UKG
-
ఇక 'హంగుల'వాడీలు
► ప్రీస్కూల్స్‌గా మారనున్న పట్టణ అంగన్వాడీ కేంద్రాలు ► నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యాబోధన ► ప్రత్యేక సిలబస్, ఇంగ్లిష్ బోధన, యూనిఫామ్ పంపిణీ జంగారెడ్డిగూడెం : పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలు ఇకపై కార్పొరేట్ పాఠశాలలను తలపించనున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని 9 మున్సిపాలిటీల పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కార్పొరేట్ విద్య అందనుంది. పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కేంద్రాల సంఖ్యను కుదించి దగ్గరగా ఉన్న కేంద్రాలను ఒక ప్రీస్కూల్‌గా రూపొందించి చిన్నారులకు విద్యను అందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్పొరేట్ పాఠశాలల తరహాలో చిన్నారులకు అత్యుత్తమ విద్యను అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రైవేట్‌కు దీటుగా.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రీ స్కూల్స్ రూపొందనున్నాయి. వీటిలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తారు. కార్పొరేట్ తరహాలో సూక్ష్మ ప్రణాళిక పద్ధతిలో చిన్నారులకు విద్యాబోధన చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించారు. చిన్నారు ప్రీస్కూల్‌కు రాగానే అసెంబ్లీ నిర్వహించి.. అనంతరం విద్యాబోధన ప్రారంభిస్తారు. రోజువారీ ప్రణాళికలో భాగంగా అక్షరాలు ఏవిధంగా రాయా లి, ఏవిధంగా చదవాలి, తెలుగు పద్యాలు, గేయాలు పలక మీద రాయడం వంటివి చిన్నారులకు నేర్పిస్తారు. ఇం గ్లిష్ అక్షరాలను కూడా నర్సరీ స్థాయి నుంచే బోధిస్తారు. ఇంగ్లిష్ పదాలు, గేయాలు నేర్పుతారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు ప్రీ స్కూల్లో ప్రత్యేక సిలబస్ రూపొందించారు. ఇందులో తెలుగుతోపాటు గణితం, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ కూడా బోధిస్తారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను బట్టి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలోనే.. అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్న సమగ్ర శిశు అభివృద్ధి సంస్థ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలోనే ప్రీస్కూల్స్ నడుస్తాయి. జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో మొత్తం 381 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏలూరులో 110, కొవ్వూరులో 55, పాలకొల్లులో 25, తణుకులో 36, నిడదవోలులో 16, భీమవరంలో 31, జంగారెడ్డిగూడెంలో 28, తాడేపల్లిగూడెంలో 60, నరసాపురంలో 20 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. పట్టణం యూనిట్‌గా సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలను కలిపి ప్రీస్కూల్ ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు జంగారెడ్డిగూడెంలో మొత్తం 28 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. వాటిని 19 ప్రీ స్కూల్స్‌గా మారుస్తున్నారు. వీటికోసం త్వరలో భవనాలు నిర్మిస్తారు. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యాబోధన చేస్తారు. ఆకర్షణీయంగా.. ప్రీస్కూల్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. పాఠశాల భవనం వెలుపల భాగంతోపాటు లోపలి గదుల్లోనూ చిన్నారులను ఆకట్టుకునేలా చిత్రాలు ఉంటాయి. బ్లాక్‌బోర్డు చుట్టూ గోడలపై చిన్నారులకు బోధించే విధంగా పలు చిత్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రీస్కూల్లో చదువుకునే చిన్నారులకు ప్రత్యేకంగా యూనిఫామ్ కూడా ఉచితంగా అందిస్తారు. బాలికలకు, బాలురకు వేర్వేరుగా యూనిఫామ్ అందజేస్తారు. కార్యకర్తలకు శిక్షణ ప్రీస్కూల్స్ నిర్వహణపై అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో శిక్షణ పూర్తికాగా.. మిగిలిన పట్టాణాల్లో వరుసగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లాకు టి.హరితను కన్సల్టెంట్‌గా నియమించారు. -
వండర్ కిడ్స్ రికార్డ్
విశాఖపట్నం: వంద ప్రశ్నలు.. ముప్పై మంది చిన్నారులు..పది నిమిషాల 20 సెకన్లల్లో సమాధానాలు చెప్పి రికార్డ్ సృష్టించారు. రెండో తరగతి లెక్కల ప్రశ్నాపత్రం ప్రశ్నలకు యూకేజీ బుడతలు సమాధానాలిచ్చిన తీరు అబ్బురపర్చింది. విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో బుధవారం స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్ధులు ఈ రికార్డ్ సృష్టించారు. ఏయూ ఉపకులపతి జి.ఎస్.ఎన్.రాజు, ఇండియన్ బుక్ ఆఫ్రికార్డ్స్ అధికార ప్రతినిధి భరద్వాజ్, ఏయూ ఆచార్యుల సమక్షంలో వంద ప్రశ్నలకు బదులిచ్చారు. వంద ప్రశ్నలను ఎల్ఈడీ ద్వారా ప్రెజెంటేషన్ చేసి వాటి సమాధాలను యూకేజీ చిన్నారులను అడిగారు. విద్యార్ధులు ఈ రికార్డులో పాల్గొని తడుముకోకుండా టీచర్స్ అడిగి ప్రశ్నలకు వెంటవెంటనే సమాధానాలు చెప్పారు. అనంతరం చిన్నారుల రికార్డును ధ్రువీకరిస్తూ ఇండియన్ బుక్ ఆఫ్రికార్డ్స్ అధికార ప్రతినిధి భరద్వాజ్ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూకేజీ విద్యార్ధులు వంద ప్రశ్నలకు 10 నిమిషాల 20 సెకన్లల్లో సమాదానాలు చెప్పడం అద్భుతమన్నారు. ఇది రికార్డ్‌గా ద్రువీకరించి చిన్నారులకు సర్టిఫికేట్ ప్రదానం చేశామన్నారు. ఏయూ వీసీ జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ సాధన చేసిన పై తరగతుల విద్యార్ధులే వంద ప్రశ్నలు గుర్తుంచుకుని వేగంగా చెప్పడం అసాధ్యమన్నారు. స్కూల్ డైరక్టర్ మళ్ల రామునాయుడు, ఏయూ ఆచార్యులు పి.రంగారావు, బి.మునిస్వామి, మదన్ మోహన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పృద్విరాజ్, స్కూల్ ప్రిన్సిపాల్ మళ్ల వాణిశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్కారీ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ
-
మూడేళ్లకే బడి
* సర్కారీ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ * ‘కేజీ టు పీజీ’ అమలు దిశగా టీ సర్కార్ చర్యలు * ప్రీ ప్రైమరీలో చేరేందుకు కనీస వయసు మూడేళ్లకు తగ్గింపు * అంగన్వాడీ కేంద్రాలూ విద్యా శాఖ పరిధిలోకే * విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పాఠశాలల మదింపు * దసరా సెలవుల్లోగా ఏకీకృత రూల్స్, హేతుబద్ధీకరణ, బదిలీలు * ప్రైవేట్ స్కూళ్ల పనితీరు, ఫీజులపైనా పర్యవేక్షణ * ఉన్నతాధికారులతో సమీక్షలో విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం విద్యా రంగం ప్రక్షాళనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించే ఉద్దేశంతో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ (ప్రీ ప్రైమరీ)లో ప్రవేశాలకు వీలుగా విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తోంది. ప్రీ ప్రైమరీకి అనుగుణంగా సర్కారీ స్కూళ్లలో చేరే విద్యార్థుల కనీస వయసును ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని తాజాగా నిర్ణయించింది. అలాగే నర్సరీ తరగతుల కోసం అంగన్వాడీ కేంద్రాలను విద్యా శాఖ పరిధిలోకి తీసుకురావాలని, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని కస్తూర్బా బాలికా విద్యాలయాలన్నింటినీ రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చాలని నిర్ణయించింది. ‘కేజీ టు పీజీ’ అమలులో ఈ నిర్ణయాలే తొలి అడుగులు కానున్నాయి. విద్యా రంగంలో సంస్కరణలపై ఆ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో ఎస్సీఈఆర్టీ, పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్, కమిషనర్, గురుకుల విద్యా సంస్థల డెరైక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏకీకృత రూల్స్.. ఉపాధ్యాయులకు శిక్షణ రాష్ట్ర విభజన చట్టంలో కల్పించిన వెసులుబాటుతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్వీస్ నిబంధనలను అమలు చేయాలని సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీచర్లకు ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేసే దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ నిబంధనలను దసరా లోగా అమలు చేయాలని, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీలను కూడా దసరా సెలవుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత పాఠశాలల్లోని టీచర్లు, హెచ్.ఎంలకు దసరా సెలవుల తర్వాత శిక్షణ ఇప్పించాలని, కొత్త పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధకులకు హ్యాండ్‌బుక్‌లు అందించాలని మంత్రి ఆదేశించారు. పాఠ్య పుస్తకాల పంపిణీకి చర్యలతో పాటు శిక్షణకు సమగ్ర కేలండర్‌ను రూపొందించాలని ఆదేశించారు. స్కూళ్లలో తనిఖీలు, ప్రమాణాల పెంపు ప్రతి ప్రభుత్వ పాఠశాల పనితీరునూ అంచనా వేయాలని మంత్రి నిర్ణయించారు.స్కూళ్లవారీగా విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు టీచర్ల పనితీరును అంచనా వేసే బాధ్యతను ప్రత్యేక ఏజెన్సీకి అప్పగించనున్నారు.కొత్త పాఠ్యాంశాల అమలు, పరీక్షల సంస్కరణలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రైవేట్ స్కూళ్ల సమాచారం,వాటి పనితీరును,ఫీజుల వసూలును కూడా పరిశీలించాలని మంత్రి నిర్దేశించారు.ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ప్రక్రియను ఈ నెల 20లోగా పూర్తి చేయాలన్నారు.ఇకపై అదనపు సంచాలకులు, సీనియర్ అధికారులతో కూడిన బృందాలతో పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. నివేదికలను కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి పంపించాలని మంత్రి సూచించారు.వారు నెలలో మూడు నాలుగు రోజులపాటు పాఠశాలలను తనిఖీ చేసి... జిల్లా, మండల స్థాయి విద్యాధికారులతో సమీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. అలాగే అన్ని పాఠశాలల్లో ఆటలు, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని, ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి పేర్కొన్నారు.