‘టెట్‌’కు గ్రీన్‌సిగ్నల్ | AP government has given green signal to TET management | Sakshi
Sakshi News home page

‘టెట్‌’కు గ్రీన్‌సిగ్నల్

Published Thu, Mar 18 2021 4:59 AM | Last Updated on Thu, Mar 18 2021 4:59 AM

AP government has given green signal to TET management - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే తప్పనిసరిగా అవసరమైన టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ బుధవారం జీవో 23ను విడుదల చేశారు. కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో టెట్‌లో ఇంగ్లిష్‌ ప్రొఫెషియన్సీ ప్రశ్నలను ఈసారి తప్పనిసరి చేస్తున్నారు. 1–5 తరగతులకు సంబంధించి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు పేపర్‌–1ఏను, 6–8 తరగతులకు సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులకు పేపర్‌–2ఏను నిర్వహించనున్నారు. పేపర్‌–2ఏ రాసేవారు ఆసక్తి ఉంటే పేపర్‌–1ఏ కూడా రాయొచ్చు. కాగా, ప్రత్యేక స్కూళ్ల పోస్టులకు పేపర్‌–1బీ, పేపర్‌–2బీ నిర్వహిస్తారు. ఇకపై ఏడాదికి ఒకసారే టెట్‌ ఉంటుంది. కాగా, టెట్‌ నోటిఫికేషన్‌ను మేలో విడుదల చేసి జూలైలో పరీక్షలు నిర్వహించే అవకాశముంది. 

పేపర్‌–1ఏకు అర్హతలు ఇలా..
పేపర్‌–1ఏకు ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్రుగాడ్యుయేషన్‌లో ఓసీలు 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 45 శాతం) మార్కులు సాధించి ఉండాలి. రెండేళ్ల డీఎడ్‌ కోర్సు లేదా నాలుగేళ్ల బీఈడీ కోర్సు, రెండేళ్ల స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ డిప్లొమా లేదా బీఈడీ పూర్తి చేసి ఉండాలి.
► 2010 ఆగస్టు 23 కంటే ముందు డీఈడీ, బీఈడీ పూర్తి చేసి ఉన్నవారిలో ఓసీలు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
► పేపర్‌–1బీకి సంబంధించి విభాగాలను అనుసరించి వేర్వేరుగా 11 రకాల అర్హతలను నిర్దేశించారు.

పేపర్‌–2ఏకు అర్హతలు ఇలా..
పేపర్‌–2ఏకు గ్రాడ్యుయేషన్‌ (సంబంధిత సబ్జెక్టు)లో ఓసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించి ఉండడంతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. బీఈడీలో ఓసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. లాంగ్వేజ్‌ పోస్టులకు సంబంధిత లాంగ్వేజ్‌లో బీవోఎల్, పీజీతోపాటు పండిట్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసినవారు అర్హులు. స్పెషల్‌ స్కూళ్లకు సంబంధించి పేపర్‌–2బీలో ఆయా విభాగాలను అనుసరించి అర్హతలను నిర్దేశించారు.

150 ప్రశ్నలు.. 2.30 గంటల సమయం
► టెట్‌ను 150 మార్కులకు 150 బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహించనున్నారు. పరీక్ష సమయం 2.30 గంటలు.
► చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ పెడగాగి, లాంగ్వేజ్‌–1, లాంగ్వేజ్‌–2 (ఇంగ్లిష్‌), మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సబ్జెక్టుల్లో ప్రతిదానిలో 30 ప్రశ్నలు చొప్పున ఇస్తారు. వీటికి 30 మార్కుల చొప్పున ఉంటాయి. 
► పేపర్‌–1ఏలో స్కూళ్లలో ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఉండే తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడం, తమిళం, ఒడియాలలో అభ్యర్థి ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థి ఆ భాషను 1–10 వరకు ఒక సబ్జెక్టుగా అభ్యసించి ఉండాలి. లాంగ్వేజ్‌–2 (ఇంగ్లిష్‌) అభ్యర్థులందరికీ తప్పనిసరి. 
► పేపర్‌–1బీలో కూడా ఇదేవిధమైన ప్రశ్నలు, ఆప్షన్లు ఉంటాయి. పేపర్‌–2ఏలో చైల్డ్‌ డెవలప్‌మెంట్, లాంగ్వేజ్‌–1, లాంగ్వేజ్‌–2 (ఇంగ్లిష్‌)లలో 30 ప్రశ్నలు చొప్పున 30 మార్కులకు ఉంటాయి. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌ స్టడీస్, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, కన్నడం, ఒడియా, తమిళం, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించి 60 మార్కులకు 60 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌–2బీలో చైల్డ్‌ డెవలప్‌మెంట్, లాంగ్వేజ్‌–1, లాంగ్వేజ్‌ –2 ఇంగ్లిష్‌తోపాటు డిజేబిలిటీ స్పెషలైజేషన్‌ అంశాలుంటాయి.

అర్హత మార్కులు ఇలా..
టెట్‌ పరీక్షలు రాసే జనరల్‌ అభ్యర్థులు 60 శాతం మార్కులు, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధిస్తేనే అర్హత సాధించినట్టుగా పరిగణిస్తారు. టెట్‌ స్కోర్‌కు ఏడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. టెట్‌లో ఆయా అభ్యర్థుల స్కోరుకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజ్‌ ఉంటుంది. టెట్‌ నుంచి 20 శాతం, డీఎస్సీ నుంచి 80 శాతం వెయిటేజ్‌ కలిపి మెరిట్‌ను నిర్ణయిస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement