సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్లు వికటించి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 30 మంది బాధితుల్లో 28 మందికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయింది. వారికి అపోలో, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స నిర్వహిస్తున్నారు. ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందడంతో అప్రమత్తమైన ప్రభుత్వం మిగిలిన 30 మంది మహిళలనూ వేరే ఆసుపత్రులకు తరలించింది.
ఇన్ఫెక్షన్‌కు గురైన వారిని సకాలంలో ఆసుపత్రులకు తీసుకురావడంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ నియంత్రణకు ఉపయోగించే వైద్య పరికరాలు సరిగా స్టెరిలైజేషన్ చేయకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపడుతున్నారు.
కాగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 30 మందిలో 10 మందిని శుక్రవారం డిశ్చార్జి చేయాలని భావిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. విడతల వారీగా బాధితులను డిశ్చార్జి చేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం బాధితులంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టంచేశారు.
ఇన్ఫెక్షన్ కారణంగానే మృతి
ఇబ్రహీంపట్నంలో మృతి చెందిన నలుగురి పోస్ట్‌మార్టం వివరాలను వైద్య వర్గాలు వెల్లడించాయి. వారి రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని తెలిపాయి. ఇతరత్రా అవయవాలపై ఎలాంటి ప్రభావం కనిపించలేదని స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ కారణంగానే వారు మరణించినట్లు భావిస్తున్నామన్నాయి. కాగా, డబుల్ పంక్చర్ లాప్రోస్కోపీ (డీపీఎల్) పద్ధతిలో క్యాంపుల ద్వారా జరిగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఒక్కో రోజు 10–15 మంది కంటే ఎక్కువగా కు.ని. ఆపరేషన్లు చేయకూడదని నిర్ణయించినట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ తెలిపారు.
ఇతర విధానాల్లో కు.ని. సర్జరీలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు గురువారం జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఘటన నేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడైనా వికటించే సంఘటనలు జరిగితే జిల్లా వైద్యాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment