నాణ్యమైన విద్యే ప్రభుత్వ ధ్యేయం:కడియం
మారేడ్‌పల్లి(హైదరాబాద్): కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని కస్తూర్బాగాంధీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ ఉన్నత విద్య జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన ‘తెలంగాణ లో ఉన్నత విద్య బలోపేతం- సీబీఎస్‌ఈ అమలు’ అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు.
విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా మార్పులు తెస్తామని వెల్లడించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరముందని మంత్రి అన్నారు. విద్యావేత్త హరగోపాల్ మాట్లాడుతూ విద్యకు అధిక నిధులు కేటాయించి అన్ని వర్గాల వారికి ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించాలని కోరారు.