ఈసారి 43 లక్షల మందికి విద్యా కానుక | Jagananna Vidya Kanuka for 43 lakh people | Sakshi
Sakshi News home page

ఈసారి 43 లక్షల మందికి విద్యా కానుక

Published Tue, Mar 16 2021 4:00 AM | Last Updated on Tue, Mar 16 2021 4:00 AM

Jagananna Vidya Kanuka for 43 lakh people - Sakshi

సాక్షి, అమరావతి: అమ్మ ఒడి, నాడు–నేడు వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు గణనీయంగా పెరగడంతో ఈ ఏడాది జగనన్న విద్యాకానుక బడ్జెట్‌ కూడా భారీగా పెరగనుంది. రూ.731.30 కోట్లతో ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన వస్తువులను కిట్ల రూపంలో అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు అందించే జగనన్న విద్యా కానుక కిట్లలో 3 జతల యూనిఫారం, షూ, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌ బుక్‌లు, నోట్‌ బుక్‌లతో పాటు ఈసారి అదనంగా ఇంగ్లిష్‌ – తెలుగు డిక్షనరీని అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో జగనన్న విద్యాకానుకలో ఈ ఏడాది కొత్తగా డిక్షనరీని చేర్చారు. డిక్షనరీ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నాణ్యత కూడా బాగుండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఇప్పటికే ఆదేశించారు.

ఆంగ్ల మాధ్యమానికి తల్లిదండ్రుల మద్దతు
► పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి తల్లిదండ్రుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోంది. పాఠశాలల్లో చేరే పిల్లలు, వారి తల్లిదండ్రులు 96.17% మంది ఆంగ్ల మాధ్యమానికే ఆప్షన్‌ ఇచ్చారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగుకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు దాన్ని తప్పనిసరి చేశారు.  
► 2020–21 విద్యా సంవత్సరంలో 1 నుంచి 6వ తరగతి వరకు అమలైన ఆంగ్ల మాధ్యమం.. 2021–22 నుంచి ఏటా ఒక్కో తరగతి చొప్పున వరుసగా పదోతరగతి వరకు అమలు కానుంది. దీంతో పాటు రాష్ట్రంలో సీబీఎస్‌ఈ విధానం అమలు చేయడానికి సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారు. 
► ఇప్పటికే ఇంగ్లిష్‌ మీడియంలో బోధించడానికి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు బ్రిడ్జ్‌ కోర్సులతో పాటు ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ ఉండేలా చర్యలు చేపట్టారు. 
► పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం జగన్‌ అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు మంచి మెనూతో జగనన్న గోరుముద్ద పథకం తీసుకొచ్చారు.

నాణ్యతలో రాజీ లేదు..
ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మునిసిపల్, వివిధ సంక్షేమ శాఖల రెసిడెన్షియల్‌ స్కూళ్లు, ఆశ్రమ, ఎయిడెడ్, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, గుర్తింపు ఉన్న మదర్సాలల్లో 1–10 వరకు చదువుతున్న దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు. గతేడాదితో పోలిస్తే దాదాపు నాలుగు లక్షల మంది పిల్లలు పెరిగారు. 2020–21 విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం రూ.648.10 కోట్లకు పైగా వెచ్చించగా, ఈ ఏడాది రూ.731.30 కోట్లను మంజూరు చేసింది. వీరందరికీ యూనిఫారం కుట్టు కూలీగా 1–8 విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.120, అదే విధంగా 9–10 విద్యార్థుల కోసం ఒక్కొక్కరికి రూ.240 చొప్పున నిధులు అందిస్తోంది. స్టూడెంట్‌ కిట్‌ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని  అధికారులను సీఎం ఆదేశించారు. వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లిష్‌ – తెలుగు డిక్షనరీ ద్వారా పిల్లలు ప్రతి రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలని సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement