
వండర్ కిడ్స్ రికార్డ్
విశాఖపట్నం: వంద ప్రశ్నలు.. ముప్పై మంది చిన్నారులు..పది నిమిషాల 20 సెకన్లల్లో సమాధానాలు చెప్పి రికార్డ్ సృష్టించారు. రెండో తరగతి లెక్కల ప్రశ్నాపత్రం ప్రశ్నలకు యూకేజీ బుడతలు సమాధానాలిచ్చిన తీరు అబ్బురపర్చింది. విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో బుధవారం స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్ధులు ఈ రికార్డ్ సృష్టించారు. ఏయూ ఉపకులపతి జి.ఎస్.ఎన్.రాజు, ఇండియన్ బుక్ ఆఫ్‌రికార్డ్స్ అధికార ప్రతినిధి భరద్వాజ్, ఏయూ ఆచార్యుల సమక్షంలో వంద ప్రశ్నలకు బదులిచ్చారు. వంద ప్రశ్నలను ఎల్‌ఈడీ ద్వారా ప్రెజెంటేషన్ చేసి వాటి సమాధాలను యూకేజీ చిన్నారులను అడిగారు. విద్యార్ధులు ఈ రికార్డులో పాల్గొని తడుముకోకుండా టీచర్స్ అడిగి ప్రశ్నలకు వెంటవెంటనే సమాధానాలు చెప్పారు.
అనంతరం చిన్నారుల రికార్డును ధ్రువీకరిస్తూ ఇండియన్ బుక్ ఆఫ్‌రికార్డ్స్ అధికార ప్రతినిధి భరద్వాజ్ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూకేజీ విద్యార్ధులు వంద ప్రశ్నలకు 10 నిమిషాల 20 సెకన్లల్లో సమాదానాలు చెప్పడం అద్భుతమన్నారు. ఇది రికార్డ్‌గా ద్రువీకరించి చిన్నారులకు సర్టిఫికేట్ ప్రదానం చేశామన్నారు. ఏయూ వీసీ జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ సాధన చేసిన పై తరగతుల విద్యార్ధులే వంద ప్రశ్నలు గుర్తుంచుకుని వేగంగా చెప్పడం అసాధ్యమన్నారు. స్కూల్ డైరక్టర్ మళ్ల రామునాయుడు, ఏయూ ఆచార్యులు పి.రంగారావు, బి.మునిస్వామి, మదన్ మోహన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పృద్విరాజ్, స్కూల్ ప్రిన్సిపాల్ మళ్ల వాణిశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు.