ఎల్‌కేజీకీ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష | online entrance test for kinder garten | Sakshi
Sakshi News home page

ఎల్‌కేజీకీ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష

Published Tue, Dec 24 2013 7:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM

online entrance test for kinder garten

సాక్షి ప్రతినిధి, బెంగళూరు: నగరంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఎల్‌కేజీ, యూకేజీలకు ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. గతంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలను నిర్వహించేవారు. అనంతరం ఆ పద్ధతికి స్వస్తి పలికి ప్రవేశం కోరే విద్యార్థులకు మాత్రమే ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు దానిని కూడా ఆన్‌లైన్‌కు మార్చేశారు. పిల్లల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను సమర్పించాలి. వీటిని పరిశీలించి, ఎంపిక చేసిన పిల్లలకు ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

జూన్ తొలి వారంలో పాఠశాలలను పునఃప్రారంభిస్తారు. అడ్మిషన్లకు దరఖాస్తులను సమర్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తాము కోరుకున్న స్కూలులో సీటు దొరక్కపోతే...అనే సంశయంతో తల్లిదండ్రులు మూడు, నాలుగు పాఠశాలల్లో దరఖాస్తు చేస్తున్నారు. తమ పిల్లలను ఎల్‌కేజీ నుంచే ఇంగ్లీషు మీడియంలో చదివించాలని తాపత్రయ పడుతున్న తల్లిదండ్రులు రూ.లక్ష వరకు డొనేషన్ చెల్లించడానికి కూడా సిద్ధపడుతున్నారు.

సీ బీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌లు బోధించే పాఠశాలల్లో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు డొనేషన్లను వసూలు చేయడం సర్వ సాధారణమై పోయింది. ఇలాంటి పాఠశాలల్లో పిల్లల తల్లిదండ్రుల విద్యార్హతలు కూడా అడ్మిషన్ల సందర్భంగా ప్రధాన పాత్ర పోషిస్తాయి. వారికి విధిగా ఇంగ్లీషు తెలిసి ఉండాలి. మరో వైపు పలు ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

2014-15 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను ప్రారంభించడానికి ముందు విద్యా హక్కు చట్టం కింద కేటాయించాల్సిన 25 శాతం సీట్ల వివరాలను స్థానిక విద్యా శాఖ అధికారులకు అందించాల్సి ఉంది. అధికారులు తుది జాబితాను ఖరారు చేసిన తర్వాత మాత్రమే ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ఈ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప,  తాముగా స్పం దించలేమని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement