
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ముడి మరకతం (ఎమరాల్డ్) ఆఫ్రికాలోని జాంబియా దేశంలో బయటపడింది. జాంబియాలోని కాగెం గనిలో మానస్ బెనర్జీ, రిచర్డ్ కెప్టా నేతృత్వంలోని బృందం చేపట్టిన తవ్వకాల్లో ఇది లభ్యమైంది. దీని బరువు ఏకంగా 7,525 క్యారట్లు (1.505 కేజీలు) కావడం విశేషం. ఇంత భారీ మరకతం కావడంతో ఇది అతిపెద్ద మరకతంగా గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టింది.
ఈ మరకతం పైభాగాన ఉబ్బెత్తుగా ఉండటంతో దీనికి ‘చిపెంబెలె’ (జాంబియాలోని బెంబా ప్రజల భాషలో ఖడ్గమృగం అని అర్థం) అని పేరు పెట్టారు. గతంలోనూ ఇదే గనిలో కొన్ని భారీ మరకతాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. 2010లో 6,225 క్యారట్ల (1.245 కేజీలు) బరువుగల మరకతం (ఇన్‌సోఫు – అంటే ఏనుగు అని అర్థం) లభ్యమవగా 2018లో 5,655 క్యారట్ల (1.131 కేజీలు) బరువుగల మరో మరకతం (ఇన్‌కాలమమ్ – అంటే సింహం అని అర్థం) దొరికింది.