
ప్రభుత్వ స్కూళ్లలో ఎల్‌కేజీ చదువులు
పరిశీలనలో ఉందన్న మంత్రి జగదీశ్ రెడ్డి
ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే యోచన ఉన్నట్లు వెల్లడి
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ విద్యతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆంగ్లంపై మోజుతో తల్లిదండ్రులు మూడేళ్లకే పిల్లలను కాన్వెంట్లకు పంపుతున్నారని పేర్కొన్నారు. ఐదేళ్ల లోపు విద్యార్థులను పాఠశాలల్లో చేర్చుకోరాదనే నిబంధన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య ప్రవేశపెట్టడానికి అడ్డంకిగా మారిందని తెలిపారు. నాలుగో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరపాలన్న వాదన కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సంస్కరణలపై విద్యావేత్తలు, అన్ని పక్షాల అభిప్రాయాలను స్వీకరించి ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసేలోగా నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు. శనివారం శాసనమండలిలో ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్‌గౌడ్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
వేసవిలో హేతుబద్ధీకరణ
మూడేళ్లుగా హేతుబద్ధీకరణ జరగకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడిందని మంత్రి అభిప్రాయపడ్డారు. కొన్ని పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులు, ఎక్కువ మంది ఉపాధ్యాయులంటే మరికొన్ని పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు, తక్కువ మంది ఉపాధ్యాయులున్నారన్నారు. దీన్ని సరిచేయడానికి హేతుబద్ధీకరణ ఉత్తర్వులు జారీచేశామన్నారు. ఈఏడాది నుంచి 9,10 తరగతుల సిల బస్‌తో పాటు పరీక్షా విధానం మారిం దన్నారు.
3.5 లక్షల మందికి లబ్ధి చేకూర్చాం
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ఆటోరిక్షాలకు రహదారి పన్నును రద్దు చేసిందని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గతంలో ఉన్న జీవోను సవరించామన్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3.5 లక్షలమంది ఆటో యజమానులకు లబ్ధి చేకూరింద న్నారు.
‘ఉపాధి’ కోసం తీర్మానం
యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి కె.తారకరామారావు మండలిలో తీర్మానాన్ని ప్రతిపాదించారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పక్షాలు మద్దతు తెలపడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొం దినట్లు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటిం చారు. కేంద్రం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 2,500 వెనుకబడిన బ్లాకులకే పరిమితం చేయడం ద్వారా తెలంగాణలో ఈ పథకం కేవ లం 78 మండలాలకే వర్తించనుందన్నారు.
‘ఆంధ్రజ్యోతి’ వ్యాసంపై గరంగరం
శాసనమండలి సభ్యుల వేతనాలకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వ్యాసంపై వార్తపై అధికారపక్ష సభ్యులు మండిపడ్డారు. ‘అమరులకు అన్యాయం’ శీర్షికన ప్రచురితమైన వార్తలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనాలను పెం చిన ప్రభుత్వం... అమరుల గురించి పట్టించుకోవడం లేదని రాసిన వైనాన్ని సభ్యులు తప్పపట్టారు. సభ్యుల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి వార్తలు ప్రచురించిన సంస్థపై చర్యలు చేపట్టాలని ప్రత్యేక ప్రస్తావన కింద ఎమ్మెల్సీ భానుప్రసాద్ చైర్మన్‌ను కోరారు. భానుప్రసాద్ ప్రతిపాదనకు అధికార పార్టీ సభ్యులు మద్దతు తెలుపగా.. టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి అభ్యం తరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైపు నుంచి ఏవైనా తప్పులు జరిగినట్లుగా పత్రికల్లో వార్తలు వస్తే, ప్రభుత్వం ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అగౌరవపరిచినట్లు భావించి సభ్యులు తనకు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని చైర్మన్ స్వామిగౌడ్ చెప్పడంతో గందరగోళానికి తెరపడింది. తర్వాత మండలి సమావేశాలను ఈనెల 21కి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్సీ బీరవల్లి ధర్మారెడ్డి మృతికి మండలి శ్రద్ధాంజలి ఘటించింది.