
ఇక 'హంగుల'వాడీలు
► ప్రీస్కూల్స్‌గా మారనున్న పట్టణ అంగన్‌వాడీ కేంద్రాలు
► నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యాబోధన
► ప్రత్యేక సిలబస్, ఇంగ్లిష్ బోధన, యూనిఫామ్ పంపిణీ
జంగారెడ్డిగూడెం : పట్టణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై కార్పొరేట్ పాఠశాలలను తలపించనున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని 9 మున్సిపాలిటీల పరిధిలో గల అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కార్పొరేట్ విద్య అందనుంది. పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల సంఖ్యను కుదించి దగ్గరగా ఉన్న కేంద్రాలను ఒక ప్రీస్కూల్‌గా రూపొందించి చిన్నారులకు విద్యను అందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్పొరేట్ పాఠశాలల తరహాలో చిన్నారులకు అత్యుత్తమ విద్యను అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది.
ప్రైవేట్‌కు దీటుగా..
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రీ స్కూల్స్ రూపొందనున్నాయి. వీటిలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తారు. కార్పొరేట్ తరహాలో సూక్ష్మ ప్రణాళిక పద్ధతిలో చిన్నారులకు విద్యాబోధన చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించారు. చిన్నారు ప్రీస్కూల్‌కు రాగానే అసెంబ్లీ నిర్వహించి.. అనంతరం విద్యాబోధన ప్రారంభిస్తారు. రోజువారీ ప్రణాళికలో భాగంగా అక్షరాలు ఏవిధంగా రాయా లి, ఏవిధంగా చదవాలి, తెలుగు పద్యాలు, గేయాలు పలక మీద రాయడం వంటివి చిన్నారులకు నేర్పిస్తారు. ఇం గ్లిష్ అక్షరాలను కూడా నర్సరీ స్థాయి నుంచే బోధిస్తారు. ఇంగ్లిష్ పదాలు, గేయాలు నేర్పుతారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు ప్రీ స్కూల్‌లో ప్రత్యేక సిలబస్ రూపొందించారు. ఇందులో తెలుగుతోపాటు గణితం, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ కూడా బోధిస్తారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను బట్టి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి.
ఐసీడీఎస్ ఆధ్వర్యంలోనే..
అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్న సమగ్ర శిశు అభివృద్ధి సంస్థ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలోనే ప్రీస్కూల్స్ నడుస్తాయి. జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో మొత్తం 381 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏలూరులో 110, కొవ్వూరులో 55, పాలకొల్లులో 25, తణుకులో 36, నిడదవోలులో 16, భీమవరంలో 31, జంగారెడ్డిగూడెంలో 28, తాడేపల్లిగూడెంలో 60, నరసాపురంలో 20 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. పట్టణం యూనిట్‌గా సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాలను కలిపి ప్రీస్కూల్ ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు జంగారెడ్డిగూడెంలో మొత్తం 28 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. వాటిని 19 ప్రీ స్కూల్స్‌గా మారుస్తున్నారు. వీటికోసం త్వరలో భవనాలు నిర్మిస్తారు. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లోనే విద్యాబోధన చేస్తారు.
ఆకర్షణీయంగా..
ప్రీస్కూల్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. పాఠశాల భవనం వెలుపల భాగంతోపాటు లోపలి గదుల్లోనూ చిన్నారులను ఆకట్టుకునేలా చిత్రాలు ఉంటాయి. బ్లాక్‌బోర్డు చుట్టూ గోడలపై చిన్నారులకు బోధించే విధంగా పలు చిత్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రీస్కూల్‌లో చదువుకునే చిన్నారులకు ప్రత్యేకంగా యూనిఫామ్ కూడా ఉచితంగా అందిస్తారు. బాలికలకు, బాలురకు వేర్వేరుగా యూనిఫామ్ అందజేస్తారు.
కార్యకర్తలకు శిక్షణ
ప్రీస్కూల్స్ నిర్వహణపై అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో శిక్షణ పూర్తికాగా.. మిగిలిన పట్టాణాల్లో వరుసగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లాకు టి.హరితను కన్సల్టెంట్‌గా నియమించారు.