సాక్షి, హైదరాబాద్: ప్రజలకు పంపిణీ చేసే ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) విషయంలో ఎఫ్‌సీఐ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రంలోని మిల్లర్లు మండిపడుతున్నారు. ఇటీవల 290 మిల్లుల నుంచి ఎఫ్‌సీఐకి పంపిన సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని (సీఎంఆర్) నాణ్యత సరిగా లేదంటూ ఎఫ్‌సీఐ తిరస్కరించడంంతో పాటు మిల్లుల నుంచి 2022–23కు సంబంధించిన సీఎంఆర్‌ను తీసుకునేందుకు కూడా నిరాకరించింది. దీంతో మిల్లింగ్ అయిన బియ్యం మిల్లుల్లోనే ఉండిపోతోంది.
గత సంవత్సరం వానకాలం, యాసంగి ధాన్యం ఇప్పటికే కోటి టన్నులకు పైగా మిల్లుల్లో నిల్వ ఉండగా, మర పట్టించిన మేరకు బియ్యాన్ని కూడా ఎఫ్‌సీఐ తీసుకోవడం లేదని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మిల్లర్ల సంఘం నాయకులు సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌తో భేటీ అయ్యారు.
ఎఫ్‌సీఐ ఘర్షణాత్మక వైఖరి: రాష్ట్రంలోని సుమారు 3 వేల మిల్లులు ధాన్యం, బియ్యంతో నిండిపోయి ఉన్నాయని, ధాన్యం నిల్వకు గోదాములు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రికి మిల్లర్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో మిల్లర్లు పంపించిన బియ్యాన్ని నిరాకరిస్తూ, దాదాపు 290 మిల్లుల్ని బ్లాక్ లిస్టులో పెట్టి ఎఫ్‌సీఐ ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ నాఫెడ్ సరఫరా చేసిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్‌ఆర్‌కే) నాణ్యత సరిగా లేదంటూ ఎఫ్‌సీఐ బియ్యాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో రైస్ మిల్లింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు. ఎఫ్‌సీఐ ఇలాగే వ్యవహరిస్తే సీఎంఆర్ నుంచి పూర్తిగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఎఫ్‌సీఐ గోదాములు సమకూర్చకపోవడం వల్ల సకాలంలో సీఎంఆర్ చేయలేకపోతున్నట్లు తెలిపారు.
కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో..
గత వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు రైస్ మిల్లుల వద్ద పేరుకుపోయాయని మిల్లర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. కోటీ పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయాల్సి ఉండగా, అందులో గత వానాకాలంలో తడిసిన ధాన్యం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ధాన్యం పాడయ్యే ప్రమాదం ఉందని, అప్పుడు సీఎంఆర్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.
వానాకాలం ధాన్యం తడిసిపోయిన నేపథ్యంలో ఈ సీజన్‌కు సంబంధించిన 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ చేసేందుకు ఆదేశాలివ్వాలని కోరారు. లేని పక్షంలో తమ దగ్గర ఉన్న ధాన్యాన్ని వెనక్కితీసుకోవాలని అన్నారు. ఎఫ్‌సీఐ కఠిన వైఖరి నేపథ్యంలో డిఫాల్ట్ పెట్టబోమని హామీ ఇస్తే ప్రభుత్వ ధాన్యానికి కస్టోడియన్‌గా ఉంటామని స్పష్టం చేశారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి గంగుల
మిల్లర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మద్దతు ధరతో ధాన్యం కొను గోలుకు సీఎం ఆదేశాలిచ్చారని, కేంద్రం కూడా దేశంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకోకూడదని సూచించారు. తక్షణ మే ఎఫ్‌సీఐ స్టోరేజీ సౌకర్యం కల్పిస్తే నెలకు పదిలక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కాగా అప్పటికప్పుడు ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. వీలైనంత త్వరగా స్టోరేజీని పెంచి బియ్యం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంపా నాగేందర్, జనరల్ సెక్రటరీలు వి.మోహన్ రెడ్డి, ఎ.సుధాకర్ రావ్, ట్రెజరర్ చంద్రపాల్, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, మిల్లర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment