- పొంచిఉన్న మలేరియా, డయేరియా, అంటువ్యాధులు
- కాచిచల్లార్చిన నీటిని తాగాలి.. పరిశుభ్రత పాటించాలి
- పాలెం క్లస్టర్ ఎస్పీహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్‌రావు
జరభద్రం.. వ్యాధులకాలం
Published Wed, Aug 10 2016 6:42 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
బిజినేపల్లి: నిత్యం కురుస్తున్న ముసురు వర్షాలు.. పారిశుద్ధ్యం లోపంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. కొన్ని రోజులుగా ఆస్పత్రులకు వచ్చే బయటి రోగుల సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో కలుషిత నీరు,దోమలు, ఈగల కారణంగా ఎక్కువ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అతిసారం, టైపాయిడ్, చికెన్‌గున్యా, డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు సులువుగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిసరాలు ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలని పాలెం క్లస్టర్ ఎస్పీహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్‌రావు సూచిస్తున్నారు.
కలుషిత నీరు, ఆహార పదార్థాలతో అతిసార
వర్షాకాలంలో ఆహార పదార్థాలు తాగునీటి కాలుష్యం కారణంగా అతిసార వ్యాధి సంక్రమిస్తుంది. కలుషిత ఆహార పదార్థాలు తీసుకోవడం, సగం ఉడికించిన మాంసాహారం తీసుకోవడం, వీధుల్లో అపరిశుభ్ర వాతావరణంలో విక్రయించే తినుబండారాలు తీసుకోవడం వల్ల వ్యాధిబారిన పడే అవకాశం ఉంది. వ్యాధి సోకిన వారికి విపరీతంగా వాంతులు, విరేచనాలు అయి శరీరంలో నీటి శాతం పడిపోతుంది. నివారణగా శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండ ఉండేందుకు ఉప్పు, చక్కర, నిమ్మరసం కలిసిన నీటిని తీసుకోవాలి. సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
ఈగలతో టైఫాయిడ్, కలరా..
ఇండ్ల చుట్టు అపరిశుభ్ర వాతావరణం కారణంగా వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి సాల్మానెల్లాటైపి అనే బ్యాక్టీరియాకు వాహకాలుగా ఉండటం వల్ల విషజ్వరాలు వస్తాయి. టైఫాయిడ్ బారిన పడిన వారు తరచు జ్వరంతో బాధపడుతుంటారు. రోజుల తరబడి జ్వరం వదలకుండా ఉంటే రోగ నిర్ధారణకు రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాధి బారిన పడకుండా ముందస్తుగా టీకాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి ప్రబలకుండ ఉండాలంటే వీధులను ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహార పదార్థాలపై మూత కప్పి ఉంచాలి.
దోమలతో మలేరియా, చికెన్‌గున్యా, డెంగ్యూ
దోమ కాటు వల్ల మలేరియా, చికెన్‌గున్యా వ్యాధులు సంక్రమిస్తాయి. ఆడ ఎనాపిలస్ దోమ కాటు వల్ల మలేరియా వస్తుంది. తరచు జ్వరం, తలనొప్పి, శరీరం వణుకు పట్టడం, చలిజ్వరం వ్యాధి లక్షణాలు. కీళ్ల నొప్పులు, తీవ్రమైన జ్వరం వేధిస్తున్నట్లయితే చికెన్‌గున్యా వ్యాధికి గురైనట్లు సంకేతం. పగటి వేళల్లో సంచరించే ఎడిస్ ఇజిప్టె అనే దోమల వల్ల డెంగ్యూ వ్యాపిస్తుంది. ఈ దోమలు మోచేతుల కింద, మోకాళ్లపై కుడుతుంటాయి. ఈ వ్యాధికి గురైన వారు జ్వరంతో బాధపడటమే కాకుండా శరీరంపై దద్దుర్లు రావడం, తెల్లరక్త కణాలు తగ్గిపోవడం సంభవిస్తుంది.
పారిశుద్ధ్య లేమితో హెపటైటీస్
ఈ సీజన్‌లో హెపటైటీస్ వ్యాధి సైతం ఎక్కువగా వేధిస్తుంది. పారిశుద్ధ్యం లోపించడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి బారిన పడ్డవారి కాలేయాన్ని దెబ్బతీసి పచ్చకామెర్లను కలిగిస్తుంది. కాళ్లు, చర్మం పచ్చబడటం, మూత్రం పసుపు రంగులో రావడం వ్యాధి లక్షణాలు, వ్యాధి నివారణ కోసం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి.
వ్యాధులు సోకకుండ తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పారిశుద్ధ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇండ్ల మధ్య నీరు నిల్వ ఉండకుండా చూడాలి. సగం ఉడికించిన మాంసాహారాన్ని భుజించవద్దు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండ పాటించాలి. మలమూత్ర విసర్జనకు వెళ్లి వచ్చినప్పుడు చేతులు కాళ్లు కడుకోవాలి. కూరగాయలను బాగా ఉడికించి వండాలి. ఆహార పదార్థాలను నిల్వ ఉంచి తినేకంటే ఎప్పటికప్పుడు వండుకొని తినాలి. దోమలు కుట్టకుండా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి. ఈగలు, దోమల నివారణ చర్యలు చేపట్టాలి.
Advertisement
Advertisement