భద్రాద్రి జిల్లా భేతాళపాడులో కిడ్నీ రోగుల నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్న వైద్యసిబ్బంది
జూలూరుపాడు: పోషకాహార లోపమే వ్యాధులకు ప్రధాన కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)– జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ జె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి వచ్చిన ఐసీఎంఆర్ – ఎన్‌ఐఎన్ బృందం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలసి అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ..తెలంగాణలో గిరిజన జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశ్రీ, నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే(ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్), ఇతర జాతీయ సంస్థల నివేదికల్లో వెల్లడైందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మహిళలు, యువతులు, చిన్నారుల్లో 60% మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు సర్వే ద్వారా తేలిందని చెప్పారు.
మరోసారి నమూనాల సేకరణ
గ్రామంలో కిడ్నీ వ్యాధులతో పలువురు మరణించిన నేపథ్యంలో ‘సాక్షి’ప్రధాన సంచికలో గతేడాది అక్టోబర్ 10న ‘ఆ ఊరికి ఏమైంది?’శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని బృందం అదే నెల 26న గ్రామాన్ని సందర్శించి కిడ్నీ వ్యాధిగ్రస్తుల నుంచి నమూనాలను సేకరించారు. ఈ నేపథ్యంలో గురువారం వ్యాధిగ్రస్తులనుంచి మరోసారి నమూనాలను తీసుకున్నారు.
అనంతరం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ..ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు తాగాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్‌ఓ డాక్టర్ శిరీష, అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ దయానంద్, డీఎంఓ డాక్టర్ భూక్యా వీరబాబు,తహసీల్దార్ లూథర్ విల్సన్, జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment