Omicron Telangana: DPH Says 'Omicron Cases Behind Massive COVID Surge In Telangana' - Sakshi
Sakshi News home page

మన మధ్యనే ఒమిక్రాన్‌.. రాబోయే నాలుగు వారాలు కీలకం

Published Fri, Jan 7 2022 3:18 AM | Last Updated on Fri, Jan 7 2022 9:36 AM

Omicron Cases Behind Massive COVID Surge In Telangana: DPH - Sakshi

రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కేసులు పెద్దఎత్తున నమోదవుతున్నాయి. కేసుల సంఖ్యలో 4 రెట్లకు పైగా పెరుగుదల ఉంది. పాజిటివిటీ కూడా 1 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగింది. 

రాష్ట్రంలో ఒమిక్రాన్‌తో ఎవరూ చనిపోలేదు. ఇప్పటివరకు గుర్తించిన ఒమిక్రాన్‌ బాధితుల్లో 99 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు లేవు. ఒకవేళ ఉన్నా కూడా స్వల్ప లక్షణాలే ఉన్నాయి.

కేసుల సంఖ్య పెరుగుతున్నా.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మాత్రం ఉత్పన్నం కావడంలేదు. ఆసుపత్రిలో చేరే అవసరం ఉండడం లేదు. ఆక్సిజన్‌ అవసరం, ఐసీయూలో చేరికలు లేకపోవడం సానుకూల అంశాలు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సామాజిక వ్యాప్తి జరుగుతోందని, రాబోయే రోజుల్లో 90 శాతం కేసులు అవే  ఉంటాయని ప్రజారోగ్య సంచాల కుడు డాక్టర్‌ శ్రీనివాసరావు హెచ్చ రించారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో కూడా 60–70 శాతం ఒమిక్రాన్‌ కేసులేనని తెలిపారు. అయితే ఇప్పటికీ డెల్టా వేరియంట్‌ కేసులు వస్తున్నాయని చెప్పారు. దేశంలో థర్డ్‌వేవ్‌ ఉధృతి ప్రారంభమైందని గురువారం విలేకరులతో మాట్లాడుతూ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌ విధించే అవకాశం లేదని చెప్పారు.

ఫిబ్రవరి రెండో వారానికి తగ్గుదల
‘వచ్చే నాలుగు వారాల్లో అంటే దాదాపు ఈ నెల చివరికి కేసులు గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి రెండో వారం ముగిసేసరికి క్రమేణా తగ్గిపోయే అవకాశాలున్నాయి. కాబట్టి వచ్చే నాలుగు వారాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ థర్డ్‌వేవ్‌లో మరణాల శాతం దాదాపుగా సున్నానే. ప్రాణాలు పోయే పరిస్థితి లేదని గ్రహించాలి. అయితే అప్రమత్తతతో మెలగాలి..’ అని శ్రీనివాసరావు సూచించారు.

లక్షణాలు తీవ్రమైతే ఆసుపత్రిలో చేరాలి
‘కేసుల సంఖ్యలో దేశవ్యాప్తంగా 2 నుంచి 6 రెట్ల పెరుగుదల కనిపిస్తోంది. 95 శాతం మంది బాధితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కేవలం 5 రోజుల్లోనే కోలుకుంటున్నారు. సాధారణ లక్షణాలున్నవారు కూడా భయంతో ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇలా అనవసరంగా చేరడం వల్ల అవసరమైన వారికి ఇబ్బందులు ఎదుర వుతాయి. కానీ లక్షణాలు తీవ్రమై ఆయాసం వస్తుంటే మాత్రం వెంటనే ఆసుపత్రిలో చేరాలి. రక్తంలో ఆక్సిజన్‌ శాతం 93 కంటే తక్కువగా ఉన్నా ఆసుపత్రిలో చేరాలి. కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం గరిష్ట ఐసోలేషన్‌ ఏడు రోజులే..’ అని తెలిపారు. 

నిబంధనలు ఉల్లంఘిస్తే ఆస్పత్రులపై చర్యలు
‘రోగులను అనవసరంగా చేర్చుకోవద్దు. అవ సరమైన వారిని మాత్రమే చేర్చుకోవాలని ప్రైవే టు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కొన్ని ఆసుపత్రులు, కొందరు వైద్యులు ఖరీదైన మం దులను వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించి చికిత్స అందించాలి. మోనోక్లోనల్‌ యాంటీబాడీస్, టోసిలిజుమాబ్‌ వంటివి అనారోగ్య తీవ్రతను బట్టి అందించాలి. రోగులపై అనవసర భారాన్ని మోపొద్దు. నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం. ప్రజలు సొంత వైద్యాలు చేసుకోవడం కూడా మానుకోవాలి. లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌గా తేలితే వైద్యుడితో చికిత్స పొందాలి..’ అని సూచించారు. 

పిల్లల కోసం 10 వేల పడకలు
‘మొత్తం పడకల్లో 2.3 శాతంలో మాత్రమే రోగులున్నారు. ఎక్కడ కూడా ఆసుపత్రిలో చేరి కలు పెరగలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అన్ని పాజిటివ్‌ కేసులను వేరియంట్‌ నిర్ధారణ కోసం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నాం. పిల్లల కోసం ప్రత్యేకంగా 10 వేల పడకలను సిద్ధం చేశాం. 60 ఏళ్లు పైబడిన వారికి ఈ నెల 10వ తేదీ నుంచి ముందస్తు నివారణ డోసు ఇస్తున్నాం..’ అని శ్రీనివాస రావు తెలిపారు.

వైద్య సిబ్బందికి సెలవులు రద్దు
‘వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశాం. వచ్చే 4 వారాల పాటు ఎవరూ సెలవులు తీసుకోవద్దు. ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. గుం పుల్లో తిరగడానికి సరైన సమయం కాదు. పం డుగలు, వేడుకలు కుటుంబసభ్యుల మధ్య జరు పుకోవాలి. సెలవుల్లో బయటకు వెళ్లినప్పుడు కోవిడ్‌ నిబంధనలు  పాటించాలి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు,  ప్రజా సంఘాలు.. వచ్చే 4 వారాలు అన్ని రకాల కార్య క్రమాలు రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తు న్నాం.  

రాబోయే రోజుల్లో మొత్తం కేసుల్లో ఒక శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వచ్చినా.. ఆసుపత్రులపై భారం పడే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితులు రాకుండా ఉం డాలంటే, ముందునుంచే అప్రమత్తత అ వసరం. ఈనెల 26 నాటికి టీకా రెండో డోసు కూ డా 100 శాతానికి చేరుకోవాలని వైద్యశాఖ మంత్రి ఆదే శాలిచ్చారు. పాఠశాలలు, కళాశాలలున్న చోటుకే వెళ్లి 15–18 ఏళ్ల వారికి టీకాలు అందించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం.  ఇప్పటివరకు తీసుకోని వారు టీకా తీసుకోండి..’ అని విజ్ఞప్తి చేశారు.

అన్ని ఆస్పత్రుల్లో జ్వర క్లినిక్‌లు 
‘రాష్ట్రంలో ఎన్నివేల కేసులొచ్చినా తట్టుకునే సా మర్థ్యముంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ జ్వర క్లినిక్‌లను ప్రారంభించాం. లక్షణాలున్నవారు అక్కడ పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌ వస్తే స్వల్ప లక్షణాలున్నవారికి హోం ఐసో లేషన్‌ కిట్లను అందజేస్తాం. మొత్తం పాజిటివిటీ 10% కంటే ఎక్కువైనా, ఆసుపత్రిలో చేరికలు 5% పెరిగినా ఆంక్షలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆ ఆదేశాలనే అమలు చేస్తున్నాం..’ అని చెప్పారు.  

సరిహద్దుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌
‘మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. వైద్య బృందాలను కూడా నియమించాం. కరోనా కేసులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తాం. జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న వారికి అక్కడికక్కడే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తాం. ఎవరికైనా లక్షణాలుంటే హోం ఐసోలేషన్‌కు వెళ్లమని సూచిస్తాం. వైరస్‌ ఉన్న వ్యక్తులను అప్రమత్తం చేయగలిగాం.

బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో వచ్చే వారిని చాలావరకు స్క్రీనింగ్‌ చేయాలన్న నియమం పెట్టుకున్నాం. సంక్రాంతికి వెళ్లి వచ్చే వారికి తప్పనిసరిగా సరిహద్దుల వద్ద పరీక్షలు చేస్తాం. కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చేవారు హైవేలు, ఇతర రహదారుల ద్వారా కాకుండా చిన్నపాటి దారుల ద్వారా ప్రవేశిస్తారు. అటువంటి చోట్ల కూడా స్క్రీనింగ్‌ ప్రక్రియ చేపడతాం..’ అని శ్రీనివాసరావు చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement