రేపటి నుంచి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు | Bridge courses for students from 10th June | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు

Published Tue, Jun 9 2020 3:58 AM | Last Updated on Tue, Jun 9 2020 3:58 AM

Bridge courses for students from 10th June - Sakshi

సాక్షి, అమరావతి:  పాఠశాలలు ఆగస్టు 3 నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోగా విద్యార్థులను ఆంగ్ల మాధ్యమానికి సన్నద్ధం చేసేందుకు వీలుగా బుధవారం నుంచి బ్రిడ్జి కోర్సులు ప్రారంభం కానున్నాయి. దూరదర్శన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ వీడియో పాఠాలు బోధించేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. బ్రిడ్జి కోర్సులను విద్యార్థులకు వసతి సదుపాయాలతో నిర్వహించాలని తొలుత భావించినా కరోనా కారణంగా నిలిచిపోయింది. 2020–21 విద్యాసంవత్సరం నుంచి 1 – 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించి తదుపరి తరగతులను ఆపై ఏడాదుల్లో ఆంగ్ల మాధ్యమాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి విద్యాశాఖ ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే టీచర్లకు ఆంగ్ల మాధ్యమంలో బోధనపై శిక్షణ కూడా పూర్తయింది.  

నిర్దేశిత తేదీల్లో స్కూలుకు రావాలి.. 
► మొబైల్‌ నెట్‌వర్క్, టీవీలో పాఠాలు చూసే అవకాశం లేని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుస్తకాల ద్వారా బ్రిడ్జి కోర్సులు నేర్చుకొనేందుకు వీలుగా ప్రాథమిక పాఠశాలల టీచర్లు ప్రతి మంగళవారం పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశించారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభించి ప్రతి మంగళవారం పాఠశాలల్లో విద్యార్థుల నోట్‌ పుస్తకాలు, వర్కు పుస్తకాలను సరిచూసేందుకు తల్లిదండ్రులు, పేరెంట్స్‌ కమిటీలకు సమాచారం అందించాలి. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా బ్రిడ్జి కోర్సు లెవెల్‌ – 1 లేదా బ్రిడ్జి కోర్సు లెవెల్‌ – 2 పుస్తకాలను విద్యార్థులకు అందించాలని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు సూచించారు. 
► 6, 7వ తరగతి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు టీచర్లు 17 నుంచి ప్రతి బుధవారం హాజరు కావాలి. 
► 8, 9వ తరగతుల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు 19 నుంచి ప్రతి శుక్రవారం పాఠశాలలకు హాజరు కావాలి. 
► పదో తరగతి బోధించే టీచర్లు ప్రతి బుధ, శుక్రవారాల్లో పాఠశాలలకు హాజరు కావాలి. 
► వీడియో పాఠాలు నేర్చుకునే విద్యార్థుల నోట్‌ బుక్స్, వర్క్‌ బుక్స్‌ను టీచర్లు తనిఖీ చేసి మూల్యాంకనం చేయాలి. 

రేపట్నుంచి ‘సప్తగిరి’లో..
► ఈ నెల 10 నుంచి బ్రిడ్జి కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్లు అందుబాటులో ఉండనందున దూరదర్శన్‌ సప్తగిరి చానల్‌ ద్వారా బ్రిడ్జి కోర్సు పాఠాలను ప్రసారం చేయనున్నారు. 
► దూరదర్శన్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు 1 – 5వ తరగతి విద్యార్థులకు, ఆ తర్వాత 2 గంటల నుంచి 3 వరకు 6, 7 తరగతులకు పాఠాలు ఉంటాయి. 3 నుంచి 4 గంటల వరకు 8, 9, 10వ తరగతులకు నిపుణులతో ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను రోజూ ప్రసారం చేయనున్నారు. 
► జూలై నెల సిలబస్‌కు సంబంధించిన అంశాలన్నీ వీటిలో ఉంటాయి. రోజువారీ పాఠ్యాంశాల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement