dr srinivasrao
-
కు.ని. బాధితుల్లో 28 మందికి ఇన్ఫెక్షన్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్లు వికటించి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 30 మంది బాధితుల్లో 28 మందికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయింది. వారికి అపోలో, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స నిర్వహిస్తున్నారు. ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందడంతో అప్రమత్తమైన ప్రభుత్వం మిగిలిన 30 మంది మహిళలనూ వేరే ఆసుపత్రులకు తరలించింది. ఇన్ఫెక్షన్కు గురైన వారిని సకాలంలో ఆసుపత్రులకు తీసుకురావడంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ నియంత్రణకు ఉపయోగించే వైద్య పరికరాలు సరిగా స్టెరిలైజేషన్ చేయకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. కాగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 30 మందిలో 10 మందిని శుక్రవారం డిశ్చార్జి చేయాలని భావిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. విడతల వారీగా బాధితులను డిశ్చార్జి చేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం బాధితులంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టంచేశారు. ఇన్ఫెక్షన్ కారణంగానే మృతి ఇబ్రహీంపట్నంలో మృతి చెందిన నలుగురి పోస్ట్‌మార్టం వివరాలను వైద్య వర్గాలు వెల్లడించాయి. వారి రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని తెలిపాయి. ఇతరత్రా అవయవాలపై ఎలాంటి ప్రభావం కనిపించలేదని స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ కారణంగానే వారు మరణించినట్లు భావిస్తున్నామన్నాయి. కాగా, డబుల్ పంక్చర్ లాప్రోస్కోపీ (డీపీఎల్) పద్ధతిలో క్యాంపుల ద్వారా జరిగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఒక్కో రోజు 10–15 మంది కంటే ఎక్కువగా కు.ని. ఆపరేషన్లు చేయకూడదని నిర్ణయించినట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ తెలిపారు. ఇతర విధానాల్లో కు.ని. సర్జరీలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు గురువారం జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఘటన నేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడైనా వికటించే సంఘటనలు జరిగితే జిల్లా వైద్యాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత రెండు వారాలుగా కేసుల్లో పెరుగుదల కనిపించగా, మంగళవారం మాత్రం ఏకంగా 400 మార్కును దాటాయి. ఒక్కరోజులో 26,704 మందికి కరోనా పరీక్షలు చేయగా, 403 మంది వైరస్ బారిన పడ్డట్టు తేలింది. అందులో హైదరాబాద్‌లో 240, రంగారెడ్డి జిల్లాలో 103 మంది ఉన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఏకంగా 1.5 శాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మూడున్నర నెలల తర్వాత ఇంతటిస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. కాగా, ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 7.96 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 145 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7.90 లక్షల మంది కోలుకున్నారు. 2,375 క్రియాశీలక కేసులు ఉన్నాయి. 24 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. అందులో 12 మంది సాధారణ పడకలపై, ఏడుగురు ఆక్సిజన్‌పై, ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి.. సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతుండటంతో జాగ్రత్తలు పాటించాలని, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడటం తప్పనిసరి అని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పదిహేను రోజుల నుంచి దేశంలో, తెలంగాణలో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయని చెప్పారు. కోవిడ్ కేసుల పెరుగుదలలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రెండు డోస్‌ల టీకా వెంటనే తీసుకోవాలని, పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటినవారు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. కోవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న 20– 50 ఏళ్ల మధ్య వయసువారు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, కేన్సర్, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు కోవిడ్‌కు గురికాకుండా చూసుకోవాలని, వైద్యం కోసం తప్ప ఎలాంటి ప్రయాణాలు చేయొద్దని పేర్కొన్నారు. -
కొత్తగా 129 కరోనా కేసులు
రాష్ట్రంలో ఆదివారం 13,254 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 129 మంది పాజిటివ్‌గా తేలారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.94 లక్షలకు చేరుకుంది. తాజాగా 67 మంది కోలుకోగా, మొత్తం 7.89 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,039 క్రియాశీలక కరోనా కేసులున్నాయని ప్రజారోగ్య సంచాల కుడు డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బులిటెన్‌లో వెల్లడించారు. -
పోషకాహార లోపంతోనే వ్యాధులు
జూలూరుపాడు: పోషకాహార లోపమే వ్యాధులకు ప్రధాన కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)– జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ జె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి వచ్చిన ఐసీఎంఆర్ – ఎన్ఐఎన్ బృందం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలసి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ..తెలంగాణలో గిరిజన జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశ్రీ, నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే(ఎన్హెచ్ఎఫ్ఎస్), ఇతర జాతీయ సంస్థల నివేదికల్లో వెల్లడైందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మహిళలు, యువతులు, చిన్నారుల్లో 60% మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు సర్వే ద్వారా తేలిందని చెప్పారు. మరోసారి నమూనాల సేకరణ గ్రామంలో కిడ్నీ వ్యాధులతో పలువురు మరణించిన నేపథ్యంలో ‘సాక్షి’ప్రధాన సంచికలో గతేడాది అక్టోబర్ 10న ‘ఆ ఊరికి ఏమైంది?’శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని బృందం అదే నెల 26న గ్రామాన్ని సందర్శించి కిడ్నీ వ్యాధిగ్రస్తుల నుంచి నమూనాలను సేకరించారు. ఈ నేపథ్యంలో గురువారం వ్యాధిగ్రస్తులనుంచి మరోసారి నమూనాలను తీసుకున్నారు. అనంతరం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ..ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు తాగాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ దయానంద్, డీఎంఓ డాక్టర్ భూక్యా వీరబాబు,తహసీల్దార్ లూథర్ విల్సన్, జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
మన మధ్యనే ఒమిక్రాన్.. రాబోయే నాలుగు వారాలు కీలకం
♦రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కేసులు పెద్దఎత్తున నమోదవుతున్నాయి. కేసుల సంఖ్యలో 4 రెట్లకు పైగా పెరుగుదల ఉంది. పాజిటివిటీ కూడా 1 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగింది. ♦రాష్ట్రంలో ఒమిక్రాన్‌తో ఎవరూ చనిపోలేదు. ఇప్పటివరకు గుర్తించిన ఒమిక్రాన్ బాధితుల్లో 99 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు లేవు. ఒకవేళ ఉన్నా కూడా స్వల్ప లక్షణాలే ఉన్నాయి. ♦కేసుల సంఖ్య పెరుగుతున్నా.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మాత్రం ఉత్పన్నం కావడంలేదు. ఆసుపత్రిలో చేరే అవసరం ఉండడం లేదు. ఆక్సిజన్ అవసరం, ఐసీయూలో చేరికలు లేకపోవడం సానుకూల అంశాలు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి జరుగుతోందని, రాబోయే రోజుల్లో 90 శాతం కేసులు అవే ఉంటాయని ప్రజారోగ్య సంచాల కుడు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చ రించారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో కూడా 60–70 శాతం ఒమిక్రాన్ కేసులేనని తెలిపారు. అయితే ఇప్పటికీ డెల్టా వేరియంట్ కేసులు వస్తున్నాయని చెప్పారు. దేశంలో థర్డ్‌వేవ్ ఉధృతి ప్రారంభమైందని గురువారం విలేకరులతో మాట్లాడుతూ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో లాక్డౌన్ విధించే అవకాశం లేదని చెప్పారు. ఫిబ్రవరి రెండో వారానికి తగ్గుదల ‘వచ్చే నాలుగు వారాల్లో అంటే దాదాపు ఈ నెల చివరికి కేసులు గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి రెండో వారం ముగిసేసరికి క్రమేణా తగ్గిపోయే అవకాశాలున్నాయి. కాబట్టి వచ్చే నాలుగు వారాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ థర్డ్‌వేవ్‌లో మరణాల శాతం దాదాపుగా సున్నానే. ప్రాణాలు పోయే పరిస్థితి లేదని గ్రహించాలి. అయితే అప్రమత్తతతో మెలగాలి..’ అని శ్రీనివాసరావు సూచించారు. లక్షణాలు తీవ్రమైతే ఆసుపత్రిలో చేరాలి ‘కేసుల సంఖ్యలో దేశవ్యాప్తంగా 2 నుంచి 6 రెట్ల పెరుగుదల కనిపిస్తోంది. 95 శాతం మంది బాధితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కేవలం 5 రోజుల్లోనే కోలుకుంటున్నారు. సాధారణ లక్షణాలున్నవారు కూడా భయంతో ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇలా అనవసరంగా చేరడం వల్ల అవసరమైన వారికి ఇబ్బందులు ఎదుర వుతాయి. కానీ లక్షణాలు తీవ్రమై ఆయాసం వస్తుంటే మాత్రం వెంటనే ఆసుపత్రిలో చేరాలి. రక్తంలో ఆక్సిజన్ శాతం 93 కంటే తక్కువగా ఉన్నా ఆసుపత్రిలో చేరాలి. కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం గరిష్ట ఐసోలేషన్ ఏడు రోజులే..’ అని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆస్పత్రులపై చర్యలు ‘రోగులను అనవసరంగా చేర్చుకోవద్దు. అవ సరమైన వారిని మాత్రమే చేర్చుకోవాలని ప్రైవే టు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కొన్ని ఆసుపత్రులు, కొందరు వైద్యులు ఖరీదైన మం దులను వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించి చికిత్స అందించాలి. మోనోక్లోనల్ యాంటీబాడీస్, టోసిలిజుమాబ్ వంటివి అనారోగ్య తీవ్రతను బట్టి అందించాలి. రోగులపై అనవసర భారాన్ని మోపొద్దు. నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం. ప్రజలు సొంత వైద్యాలు చేసుకోవడం కూడా మానుకోవాలి. లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌గా తేలితే వైద్యుడితో చికిత్స పొందాలి..’ అని సూచించారు. పిల్లల కోసం 10 వేల పడకలు ‘మొత్తం పడకల్లో 2.3 శాతంలో మాత్రమే రోగులున్నారు. ఎక్కడ కూడా ఆసుపత్రిలో చేరి కలు పెరగలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని పాజిటివ్ కేసులను వేరియంట్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నాం. పిల్లల కోసం ప్రత్యేకంగా 10 వేల పడకలను సిద్ధం చేశాం. 60 ఏళ్లు పైబడిన వారికి ఈ నెల 10వ తేదీ నుంచి ముందస్తు నివారణ డోసు ఇస్తున్నాం..’ అని శ్రీనివాస రావు తెలిపారు. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు ‘వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశాం. వచ్చే 4 వారాల పాటు ఎవరూ సెలవులు తీసుకోవద్దు. ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. గుం పుల్లో తిరగడానికి సరైన సమయం కాదు. పం డుగలు, వేడుకలు కుటుంబసభ్యుల మధ్య జరు పుకోవాలి. సెలవుల్లో బయటకు వెళ్లినప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించాలి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు.. వచ్చే 4 వారాలు అన్ని రకాల కార్య క్రమాలు రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తు న్నాం. రాబోయే రోజుల్లో మొత్తం కేసుల్లో ఒక శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వచ్చినా.. ఆసుపత్రులపై భారం పడే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితులు రాకుండా ఉం డాలంటే, ముందునుంచే అప్రమత్తత అ వసరం. ఈనెల 26 నాటికి టీకా రెండో డోసు కూ డా 100 శాతానికి చేరుకోవాలని వైద్యశాఖ మంత్రి ఆదే శాలిచ్చారు. పాఠశాలలు, కళాశాలలున్న చోటుకే వెళ్లి 15–18 ఏళ్ల వారికి టీకాలు అందించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. ఇప్పటివరకు తీసుకోని వారు టీకా తీసుకోండి..’ అని విజ్ఞప్తి చేశారు. అన్ని ఆస్పత్రుల్లో జ్వర క్లినిక్‌లు ‘రాష్ట్రంలో ఎన్నివేల కేసులొచ్చినా తట్టుకునే సా మర్థ్యముంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ జ్వర క్లినిక్‌లను ప్రారంభించాం. లక్షణాలున్నవారు అక్కడ పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే స్వల్ప లక్షణాలున్నవారికి హోం ఐసో లేషన్ కిట్లను అందజేస్తాం. మొత్తం పాజిటివిటీ 10% కంటే ఎక్కువైనా, ఆసుపత్రిలో చేరికలు 5% పెరిగినా ఆంక్షలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆ ఆదేశాలనే అమలు చేస్తున్నాం..’ అని చెప్పారు. సరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ ‘మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. వైద్య బృందాలను కూడా నియమించాం. కరోనా కేసులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేస్తాం. జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న వారికి అక్కడికక్కడే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తాం. ఎవరికైనా లక్షణాలుంటే హోం ఐసోలేషన్‌కు వెళ్లమని సూచిస్తాం. వైరస్ ఉన్న వ్యక్తులను అప్రమత్తం చేయగలిగాం. బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో వచ్చే వారిని చాలావరకు స్క్రీనింగ్ చేయాలన్న నియమం పెట్టుకున్నాం. సంక్రాంతికి వెళ్లి వచ్చే వారికి తప్పనిసరిగా సరిహద్దుల వద్ద పరీక్షలు చేస్తాం. కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చేవారు హైవేలు, ఇతర రహదారుల ద్వారా కాకుండా చిన్నపాటి దారుల ద్వారా ప్రవేశిస్తారు. అటువంటి చోట్ల కూడా స్క్రీనింగ్ ప్రక్రియ చేపడతాం..’ అని శ్రీనివాసరావు చెప్పారు. -
‘ఒమిక్రాన్‌తో భయం లేదు.. అలా అని నిర్లక్ష్యం చేశారో అంతే..’
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌పై స్పష్టత వచ్చింది. వ్యాధి తీవ్రత లేదు. 95 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండటంలేదు. రాష్ట్రంలో నమోదైన తొమ్మిది కేసుల్లో ఎవరికీ లక్షణాలు లేవు. డెల్టా వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోగా, ఒమిక్రాన్‌తో ఇప్పటివరకు యూకేలో మాత్రమే ఒక మరణం సంభవించింది. అది పుట్టిన దక్షిణాఫ్రికాలో ఎలాంటి మరణాలులేవు. కాబట్టి ఒమిక్రాన్‌తో ప్రాణాలకు ప్రమాదంలేదు. ఎలాంటి భయాలు అవసరం లేదు. అలా అని అజాగ్రత్త వద్దు. నిర్లక్ష్యం సామాజిక వ్యాప్తికి దారితీస్తుంద’ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అయితే వయో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంటుందో తెలియదని, రెండు మూడు వారాల్లో దీనిపై స్పష్టత వస్తుందన్నారు. శ్రీనివాసరావు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ..‘ఒమిక్రాన్ వేరియంట్లో 30 నుంచి 50 వరకు పరివర్తనాలు వచ్చాయి. అందుకే వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తుంది. కొన్నిచోట్ల వ్యాక్సిన్ వేసుకున్నా ఒమిక్రాన్ వస్తుంది’ అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8 కేసులు శుక్రవారం రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య తొమ్మిదికి చేరుకుందని శ్రీనివాసరావు తెలిపారు. అందులో ఒకరు పశ్చిమబెంగాల్‌కు వెళ్లగా, తెలంగాణలో ప్రస్తుతం 8 కేసులున్నాయని చెప్పారు. తాజాగా హన్మకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ సోకిందన్నారు. ఆమె యూకే నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు విమానాశ్రయంలో నెగెటివ్ వచ్చిందని, ఎనిమిది రోజుల తర్వాత చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ తేలితే జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్ బయటపడిందని వివరించారు. ఆమె ప్రస్తుతం టిమ్స్ ఆసుపత్రిలో ఉన్నారన్నారు. మరో కేసుకు సంబంధించిన వివరాలను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ ముప్పున్న దేశాల నుంచి 6,764 మంది రాష్ట్రానికి రాగా, ఇద్దరిలో ఒమిక్రాన్ వెలుగుచూసిందన్నారు. ముప్పులేని దేశాల నుంచి వచ్చిన వారిలో రెండు శాతం మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా, ఏడుగురికి ఒమిక్రాన్ సోకినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో నమోదైనవన్నీ కూడా ఇతర దేశాల నుంచే వచ్చినవేనని స్పష్టంచేశారు. తెలంగాణకు చెందిన ఎవరికీ ఒమిక్రాన్ రాలేదని, ఒమిక్రాన్ సామాజికవ్యాప్తి జరగలేదని తేల్చిచెప్పారు. ఒక్క కేసు తప్పితే మిగిలినవన్నీ తమ ఆధీనంలోనే ఉన్నాయన్నారు. వారందరికీ పరీక్షలు చేయలేం కేంద్రం నిబంధనల ప్రకారమే విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. ‘ముప్పులేని దేశాల నుంచి వచ్చే వారందరికీ పరీక్షలు చేయడం సాధ్యంకాదు. రెండు శాతం మందికే చేస్తున్నాం. విమానాశ్రయం కేంద్రం నియంత్రణలో ఉంటుంది. ఏం చేయాలన్నా కేంద్రమే నిర్ణయించాలి’ అని చెప్పారు. హోం క్వారంటైన్లో ఉన్నవారి వద్దకు తమ బృందాలు వెళ్తున్నాయని, అవసరమైన చోట పోలీసుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. ఒమిక్రాన్ బాధితులు పూర్తి టీకా తీసుకోలేదు రాష్ట్రంలో నమోదైన 9 ఒమిక్రాన్ కేసుల్లో కొందరు ఒక డోస్ వేసుకోగా, కొందరు అసలు వ్యాక్సినే వేసుకోలేదని శ్రీనివాసరావు చెప్పారు. ‘రాష్ట్రంలోకి ప్రవేశించిన ఎనిమిది మంది ఒమిక్రాన్ బాధితులతో కాంటాక్టు అయిన 21 మందిని గుర్తిస్తున్నాం. టోలీచౌక్‌లోని సంబంధిత కాలనీలో ఒకరోజు 511 పరీక్షలు చేశాం’ అని శ్రీనివాసరావు వివరించారు. -
తెలంగాణలో జోరుగా కరోనా టీకా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టీకా కార్యక్రమం ఊపందుకుంది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 51,997 మందికి టీకాలు వేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు వ్యాక్సినేషన్ బులెటిన్‌ను ఆయన విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీ తొలిరోజు 140 కేంద్రాల్లో, రెండోరోజు 18వ తేదీన 335 కేంద్రాల్లో టీకాలు వేశారు. మూడోరోజు మంగళవారం 894 కేంద్రాలకు విస్తరించారు. ఈ మూడు రోజుల్లో 69,625 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. తాజాగా 51 మందికి రియాక్షన్లు వచ్చాయని, అందులో ముగ్గురిని ఆసుపత్రిలో చేర్పించగా.. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సెలవని, తిరిగి ఈ నెల 21వ తేదీన వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలిపారు. టీకా కార్యక్రమం సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మాత్రమే నిర్వహిస్తారు. బుధ, శని, ఆదివారాలు, ఇతరత్ర సెలవు దినాల్లో టీకా వేయడం లేదు. బుధ, శనివారాల్లో చిన్న పిల్లలు, గర్భిణులకు రెగ్యులర్ సార్వత్రిక టీకాలు వేస్తారు. జిల్లాలకు కోవిషీల్డ్ .. మంగళవారం ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన మరో 3,48,500 కోవిషీల్డ్ టీకాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. పుణే నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన టీకాలను కోఠిలోని స్టేట్ వ్యాక్సిన్ సెంటర్‌కు తరలించారు. రెండో దశ పంపిణీ కోసం వాటిని జిల్లాలకు పంపించనున్నారు. మొదటి విడతలో 80 లక్షల మందికి ఉచితం మొదటి విడతలో రాష్ట్రంలోని 80 లక్షల మందికి ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదటి విడత లబ్ధిదారులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 50 ఏళ్లు దాటిన వారు, 18–50 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముగిసిన తర్వాత మిగతా రెండు కేటగిరీలకు టీకాలు ఇస్తారు. మార్చి నుంచి 50 ఏళ్లు దాటిన వారికి, 18–50 ఏళ్ల మధ్య వయసులోని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకాలు వేస్తామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. -
వ్యాక్సిన్ వేసేందుకు 10 వేల బృందాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ రాష్ట్రానికి చేరుకున్న వెంటనే బాధితులకు వేసేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం 30 వేల మంది వైద్య సిబ్బందికి జిల్లాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు కోవిడ్ వ్యాక్సిన్ ఇన్చార్జి, ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే రెండ్రోజులు రాష్ట్ర స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వారు ప్రతి జిల్లాలో ఏడుగురికి శిక్షణ ఇస్తారు. అనంతరం వారు ఎంపిక చేసిన 30 వేల మంది ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలకు, నర్సులకు శిక్షణ ఇస్తారు. ఈ నెల 14 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని, 20 లోపు అందరికీ శిక్షణ పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసేం దుకు 10 వేల బృందాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో బృందంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్త, నర్సు ఉంటారు. అలా 10 వేల బృందాలు.. అందులో మొత్తం 30 వేల మంది ఉంటారు. వీరికి శిక్షణ ఇస్తూనే.. ఎంపిక చేసిన డాక్టర్లకు కూడా శిక్షణనిస్తారు. వ్యాక్సిన్ ఎక్కడైనా వికటించి సమస్య తలెత్తితే ఆ మేరకు చికిత్స అందించేలా డాక్టర్లు ఉంటారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో ఉన్న వైద్యులకూ శిక్షణ ఉంటుంది. పోలీసు, రవాణా సిబ్బందికి కూడా..: వైద్య సిబ్బందితో పాటు వ్యాక్సిన్‌లో పాలుపంచుకునే వారికి కూడా శిక్షణ ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటిం చింది. ఈ మేరకు ఆయా శాఖల అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఏదేమైనా ఈ నెల 20 లోపు శిక్షణ పూర్తి చేస్తారు. ప్రస్తుత సమాచారం ప్రకారం వచ్చే నెల రెండో వారంలో రాష్ట్రానికి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయి. ఫ్రంట్‌లైన్ కార్మికులు, 50 ఏళ్లు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి జాబితా తయారు చేసే పనిలో వైద్య, ఆరోగ్య శాఖ నిమగ్నమైంది. వీరి పేర్ల నమోదుకు వైద్య, ఆరోగ్య శాఖ ఒక యాప్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని దాదాపు 3 లక్షల మంది జాబితా దాదాపు ఖరారైంది. -
కొత్తగా 2,278 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 62,234 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన బులెటిన్ విడుదల చేశారు. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,54,880కి చేరింది. ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 950కి చేరింది. కరోనా నుంచి తాజాగా 2,458 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,21,925కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,005 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 25,050 మంది హోం లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 20,78,695కి చేరిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 55,989 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చినవారు 1,06,867 (69%) మంది ఉన్నారు. లక్షణాలతో కరోనా సోకిన వారు 48,013 (31%) ఉన్నారు. వైరస్ సోకి చనిపోయిన కేసుల్లో 46.13 శాతం మంది కరోనాతో చనిపోగా, మిగిలిన 53.87 శాతం మంది కరోనాతోపాటు ఇతరత్రా అనారోగ్యాలతో చనిపోయారు. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 చోట్ల, ప్రైవేట్‌లో 38 కేంద్రాల్లో చేస్తున్నారు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలను 1,076 ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తున్నారు. ఇదిలావుంటే ఒక రోజులో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 331, రంగారెడ్డి జిల్లాలో 184, మేడ్చల్‌లో 150, నల్లగొండలో 126, కరీంనగర్లో 121 నమోదయ్యాయి. -
జరభద్రం.. వ్యాధులకాలం
పొంచిఉన్న మలేరియా, డయేరియా, అంటువ్యాధులు కాచిచల్లార్చిన నీటిని తాగాలి.. పరిశుభ్రత పాటించాలి పాలెం క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్‌రావు బిజినేపల్లి: నిత్యం కురుస్తున్న ముసురు వర్షాలు.. పారిశుద్ధ్యం లోపంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. కొన్ని రోజులుగా ఆస్పత్రులకు వచ్చే బయటి రోగుల సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో కలుషిత నీరు,దోమలు, ఈగల కారణంగా ఎక్కువ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అతిసారం, టైపాయిడ్, చికెన్‌గున్యా, డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు సులువుగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిసరాలు ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలని పాలెం క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్‌రావు సూచిస్తున్నారు. కలుషిత నీరు, ఆహార పదార్థాలతో అతిసార వర్షాకాలంలో ఆహార పదార్థాలు తాగునీటి కాలుష్యం కారణంగా అతిసార వ్యాధి సంక్రమిస్తుంది. కలుషిత ఆహార పదార్థాలు తీసుకోవడం, సగం ఉడికించిన మాంసాహారం తీసుకోవడం, వీధుల్లో అపరిశుభ్ర వాతావరణంలో విక్రయించే తినుబండారాలు తీసుకోవడం వల్ల వ్యాధిబారిన పడే అవకాశం ఉంది. వ్యాధి సోకిన వారికి విపరీతంగా వాంతులు, విరేచనాలు అయి శరీరంలో నీటి శాతం పడిపోతుంది. నివారణగా శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండ ఉండేందుకు ఉప్పు, చక్కర, నిమ్మరసం కలిసిన నీటిని తీసుకోవాలి. సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఈగలతో టైఫాయిడ్, కలరా.. ఇండ్ల చుట్టు అపరిశుభ్ర వాతావరణం కారణంగా వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి సాల్మానెల్లాటైపి అనే బ్యాక్టీరియాకు వాహకాలుగా ఉండటం వల్ల విషజ్వరాలు వస్తాయి. టైఫాయిడ్ బారిన పడిన వారు తరచు జ్వరంతో బాధపడుతుంటారు. రోజుల తరబడి జ్వరం వదలకుండా ఉంటే రోగ నిర్ధారణకు రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాధి బారిన పడకుండా ముందస్తుగా టీకాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి ప్రబలకుండ ఉండాలంటే వీధులను ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహార పదార్థాలపై మూత కప్పి ఉంచాలి. దోమలతో మలేరియా, చికెన్‌గున్యా, డెంగ్యూ దోమ కాటు వల్ల మలేరియా, చికెన్‌గున్యా వ్యాధులు సంక్రమిస్తాయి. ఆడ ఎనాపిలస్ దోమ కాటు వల్ల మలేరియా వస్తుంది. తరచు జ్వరం, తలనొప్పి, శరీరం వణుకు పట్టడం, చలిజ్వరం వ్యాధి లక్షణాలు. కీళ్ల నొప్పులు, తీవ్రమైన జ్వరం వేధిస్తున్నట్లయితే చికెన్‌గున్యా వ్యాధికి గురైనట్లు సంకేతం. పగటి వేళల్లో సంచరించే ఎడిస్ ఇజిప్టె అనే దోమల వల్ల డెంగ్యూ వ్యాపిస్తుంది. ఈ దోమలు మోచేతుల కింద, మోకాళ్లపై కుడుతుంటాయి. ఈ వ్యాధికి గురైన వారు జ్వరంతో బాధపడటమే కాకుండా శరీరంపై దద్దుర్లు రావడం, తెల్లరక్త కణాలు తగ్గిపోవడం సంభవిస్తుంది. పారిశుద్ధ్య లేమితో హెపటైటీస్ ఈ సీజన్లో హెపటైటీస్ వ్యాధి సైతం ఎక్కువగా వేధిస్తుంది. పారిశుద్ధ్యం లోపించడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి బారిన పడ్డవారి కాలేయాన్ని దెబ్బతీసి పచ్చకామెర్లను కలిగిస్తుంది. కాళ్లు, చర్మం పచ్చబడటం, మూత్రం పసుపు రంగులో రావడం వ్యాధి లక్షణాలు, వ్యాధి నివారణ కోసం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి. వ్యాధులు సోకకుండ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పారిశుద్ధ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇండ్ల మధ్య నీరు నిల్వ ఉండకుండా చూడాలి. సగం ఉడికించిన మాంసాహారాన్ని భుజించవద్దు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండ పాటించాలి. మలమూత్ర విసర్జనకు వెళ్లి వచ్చినప్పుడు చేతులు కాళ్లు కడుకోవాలి. కూరగాయలను బాగా ఉడికించి వండాలి. ఆహార పదార్థాలను నిల్వ ఉంచి తినేకంటే ఎప్పటికప్పుడు వండుకొని తినాలి. దోమలు కుట్టకుండా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి. ఈగలు, దోమల నివారణ చర్యలు చేపట్టాలి.