dayeria
-
జరభద్రం.. వ్యాధులకాలం
పొంచిఉన్న మలేరియా, డయేరియా, అంటువ్యాధులు కాచిచల్లార్చిన నీటిని తాగాలి.. పరిశుభ్రత పాటించాలి పాలెం క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్‌రావు బిజినేపల్లి: నిత్యం కురుస్తున్న ముసురు వర్షాలు.. పారిశుద్ధ్యం లోపంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. కొన్ని రోజులుగా ఆస్పత్రులకు వచ్చే బయటి రోగుల సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో కలుషిత నీరు,దోమలు, ఈగల కారణంగా ఎక్కువ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అతిసారం, టైపాయిడ్, చికెన్‌గున్యా, డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు సులువుగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిసరాలు ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలని పాలెం క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్‌రావు సూచిస్తున్నారు. కలుషిత నీరు, ఆహార పదార్థాలతో అతిసార వర్షాకాలంలో ఆహార పదార్థాలు తాగునీటి కాలుష్యం కారణంగా అతిసార వ్యాధి సంక్రమిస్తుంది. కలుషిత ఆహార పదార్థాలు తీసుకోవడం, సగం ఉడికించిన మాంసాహారం తీసుకోవడం, వీధుల్లో అపరిశుభ్ర వాతావరణంలో విక్రయించే తినుబండారాలు తీసుకోవడం వల్ల వ్యాధిబారిన పడే అవకాశం ఉంది. వ్యాధి సోకిన వారికి విపరీతంగా వాంతులు, విరేచనాలు అయి శరీరంలో నీటి శాతం పడిపోతుంది. నివారణగా శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండ ఉండేందుకు ఉప్పు, చక్కర, నిమ్మరసం కలిసిన నీటిని తీసుకోవాలి. సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఈగలతో టైఫాయిడ్, కలరా.. ఇండ్ల చుట్టు అపరిశుభ్ర వాతావరణం కారణంగా వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి సాల్మానెల్లాటైపి అనే బ్యాక్టీరియాకు వాహకాలుగా ఉండటం వల్ల విషజ్వరాలు వస్తాయి. టైఫాయిడ్ బారిన పడిన వారు తరచు జ్వరంతో బాధపడుతుంటారు. రోజుల తరబడి జ్వరం వదలకుండా ఉంటే రోగ నిర్ధారణకు రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాధి బారిన పడకుండా ముందస్తుగా టీకాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి ప్రబలకుండ ఉండాలంటే వీధులను ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహార పదార్థాలపై మూత కప్పి ఉంచాలి. దోమలతో మలేరియా, చికెన్‌గున్యా, డెంగ్యూ దోమ కాటు వల్ల మలేరియా, చికెన్‌గున్యా వ్యాధులు సంక్రమిస్తాయి. ఆడ ఎనాపిలస్ దోమ కాటు వల్ల మలేరియా వస్తుంది. తరచు జ్వరం, తలనొప్పి, శరీరం వణుకు పట్టడం, చలిజ్వరం వ్యాధి లక్షణాలు. కీళ్ల నొప్పులు, తీవ్రమైన జ్వరం వేధిస్తున్నట్లయితే చికెన్‌గున్యా వ్యాధికి గురైనట్లు సంకేతం. పగటి వేళల్లో సంచరించే ఎడిస్ ఇజిప్టె అనే దోమల వల్ల డెంగ్యూ వ్యాపిస్తుంది. ఈ దోమలు మోచేతుల కింద, మోకాళ్లపై కుడుతుంటాయి. ఈ వ్యాధికి గురైన వారు జ్వరంతో బాధపడటమే కాకుండా శరీరంపై దద్దుర్లు రావడం, తెల్లరక్త కణాలు తగ్గిపోవడం సంభవిస్తుంది. పారిశుద్ధ్య లేమితో హెపటైటీస్ ఈ సీజన్లో హెపటైటీస్ వ్యాధి సైతం ఎక్కువగా వేధిస్తుంది. పారిశుద్ధ్యం లోపించడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి బారిన పడ్డవారి కాలేయాన్ని దెబ్బతీసి పచ్చకామెర్లను కలిగిస్తుంది. కాళ్లు, చర్మం పచ్చబడటం, మూత్రం పసుపు రంగులో రావడం వ్యాధి లక్షణాలు, వ్యాధి నివారణ కోసం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి. వ్యాధులు సోకకుండ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పారిశుద్ధ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇండ్ల మధ్య నీరు నిల్వ ఉండకుండా చూడాలి. సగం ఉడికించిన మాంసాహారాన్ని భుజించవద్దు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండ పాటించాలి. మలమూత్ర విసర్జనకు వెళ్లి వచ్చినప్పుడు చేతులు కాళ్లు కడుకోవాలి. కూరగాయలను బాగా ఉడికించి వండాలి. ఆహార పదార్థాలను నిల్వ ఉంచి తినేకంటే ఎప్పటికప్పుడు వండుకొని తినాలి. దోమలు కుట్టకుండా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి. ఈగలు, దోమల నివారణ చర్యలు చేపట్టాలి. -
డయేరియాతో ముగ్గురి మృతి
మేడిగూడలో విషాదం పడగ విప్పిన డయేరియా ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో కలకలం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల ఆందోళన ఆర్డీవో హామీతో మృతదేహాలు అంత్యక్రియలకు తరలింపు నార్నూర్ : నిరుపేద కుటుంబంపై డయేరియా పంజా విసిరింది. ఏకంగా ముగ్గురిని బలిగొంది. దీంతో నార్నూర్ మండలంలోని మేడిగూడలో తీరని విషాదం అలుముకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర భయాందోళన రేపింది. నార్నూర్ మండలంలోని మేడిగూడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన మానే కౌలాబాయి(60), మానే నాగ్నాథ్(28), నాగ్నాథ్ కుమారుడు మానే సందీప్(5) డయేరియాతో మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబంలో ముగ్గరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి ఆసరాగా ఉన్న పెద్ద దిక్కును కోల్పోవడంతో మృతుడి భార్య రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. భారీ వర్షం కారణంగా గాదిగూడ వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పండిదని, దీంతో వాగు దాటలేక సకాలంలో వైద్యం అందక ముగ్గురు మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. గాదిగూడ పీహెచ్సీలో వైద్య సిబ్బంది లేక గ్రామాలకు ఏఎన్ఎంలు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామంలో శానిటేషన్, క్లోరినేషన్ చేపట్టలేదన్నారు. ముగ్గురు మృతిచెందిన తర్వాత అధికారులు వచ్చి హడావుడి చేస్తున్నారని, ఇప్పుడు వచ్చి బ్లీచింగ్ పౌడర్ చల్లడం ఎందుకని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల ఆందోళన మృతుల కుటుంబాన్ని ఆదుకోవాలని, ఐటీడీఏ పీవో, కలెక్టర్ వచ్చే వరకు మృతదేహాలను తరలించమని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మేడిగూడ గ్రామానికి ఆర్డీవో ఐలయ్య సందర్శించి గ్రామంలో డయేరియా విజృభించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో శానిటేషన్, క్లోరినేషన్ సక్రమంగా లేకపోవడంతోనే వ్యాధులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తుల వద్దకు చేరుకుని వారితో మాట్లాడారు. మృతుల కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. మృతుల కుటుంబానికి తక్షణమే రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని డిప్యూటీ తహసీల్దార్ సోము ఆదేశించారు. ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి కలెక్టర్‌కు నివేదిస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించి మృతదేహాలను అంత్యక్రియలకు తరలించారు. పరిస్థితి అదుపులోనే ఉంది మేడిగూడలో డయేరియాతో ముగ్గరు మృతి చెందిన విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి జలపత్‌నాయక్ గ్రామాన్ని సందర్శించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వైద్య శిబిరం నిర్వహించాలని ఎస్పీహెచ్వో ఫల్గునకూమార్ను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
డయేరియాతో గిరిజన మహిళ మృతి
ఇచ్చోడ : మండలంలోని చించోలి గ్రామానికి చెందిన గిరిజన మహిళ రానుబాయి(26) డయేరియాతో మంగళవారం రాత్రి మతిచెందింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రానుబాయి మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విరేచనాలతో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను 11 గంటల ప్రాంతంలో ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ వైద్యం అందించారు. సాయంత్రం వరకు బాగానే ఉన్న ఆమె కు తిరిగి 6 గంటల ప్రాంతంలో వాంతులు, విరేచనాలు తీవ్రంగా బాధపడింది. దీంతో డాక్టర్ సర్పరాజ్ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే 108 అంబులెన్స్ వచ్చేలోపే రాత్రి 7.30 గంటల ప్రాంతంలో రానుబాయి మతి చెందింది. కాగా, డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే రానుబాయి మహిళ మతిచెందినట్లు బంధువులు ఆరోపించారు. డాక్టర్ సర్పరాజ్‌ను వివరణ కోరగా.. తము సరైన వైద్యం అందించామని తెలిపారు.