత మోతాదులో ఉంటుందో ఎన్‌ఐఎన్‌ విశ్లేషించింది. అంతేకాకుండా దేశ ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ నివేదికలో విశ్లేషించిన 526 ఆహార పదార్థాల పేర్లను 15 జాతీయ భాషల్లో తర్జుమా చేసి అందించింది. ప్రస్తుతం ఆంగ్లంలో ఉన్న ఈ నివేదికను ఇతర భాషల్లోకి అనువదించేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఎన్‌ఐఎన్‌ మీడియా కో– ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.మహేశ్వర్‌ తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో రక్తహీనత
ఐఎఫ్‌సీటీ టేబుళ్ల తయారీ కోసం చేసిన సర్వే ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సగానికిపైగా జనాభా రక్తహీనతతో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో పాటు ప్రజల్లో 20 శాతం మంది రక్తపోటు సమస్య కలిగి ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ తాజాగా ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటి వివరాలను సేకరించామని, వీరిలో ఉన్న లోటు పాట్లు, సమస్యలపై త్వరలోనే ఓ నివేదికను సిద్ధం చేస్తామని ఎన్‌ఐఎన్‌ సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ లక్ష్మయ్య తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement