LKG
-
హైకోర్టును ఆశ్రయించిన ఐదేళ్ల బుడ్డోడు.. కారణమిదే!
యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ బుడ్డోడు అలహాబాద్ హైకోర్టును ఒక ప్రత్యేక అభ్యర్థనతో ఆశ్రయించాడు. తాను చదువుకుంటున్న పాఠశాల సమీపంలో మద్యం దుకాణం ఉందని, దానిని తొలగించాలంటూ ఆ ఐదేళ్ల చిన్నారి హైకోర్టులో పిటిషన్ వేశాడు. మందుబాబులు పాఠశాలను అసాంఘిక కార్యకలాపాలకు ఆడ్డాగా మార్చారని ఆ చిన్నారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి కారణంగా తమ చదువులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది. కాన్పూర్‌లోని ఓ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారి అథర్వ తన కుటుంబ సభ్యుల సాయంతో కోర్టుకు ఈ ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన హైకోర్టు ప్రతి సంవత్సరం ఈ మద్యం దుకాణం కాంట్రాక్టును ఎలా పునరుద్ధరిస్తున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ పాఠశాల కాన్పూర్ నగరంలోని ఆజాద్ నగర్ ప్రాంతంలో ఉంది. అక్కడికి 20 మీటర్ల దూరంలో మద్యం దుకాణం ఉంది. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల తర్వాతే తెరవాలి. అయితే తరచూ ఉదయం ఆరు గంటల నుంచే ఇక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అథర్వ కోర్టుకు తెలిపాడు. అథర్వ కుటుంబ సభ్యులు ఈ విషయమై కాన్పూర్ అధికారులకు, యూపీ ప్రభుత్వానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా ఈ పాఠశాల 2019లో ప్రారంభమయ్యిందని, మద్యం దుకాణానికి సంబంధించిన ఒప్పందం దాదాపు 30 ఏళ్లనాటిదని వైన్స్ దుకాణ యజమాని వాదనకు దిగారు. ఈ నేపధ్యంలో అధర్వ తన కుటుంబ సభ్యుల సహకారంతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా, జస్టిస్ క్షితిజ్ శైలేంద్రలతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 13న జరగనుంది. -
లక్షితా... ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు?
ప్రతి ఒక్కరికీ ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. హైస్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ టచ్‌లో ఉన్నంతగా ప్రైమరీస్కూల్ ఫ్రెండ్స్‌లో చాలా తక్కువమంది మాత్రమే టచ్‌లో ఉంటారు. అయితే వారి చిత్రాలు మన మదిలో ప్రింటై పోయి ఉంటాయి. ఏదో ఒక సమయంలో వారు గుర్తుకు వస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ నేహాకు తన ఎల్కేజీ ఫ్రెండ్ లక్షిత గుర్తుకు వచ్చింది. ‘ఎక్కడ ఉందో? ఎలా ఉందో’ అనే ఆసక్తి మొదలైంది. వెంటనే ‘ఫైండింగ్ లక్షిత’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ క్రియేట్ చేసింది. నేహా ఆన్లైన్ సెర్చ్ జర్నీకి లక్షలాది లైక్ వచ్చాయి అనేది ఒక విషయం అయితే, మరో విశేషం... నేహాను అనుసరిస్తూ ఎంతోమంది తమ ఎల్కేజీ ఫ్రెండ్స్‌ను వెదుక్కునే పనిలో పడ్డారు. ఇదొక ట్రెండ్‌గా మారింది. ‘నా ఎల్కేజీ ఫ్రెండ్ జాడ కోసం నేను కూడా నేహాలాగే చేశాను. ఇదొక మంచి ఐడియా. ఏదో ఒకరోజు నా ఫ్రెండ్ గురించి కచ్చితంగా తెలుసుకుంటాను’ అని ఒక యూజర్ రాసింది. -
ఎల్కేజీ హీరో
‘ఎల్కేజీ’ జాయిన్ అయ్యారు ఆర్జే బాలాజీ. మూడు పదుల వయసు తర్వాత ఆయన ‘ఎల్కేజీ’లో జాయిన్ అవ్వడం ఏంటీ? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అది సినిమా పేరు. రేడియో జాకీగా కెరీర్‌ను స్టార్ట్ చేసి టీవీ ప్రజెంటర్, హాస్య నటుడిగా ఎదిగిన బాలాజీ ఇప్పుడు హీరోగా కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రభు దర్శకునిగా పరిచయం అవుతూ ఆర్జే బాలాజీ హీరోగా నటించనున్న చిత్రం ‘ఎల్కేజీ’. ఇందులో ప్రియా ఆనంద్ కథానాయికగా నటించనున్నారు. శుక్రవారం ‘ఎల్కేజీ’ చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా పొలిటికల్ సెటైరికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని కోలీవుడ్ టాక్. ఇందులో హీరోగా నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ప్లే ఆర్జే బాలాజీనే అందించనుండటం విశేషం. ఈ సినిమాకు లియాన్ జేమ్స్ బాణీలు సమకూర్చనున్నారు. మూవీ టైటిల్‌ను బట్టీ ‘ఎల్కేజీ’ అనేది సినిమాలో ఓ పొలిటికల్ పార్టీ కూడా అయ్యి ఉండవచ్చన్నది కొందరి ఊహ. -
ఇక 'హంగుల'వాడీలు
► ప్రీస్కూల్స్‌గా మారనున్న పట్టణ అంగన్వాడీ కేంద్రాలు ► నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యాబోధన ► ప్రత్యేక సిలబస్, ఇంగ్లిష్ బోధన, యూనిఫామ్ పంపిణీ జంగారెడ్డిగూడెం : పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలు ఇకపై కార్పొరేట్ పాఠశాలలను తలపించనున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని 9 మున్సిపాలిటీల పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కార్పొరేట్ విద్య అందనుంది. పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కేంద్రాల సంఖ్యను కుదించి దగ్గరగా ఉన్న కేంద్రాలను ఒక ప్రీస్కూల్‌గా రూపొందించి చిన్నారులకు విద్యను అందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్పొరేట్ పాఠశాలల తరహాలో చిన్నారులకు అత్యుత్తమ విద్యను అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రైవేట్‌కు దీటుగా.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రీ స్కూల్స్ రూపొందనున్నాయి. వీటిలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తారు. కార్పొరేట్ తరహాలో సూక్ష్మ ప్రణాళిక పద్ధతిలో చిన్నారులకు విద్యాబోధన చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించారు. చిన్నారు ప్రీస్కూల్‌కు రాగానే అసెంబ్లీ నిర్వహించి.. అనంతరం విద్యాబోధన ప్రారంభిస్తారు. రోజువారీ ప్రణాళికలో భాగంగా అక్షరాలు ఏవిధంగా రాయా లి, ఏవిధంగా చదవాలి, తెలుగు పద్యాలు, గేయాలు పలక మీద రాయడం వంటివి చిన్నారులకు నేర్పిస్తారు. ఇం గ్లిష్ అక్షరాలను కూడా నర్సరీ స్థాయి నుంచే బోధిస్తారు. ఇంగ్లిష్ పదాలు, గేయాలు నేర్పుతారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు ప్రీ స్కూల్లో ప్రత్యేక సిలబస్ రూపొందించారు. ఇందులో తెలుగుతోపాటు గణితం, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ కూడా బోధిస్తారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను బట్టి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలోనే.. అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్న సమగ్ర శిశు అభివృద్ధి సంస్థ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలోనే ప్రీస్కూల్స్ నడుస్తాయి. జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో మొత్తం 381 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏలూరులో 110, కొవ్వూరులో 55, పాలకొల్లులో 25, తణుకులో 36, నిడదవోలులో 16, భీమవరంలో 31, జంగారెడ్డిగూడెంలో 28, తాడేపల్లిగూడెంలో 60, నరసాపురంలో 20 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. పట్టణం యూనిట్‌గా సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలను కలిపి ప్రీస్కూల్ ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు జంగారెడ్డిగూడెంలో మొత్తం 28 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. వాటిని 19 ప్రీ స్కూల్స్‌గా మారుస్తున్నారు. వీటికోసం త్వరలో భవనాలు నిర్మిస్తారు. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యాబోధన చేస్తారు. ఆకర్షణీయంగా.. ప్రీస్కూల్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. పాఠశాల భవనం వెలుపల భాగంతోపాటు లోపలి గదుల్లోనూ చిన్నారులను ఆకట్టుకునేలా చిత్రాలు ఉంటాయి. బ్లాక్‌బోర్డు చుట్టూ గోడలపై చిన్నారులకు బోధించే విధంగా పలు చిత్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రీస్కూల్లో చదువుకునే చిన్నారులకు ప్రత్యేకంగా యూనిఫామ్ కూడా ఉచితంగా అందిస్తారు. బాలికలకు, బాలురకు వేర్వేరుగా యూనిఫామ్ అందజేస్తారు. కార్యకర్తలకు శిక్షణ ప్రీస్కూల్స్ నిర్వహణపై అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో శిక్షణ పూర్తికాగా.. మిగిలిన పట్టాణాల్లో వరుసగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లాకు టి.హరితను కన్సల్టెంట్‌గా నియమించారు. -
ప్రభుత్వ స్కూళ్లలో ఎల్కేజీ చదువులు
పరిశీలనలో ఉందన్న మంత్రి జగదీశ్ రెడ్డి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే యోచన ఉన్నట్లు వెల్లడి హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ విద్యతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆంగ్లంపై మోజుతో తల్లిదండ్రులు మూడేళ్లకే పిల్లలను కాన్వెంట్లకు పంపుతున్నారని పేర్కొన్నారు. ఐదేళ్ల లోపు విద్యార్థులను పాఠశాలల్లో చేర్చుకోరాదనే నిబంధన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య ప్రవేశపెట్టడానికి అడ్డంకిగా మారిందని తెలిపారు. నాలుగో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరపాలన్న వాదన కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సంస్కరణలపై విద్యావేత్తలు, అన్ని పక్షాల అభిప్రాయాలను స్వీకరించి ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసేలోగా నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు. శనివారం శాసనమండలిలో ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్‌గౌడ్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. వేసవిలో హేతుబద్ధీకరణ మూడేళ్లుగా హేతుబద్ధీకరణ జరగకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడిందని మంత్రి అభిప్రాయపడ్డారు. కొన్ని పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులు, ఎక్కువ మంది ఉపాధ్యాయులంటే మరికొన్ని పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు, తక్కువ మంది ఉపాధ్యాయులున్నారన్నారు. దీన్ని సరిచేయడానికి హేతుబద్ధీకరణ ఉత్తర్వులు జారీచేశామన్నారు. ఈఏడాది నుంచి 9,10 తరగతుల సిల బస్తో పాటు పరీక్షా విధానం మారిం దన్నారు. 3.5 లక్షల మందికి లబ్ధి చేకూర్చాం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ఆటోరిక్షాలకు రహదారి పన్నును రద్దు చేసిందని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గతంలో ఉన్న జీవోను సవరించామన్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3.5 లక్షలమంది ఆటో యజమానులకు లబ్ధి చేకూరింద న్నారు. ‘ఉపాధి’ కోసం తీర్మానం యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి కె.తారకరామారావు మండలిలో తీర్మానాన్ని ప్రతిపాదించారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పక్షాలు మద్దతు తెలపడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొం దినట్లు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటిం చారు. కేంద్రం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 2,500 వెనుకబడిన బ్లాకులకే పరిమితం చేయడం ద్వారా తెలంగాణలో ఈ పథకం కేవ లం 78 మండలాలకే వర్తించనుందన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ వ్యాసంపై గరంగరం శాసనమండలి సభ్యుల వేతనాలకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వ్యాసంపై వార్తపై అధికారపక్ష సభ్యులు మండిపడ్డారు. ‘అమరులకు అన్యాయం’ శీర్షికన ప్రచురితమైన వార్తలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనాలను పెం చిన ప్రభుత్వం... అమరుల గురించి పట్టించుకోవడం లేదని రాసిన వైనాన్ని సభ్యులు తప్పపట్టారు. సభ్యుల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి వార్తలు ప్రచురించిన సంస్థపై చర్యలు చేపట్టాలని ప్రత్యేక ప్రస్తావన కింద ఎమ్మెల్సీ భానుప్రసాద్ చైర్మన్‌ను కోరారు. భానుప్రసాద్ ప్రతిపాదనకు అధికార పార్టీ సభ్యులు మద్దతు తెలుపగా.. టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి అభ్యం తరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైపు నుంచి ఏవైనా తప్పులు జరిగినట్లుగా పత్రికల్లో వార్తలు వస్తే, ప్రభుత్వం ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అగౌరవపరిచినట్లు భావించి సభ్యులు తనకు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని చైర్మన్ స్వామిగౌడ్ చెప్పడంతో గందరగోళానికి తెరపడింది. తర్వాత మండలి సమావేశాలను ఈనెల 21కి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్సీ బీరవల్లి ధర్మారెడ్డి మృతికి మండలి శ్రద్ధాంజలి ఘటించింది. -
సర్కారీ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ
-
మూడేళ్లకే బడి
* సర్కారీ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ * ‘కేజీ టు పీజీ’ అమలు దిశగా టీ సర్కార్ చర్యలు * ప్రీ ప్రైమరీలో చేరేందుకు కనీస వయసు మూడేళ్లకు తగ్గింపు * అంగన్వాడీ కేంద్రాలూ విద్యా శాఖ పరిధిలోకే * విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పాఠశాలల మదింపు * దసరా సెలవుల్లోగా ఏకీకృత రూల్స్, హేతుబద్ధీకరణ, బదిలీలు * ప్రైవేట్ స్కూళ్ల పనితీరు, ఫీజులపైనా పర్యవేక్షణ * ఉన్నతాధికారులతో సమీక్షలో విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం విద్యా రంగం ప్రక్షాళనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించే ఉద్దేశంతో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ (ప్రీ ప్రైమరీ)లో ప్రవేశాలకు వీలుగా విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తోంది. ప్రీ ప్రైమరీకి అనుగుణంగా సర్కారీ స్కూళ్లలో చేరే విద్యార్థుల కనీస వయసును ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని తాజాగా నిర్ణయించింది. అలాగే నర్సరీ తరగతుల కోసం అంగన్వాడీ కేంద్రాలను విద్యా శాఖ పరిధిలోకి తీసుకురావాలని, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని కస్తూర్బా బాలికా విద్యాలయాలన్నింటినీ రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చాలని నిర్ణయించింది. ‘కేజీ టు పీజీ’ అమలులో ఈ నిర్ణయాలే తొలి అడుగులు కానున్నాయి. విద్యా రంగంలో సంస్కరణలపై ఆ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో ఎస్సీఈఆర్టీ, పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్, కమిషనర్, గురుకుల విద్యా సంస్థల డెరైక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏకీకృత రూల్స్.. ఉపాధ్యాయులకు శిక్షణ రాష్ట్ర విభజన చట్టంలో కల్పించిన వెసులుబాటుతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్వీస్ నిబంధనలను అమలు చేయాలని సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీచర్లకు ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేసే దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ నిబంధనలను దసరా లోగా అమలు చేయాలని, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీలను కూడా దసరా సెలవుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత పాఠశాలల్లోని టీచర్లు, హెచ్.ఎంలకు దసరా సెలవుల తర్వాత శిక్షణ ఇప్పించాలని, కొత్త పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధకులకు హ్యాండ్‌బుక్‌లు అందించాలని మంత్రి ఆదేశించారు. పాఠ్య పుస్తకాల పంపిణీకి చర్యలతో పాటు శిక్షణకు సమగ్ర కేలండర్‌ను రూపొందించాలని ఆదేశించారు. స్కూళ్లలో తనిఖీలు, ప్రమాణాల పెంపు ప్రతి ప్రభుత్వ పాఠశాల పనితీరునూ అంచనా వేయాలని మంత్రి నిర్ణయించారు.స్కూళ్లవారీగా విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు టీచర్ల పనితీరును అంచనా వేసే బాధ్యతను ప్రత్యేక ఏజెన్సీకి అప్పగించనున్నారు.కొత్త పాఠ్యాంశాల అమలు, పరీక్షల సంస్కరణలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రైవేట్ స్కూళ్ల సమాచారం,వాటి పనితీరును,ఫీజుల వసూలును కూడా పరిశీలించాలని మంత్రి నిర్దేశించారు.ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ప్రక్రియను ఈ నెల 20లోగా పూర్తి చేయాలన్నారు.ఇకపై అదనపు సంచాలకులు, సీనియర్ అధికారులతో కూడిన బృందాలతో పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. నివేదికలను కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి పంపించాలని మంత్రి సూచించారు.వారు నెలలో మూడు నాలుగు రోజులపాటు పాఠశాలలను తనిఖీ చేసి... జిల్లా, మండల స్థాయి విద్యాధికారులతో సమీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. అలాగే అన్ని పాఠశాలల్లో ఆటలు, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని, ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి పేర్కొన్నారు. -
అడిగేవారే లేరు
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ పూర్తి స్థాయిలో టెక్నో, ఈ టెక్నో పేర్లను తొలగించని ైవె నం ప్రభుత్వ ఆదేశాలు...నిబంధనలు బుట్టదాఖలు చేష్టలుడిగిన విద్యాశాఖ ‘‘మా పిల్లాడిని ఓ ప్రైవేటు స్కూల్లో ఎల్కేజీలో చేర్పించేందుకు ఓ కార్పొరేట్ స్కూలుకు వెళ్లా. ట్యూషన్ ఫీజు 15వేలు అడిగారు. ఫీజుతో చదువు పూర్తయ్యే పరిస్థితి లేదు. యూనిఫాం..బుక్స్, బూట్లు...బస్సుకు కలిపితే మళ్లీ అంతవుతుంది. అసలు ఫీజుతో పాటు కొసరు ఖర్చు కూడా తడిసిమోపెడవుతోంది. పిల్లాడు బాగా చదువుతాడని ఇక్కడ చదివించాలనుకుంటే ఏడాదికి అయ్యే ఖర్చును చూస్తే భయమేస్తోంది. ప్రైవేటు చదువులు ఇలాగే ఉంటాయేమో!’’ -సగటు మనిషి ఆవేదన ‘‘ఎంత ప్రైవేటు పాఠశాలలైనా వాటికీ కొన్ని హద్దులుం టాయి. ఆ ఫీజులకూ ఒక పరిమితి ఉంటుంది. పదో తరగతికి 35వేల రూపాయల ఫీజు చెల్లించాల్సి వస్తోంది. పైన మరో 15-20 వేల రూపాయలు భరించాలి. స్కూల్లో పిల్లోడికి అయ్యే ఖర్చు మా పక్కింట్లో ఇంజనీరింగ్ పిల్లోడి చదువు ఖర్చుకు దాదాపు సమానంగా ఉంటోంది. పుస్తకాలకు రూ.4,800 తీసుకున్నారు. బయట కొంటే అన్నీ 2,500 రూపాయలే అవుతున్నాయి. కానీ తప్పదు. వాళ్లవద్దే కొనాలట! ఫీజులతో పాటు మరీ ఇలాంటి దోపిడీ అయితే ఎలా! విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు.’’ -పదో తరగతి విద్యార్థి తండ్రి. జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డులేకుండా పోయింది. కాన్సెప్ట్, ఐఐటీ, టెక్నో, ఈ-టెక్నో, స్మార్ట్టెక్నో, టాలెంట్, ఒలంపియాడ్, సీబీఎస్...తదితర పేర్లు బోర్డులపై నుంచి ప్రభుత్వం తొల గించగలిగింది. కానీ ఫీజులపై నియంత్రణలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలంటే సగటు మనిషి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యథేచ్ఛగా సాగుతున్న ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన విద్యాశాఖ చోద్యం చూస్తోంది. దీంతో ప్రభుత్వం రూపొందించిన ఫీజుల నియంత్రణ జీవోలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇవీ నిబంధనలు: ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం 2008లో జీవో నంబర్ 90,91,92లను జారీ చేసింది. వీటి ప్రకారం...పదో తరగతి విద్యార్థికి కార్పొరేషన్లో 15వేలు, మునిసిపాలిటీలో 12వేలు, మిగిలిన ప్రాంతాల్లో అయితే 10వేల రూపాయల లోపు మాత్రమే వసూలు చేయాలి. అంతకు మించి ఒక్క రూపాయి వసూలు చేయకూడదు. కానీ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కడా ఇది అమలు కావడం లేదు. ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు ? ఎంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు? పాఠశాలలకు ఉన్న ప్రత్యేకతలేంటి? తదితర అన్ని అంశాలను తల్లిదండ్రుల సౌకర్యార్థం బోర్డులో ప్రదర్శించాలి. వసూలు చేస్తున్న ఫీజు మొత్తానికి రశీదు ఇవ్వాలి. ప్రైవేటు ఫీజుల నియంత్రణ కోసం జిల్లా స్థాయిలో నలుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేయాలి. ఇందులో డీఈవో, రాజీవ్ విద్యామిషన్ పీవో, అకడమిక్ మానిటరింగ్ అధికారి, మరో అధికారి సభ్యులుగా ఉంటారు. వీరు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి వాటి స్థితిగతులను నిశితంగా పరిశీలించి ఆపై ఏయే పాఠశాలలు ఎంత ఫీజు వసూలు చేసుకోవచ్చో నిర్ధారించాలి. తర్వాత కూడా ఈ కమిటీ ఎప్పటికప్పుడు నిఘా పెట్టి పర్యవేక్షిస్తుండాలి. ప్రతిపాదనల అమలేదీ? ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై అధ్యయనం చేయడానికి ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఏ పాఠశాలలో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ప్రాంతాల వారీగా ఈ కమిటీ పరిశీలించి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. పాఠశాలల్లో మౌళిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలలను మూడు కేటగిరీలుగా విభజించింది. గరిష్టంగా ఫీజు 30వేలు ఉండవచ్చని ఆ కమిటీ సిఫార్సు చేసింది. కానీ కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు కోర్టుకు వెళ్లడంతో ఈ సిఫార్సులకు బ్రేక్ పడింది. దీంతో పాత ఫీజు నిబంధనే అమల్లో ఉంది. చాలా స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో 2.5-3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని పాఠశాలల్లో కలిపి ఏటా 25 వేల మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందుతున్నారు. అనధికారికంగా నడుస్తున్న పాఠశాలల్లోనూ వేల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. వీరి నుంచి ఫీజుల రూపంలో ఏటా ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారో లెక్కలేకుండా పోయింది. ఎంత ఘోరం : తిరుపతిలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఎల్కేజీ విద్యార్థికి ట్యూషన్ ఫీజు *15వేలు తీసుకుంటున్నారు. పదో తరగతి విద్యార్థికి 35 వేలు తీసుకుంటున్నారు.చిత్తూరు, తిరుపతిలో సెంట్రల్ సిలబస్‌ను బోధించే కొ న్ని బడా పాఠశాలల్లో దిమ్మతిరిగే ఫీజులు వసూలు చేస్తున్నారు. బస్సుకు అదనంగా చెల్లించాల్సిందే!ఆర్భాటంగా ప్రచారం సాగిస్తున్న ఈ పాఠశాలలు, సౌకర్యాల కల్పనను మాత్రం పట్టించుకోవు. సిలబస్, ఫ్యాకల్టీ విషయంలోనూ పెద్ద వ్యత్యాసం ఉండడం లేదు.కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్ ఫీజు వసూలు చేయరాదు. ట్యూషన్ ఫీజు రూపంలో కొంత, అడ్మిషన్ ఫీజు పేరుతో కొంత వసూలు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులు, బ్యాగు, క్యారేజీ, బూట్లు, సాక్సులు, ఆటో లేదా పాఠశాల బస్సు తదితర అవసరాలకు అదనంగా మరింత ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని కలుపుకుంటే ఫీజులు తడిసిమోపెడవుతున్నాయి. పై పాఠశాలల్లో ప్రతి తరగతికి కనీసం 3-5వేల రూపాయలు అదనంగా ఖర్చవుతుంది. ఏం జరుగుతోంది? ఫీజుల నియంత్రణకు జారీ అరుున మూడు జీవోలు ఎక్కడా అమలు కావడంలేదు.నగర పరిధిలో ఉన్న పాఠశాలల్లో గరిష్టంగా వసూలు చేయాల్సిన 15వేల ట్యూషన్ ఫీజు కంటే మూడు రెట్లు అధికంగా గుంజుతున్నారు. కొత్తగా ఎవరైనా పాఠశాలలో చేరితే 5-10వేల రూపాయల వరకూ ప్రత్యేకించి అడ్మిషన్ఫీజు(ప్రవేశ రుసుం) వసూలు చేస్తున్నారు. ఈ మొత్తానికి రశీదు ఇచ్చినా దీనికి ట్యూషన్ ఫీజుతో సంబంధం లేదు.ట్యూషన్ ఫీజును నెలవారీగా కానీ, మూడు నెలలకోసారి కానీ చెల్లించుకోవడానికి వెసులుబాటు ఉంది. ప్రతీ పాఠశాలకు విద్యా సొసైటీ ఉంటుంది. దీని ఆధ్వర్యంలోనే పాఠశాల నిర్వహణ, ఫీజుల వసూళ్లు, లెక్కలు రాయడం, ఆడిట్ చేయించడం, మినిట్స్ నమోదు తదితర కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. పాఠశాలలు నిర్వహించేవారు, విద్యా సొసైటీలో కార్యవర్గ సభ్యులు ఒకరే కావడం వల్ల సర్దుబాట్లుకు ఆస్కారం ఉంటుంది. ఎంత ఫీజు వసూలు చేసినా రికార్డుల్లో మాత్రం తక్కువ మొత్తాన్ని చూపిస్తుంటారు. ఆడిట్ అభ్యంతరాల నుంచి సులువుగా బయటపడుతుంటారు. విద్యాశాఖ అధికారులు పాఠశాలలను తనిఖీ చేసినట్లుగా చెబుతున్నా.. ఫీజుల దోపిడీని నివారించలేకపోతున్నారు. అధిక ఫీజులపై ఫిర్యాదులు స్వీకరించడానికి జిల్లా విద్యాశాఖ ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. తల్లిదండ్రులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదు. ప్రైవేటు ఫీజుల దందాపై ఇంత వరకూ ఏ పాఠశాలపైనా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ‘జూన్’...ఇది ఓ ‘చదివింపుల’ మాసం..! జూన్ వచ్చిందంటే చాలు తల్లిదండ్రుల్లో దడ...విద్యార్థులకు ఫీజులు, దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్‌లు, తదితర అన్నిటి కోసం భారీగా ఖర్చు చేయాలి. ప్రస్తుతం పుస్తకాలు ఫీజులు తదితర ఖర్చులన్నీ కలిపితే ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు ఒక్కొక్కరికి(ఎల్కేజీ-10) సగటున 30 వేల రూపాయల ఖర్చవుతుంది. జిల్లాలో ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు 875 కోట్ల రూపాయలు అవుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు దుస్తులు, నోట్ పుస్తకాలు తదితర ఖర్చులకు ఒక్కొక్కరికి 5-7వేల రూపాయల ఖర్చు యినా జిల్లాలోని 2.43లక్షల మందికి మరో 15 కోట్ల రూపాయల వరకూ ఖర్చవుతుంది. అంటే జూన్‌లో చదువుల కోసం తల్లిదండ్రులపై 890 కోట్ల రూపాయల భారం పడనుంది. -
ఎల్కేజీకీ ఆన్లైన్ ప్రవేశ పరీక్ష
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: నగరంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఎల్కేజీ, యూకేజీలకు ఆన్లైన్ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. గతంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలను నిర్వహించేవారు. అనంతరం ఆ పద్ధతికి స్వస్తి పలికి ప్రవేశం కోరే విద్యార్థులకు మాత్రమే ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు దానిని కూడా ఆన్‌లైన్‌కు మార్చేశారు. పిల్లల తల్లిదండ్రులు ఆన్లైన్లోనే దరఖాస్తులను సమర్పించాలి. వీటిని పరిశీలించి, ఎంపిక చేసిన పిల్లలకు ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జూన్ తొలి వారంలో పాఠశాలలను పునఃప్రారంభిస్తారు. అడ్మిషన్లకు దరఖాస్తులను సమర్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తాము కోరుకున్న స్కూలులో సీటు దొరక్కపోతే...అనే సంశయంతో తల్లిదండ్రులు మూడు, నాలుగు పాఠశాలల్లో దరఖాస్తు చేస్తున్నారు. తమ పిల్లలను ఎల్కేజీ నుంచే ఇంగ్లీషు మీడియంలో చదివించాలని తాపత్రయ పడుతున్న తల్లిదండ్రులు రూ.లక్ష వరకు డొనేషన్ చెల్లించడానికి కూడా సిద్ధపడుతున్నారు. సీ బీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్‌లు బోధించే పాఠశాలల్లో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు డొనేషన్లను వసూలు చేయడం సర్వ సాధారణమై పోయింది. ఇలాంటి పాఠశాలల్లో పిల్లల తల్లిదండ్రుల విద్యార్హతలు కూడా అడ్మిషన్ల సందర్భంగా ప్రధాన పాత్ర పోషిస్తాయి. వారికి విధిగా ఇంగ్లీషు తెలిసి ఉండాలి. మరో వైపు పలు ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2014-15 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను ప్రారంభించడానికి ముందు విద్యా హక్కు చట్టం కింద కేటాయించాల్సిన 25 శాతం సీట్ల వివరాలను స్థానిక విద్యా శాఖ అధికారులకు అందించాల్సి ఉంది. అధికారులు తుది జాబితాను ఖరారు చేసిన తర్వాత మాత్రమే ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ఈ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప, తాముగా స్పం దించలేమని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.