కేజీ టు పీజీలో మూడంచెల వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
- ప్రాథమికస్థాయిలో తెలుగు మాధ్యమం
- 5-12వ తరగతి వరకు నివాస వసతితో ఆంగ్లమాధ్యమం
- మంత్రి సమీక్ష.. వచ్చే సమావేశంలో తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీలో మూడంచెల విద్యా వ్యవస్థ ఉంటే బాగుంటుందన్న అవగాహనకు తెలంగాణ ప్రభుత్వం వస్తోంది. కిండర్ గార్టెన్(కేజీ) నుంచి 4వ తరగతి వరకు, 5 నుంచి 12వ తరగతి వరకు, డిగ్రీ నుంచి పీజీ వరకు మూడు ప్రధాన వ్యవస్థలుగా కొనసాగించాలని ఆలోచి స్తోంది. మంగళవారం ఉపముఖ్యమంత్రి కడి యం శ్రీహరి సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో విద్యావేత్తలు, ఉన్నతాధికారులు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాన్ని తీసుకొని అవసరమైన మార్పులతో కాన్సెప్ట్ పేపర్‌ను ప్రకటిస్తారు. దీని పై చివరగా విద్యావేత్తలకు, ఉపాధ్యాయ సంఘాలకు, తల్లిదండ్రులకు అందుబాటులోకి తీసుకెళ్లి కేజీ టు పీజీకి తుది రూపును తీసుకురానున్నారు.
సెమీ రెసిడెన్షియల్‌తో ప్రాథమిక విద్య: ప్రాథమిక స్థాయిలో తెలుగు మీడియంతోపాటు ఆంగ్లాన్ని కొనసాగించాలంటూ వ్యక్తమైన భిన్నాభిప్రాయాలపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. అయితే ప్రాథమిక స్థాయిలో మాతృభాషను కచ్చితంగా కొనసాగించాలన్న అభిప్రాయం మంగళవారం జరిగిన సమావేశంలో వ్యక్తమైంది. మరోవైపు ప్రాథమికస్థాయి విద్యార్థులకు పూర్తి నివాస సదుపాయం సాధ్యంకాదని, దానికి బదులు సెమీ రెసిడెన్షియల్ వ్యవ స్థను కొనసాగించాలని భావిస్తోం ది. ఇందులో భాగంగా ఉదయం 9గంటలకు పాఠశాలకు వచ్చే ప్రాథమిక స్థాయి (కేజీ టు 4వ తరగతి వరకు) విద్యార్థులకు ఉదయం టిఫిన్, పాలు, మధ్యాహ్నం, సాయంత్రం టిఫిన్, పాలు వంటి సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది.
రాత్రి మాత్రమే ఇంట్లో భోజనం చేసేలా దీనికి రూపకల్పన చేయాలని భావిస్తోంది. ఇక 5 నుంచి 12వ తరగతి వరకు నివాసవసతితో (రెసిడెన్షియల్) కూడిన ఆంగ్ల మాధ్యమం విద్యను అందించాలని ప్రాథమికంగా అవగాహనకు వచ్చింది. డిగ్రీ నుంచి పీజీ వరకు ఉన్న విద్యావ్యవస్థను యథాతధంగా కొనసాగించే అవకాశం ఉంది. డిగ్రీ, పీజీ స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం కొనసాగించాలని భావిస్తోంది. కేజీ టు పీజీ క్యాంపస్‌లలోనూ పీజీ వరకు విద్యా వ్యవస్థ ఉండాలన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. పైగా డిగ్రీ, పీజీలో రెసిడెన్షియల్ వ్యవస్థ ఉండాలా? నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో కొనసాగించాలా? అన్న అంశాలపై చర్చిస్తోంది. వీటిపై సీఎం వద్ద జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.