* సర్కారీ స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ
* ‘కేజీ టు పీజీ’ అమలు దిశగా టీ సర్కార్ చర్యలు
* ప్రీ ప్రైమరీలో చేరేందుకు కనీస వయసు మూడేళ్లకు తగ్గింపు
* అంగన్‌వాడీ కేంద్రాలూ విద్యా శాఖ పరిధిలోకే
* విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పాఠశాలల మదింపు
* దసరా సెలవుల్లోగా ఏకీకృత రూల్స్, హేతుబద్ధీకరణ, బదిలీలు
* ప్రైవేట్ స్కూళ్ల పనితీరు, ఫీజులపైనా పర్యవేక్షణ
* ఉన్నతాధికారులతో సమీక్షలో విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం విద్యా రంగం ప్రక్షాళనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించే ఉద్దేశంతో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ (ప్రీ ప్రైమరీ)లో ప్రవేశాలకు వీలుగా విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తోంది. ప్రీ ప్రైమరీకి అనుగుణంగా సర్కారీ స్కూళ్లలో చేరే విద్యార్థుల కనీస వయసును ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని తాజాగా నిర్ణయించింది.
అలాగే నర్సరీ తరగతుల కోసం అంగన్‌వాడీ కేంద్రాలను విద్యా శాఖ పరిధిలోకి తీసుకురావాలని, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని కస్తూర్బా బాలికా విద్యాలయాలన్నింటినీ రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చాలని నిర్ణయించింది. ‘కేజీ టు పీజీ’ అమలులో ఈ నిర్ణయాలే తొలి అడుగులు కానున్నాయి. విద్యా రంగంలో సంస్కరణలపై ఆ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో ఎస్‌సీఈఆర్‌టీ, పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్, కమిషనర్, గురుకుల విద్యా సంస్థల డెరైక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఏకీకృత రూల్స్.. ఉపాధ్యాయులకు శిక్షణ
రాష్ట్ర విభజన చట్టంలో కల్పించిన వెసులుబాటుతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్వీస్ నిబంధనలను అమలు చేయాలని సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీచర్లకు ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేసే దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ నిబంధనలను దసరా లోగా అమలు చేయాలని, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీలను కూడా దసరా సెలవుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉన్నత పాఠశాలల్లోని టీచర్లు, హెచ్.ఎంలకు దసరా సెలవుల తర్వాత శిక్షణ ఇప్పించాలని, కొత్త పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధకులకు హ్యాండ్‌బుక్‌లు అందించాలని మంత్రి ఆదేశించారు. పాఠ్య పుస్తకాల పంపిణీకి చర్యలతో పాటు శిక్షణకు సమగ్ర కేలండర్‌ను రూపొందించాలని ఆదేశించారు.
స్కూళ్లలో తనిఖీలు, ప్రమాణాల పెంపు
ప్రతి ప్రభుత్వ పాఠశాల పనితీరునూ అంచనా వేయాలని మంత్రి నిర్ణయించారు.స్కూళ్లవారీగా విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు టీచర్ల పనితీరును అంచనా వేసే బాధ్యతను ప్రత్యేక ఏజెన్సీకి అప్పగించనున్నారు.కొత్త పాఠ్యాంశాల అమలు, పరీక్షల సంస్కరణలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రైవేట్ స్కూళ్ల సమాచారం,వాటి పనితీరును,ఫీజుల వసూలును కూడా పరిశీలించాలని మంత్రి నిర్దేశించారు.ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ప్రక్రియను ఈ నెల 20లోగా పూర్తి చేయాలన్నారు.ఇకపై అదనపు సంచాలకులు, సీనియర్ అధికారులతో కూడిన బృందాలతో పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. నివేదికలను కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి పంపించాలని మంత్రి సూచించారు.వారు నెలలో మూడు నాలుగు రోజులపాటు పాఠశాలలను తనిఖీ చేసి... జిల్లా, మండల స్థాయి విద్యాధికారులతో సమీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. అలాగే అన్ని పాఠశాలల్లో ఆటలు, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని, ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి పేర్కొన్నారు.
మూడేళ్లకే బడి
Published Thu, Sep 11 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement
Advertisement