డయేరియాతో ముగ్గురి మృతి
-
మేడిగూడలో విషాదం
-
పడగ విప్పిన డయేరియా
-
ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో కలకలం
-
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల ఆందోళన
-
ఆర్డీవో హామీతో మృతదేహాలు అంత్యక్రియలకు తరలింపు
నార్నూర్ : నిరుపేద కుటుంబంపై డయేరియా పంజా విసిరింది. ఏకంగా ముగ్గురిని బలిగొంది. దీంతో నార్నూర్ మండలంలోని మేడిగూడలో తీరని విషాదం అలుముకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర భయాందోళన రేపింది. నార్నూర్ మండలంలోని మేడిగూడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన మానే కౌలాబాయి(60), మానే నాగ్‌నాథ్(28), నాగ్‌నాథ్ కుమారుడు మానే సందీప్(5) డయేరియాతో మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబంలో ముగ్గరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి ఆసరాగా ఉన్న పెద్ద దిక్కును కోల్పోవడంతో మృతుడి భార్య రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. భారీ వర్షం కారణంగా గాదిగూడ వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పండిదని, దీంతో వాగు దాటలేక సకాలంలో వైద్యం అందక ముగ్గురు మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. గాదిగూడ పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది లేక గ్రామాలకు ఏఎన్‌ఎంలు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామంలో శానిటేషన్, క్లోరినేషన్ చేపట్టలేదన్నారు. ముగ్గురు మృతిచెందిన తర్వాత అధికారులు వచ్చి హడావుడి చేస్తున్నారని, ఇప్పుడు వచ్చి బ్లీచింగ్ పౌడర్ చల్లడం ఎందుకని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తుల ఆందోళన
మృతుల కుటుంబాన్ని ఆదుకోవాలని, ఐటీడీఏ పీవో, కలెక్టర్ వచ్చే వరకు మృతదేహాలను తరలించమని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మేడిగూడ గ్రామానికి ఆర్డీవో ఐలయ్య సందర్శించి గ్రామంలో డయేరియా విజృభించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో శానిటేషన్, క్లోరినేషన్ సక్రమంగా లేకపోవడంతోనే వ్యాధులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తుల వద్దకు చేరుకుని వారితో మాట్లాడారు. మృతుల కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. మృతుల కుటుంబానికి తక్షణమే రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని డిప్యూటీ తహసీల్దార్ సోము ఆదేశించారు. ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి కలెక్టర్‌కు నివేదిస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించి మృతదేహాలను అంత్యక్రియలకు తరలించారు.
పరిస్థితి అదుపులోనే ఉంది
మేడిగూడలో డయేరియాతో ముగ్గరు మృతి చెందిన విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి జలపత్‌నాయక్ గ్రామాన్ని సందర్శించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వైద్య శిబిరం నిర్వహించాలని ఎస్‌పీహెచ్‌వో ఫల్గునకూమార్‌ను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.