నెలాఖరులోగా ఎంసెట్‌పై తుది నిర్ణయం
- సొంతంగా నిర్వహణకు తెలంగాణ కసరత్తు
- ఒప్పుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోనూ పరీక్ష
- ఇతర సెట్స్‌ను నిర్వహించేదీ తెలంగాణ రాష్ట్రమే
- న్యాయశాఖకు ఫైలు పంపించిన అధికారులు
- తెలంగాణ ఉన్నత విద్యా మండలికి చట్టబద్ధత లేదంటున్న ఏపీ
- ఏపీ కౌన్సిల్ నేతృత్వంలోనే ఉమ్మడి ఎంసెట్ అంటున్న ఏపీ మంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్, తదితర ఉమ్మ డి ప్రవేశ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుం డా సొంతగానే ఎంసెట్ నిర్వహించేందుకు సిద్ధం చేసిన ఫైలును న్యాయశాఖ పరిశీలనకు పంపిన ప్రభుత్వం, మరోవైపు ఏపీ కోరితే తెలంగాణతో కలిపి ఏపీ కి పరీక్ష నిర్వహించి, ప్రవేశాలు చేపట్టేందుకు సిద్ధమంటోంది. ఇదే అంశాన్ని ఏపీ అధికారులకు సూచించి నట్టు తెలిసింది.
అయితే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు మాత్రం తెలంగాణ ఉన్నత విద్యా మండలికి చట్టబద్ధత లేదని, ఏపీ ఉన్నత విద్యా మండలికే చట్టబద్ధత ఉందని చెబుతున్నారు. ఎంసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఏపీ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోనే జరుగుతాయంటున్నారు. అయితే, తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు రెండు ప్రత్యామ్నాయలపై తెలంగాణ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. అదీ తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోని హైదరాబాద్ జేఎన్‌టీయూ పరీక్షను నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు.
ఒకవేళ ఏపీ కలసి రాకపోతే తెలంగాణకే సొంతగా పరీక్ష నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్రానికి ఎలాంటి వివక్ష లేకుండా సేవ లు అందించేందుకు సిద్ధమని, పదేళ్లపాటు 15 శాతం ఓపెన్ కోటాలో ప్రతిభ ఆధారంగా ఏపీ విద్యార్థులకు సీట్లు కేటాయించేందుకు తాము సిద్ధమని గతంలో తెలంగాణ విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంసెట్ తదితర సెట్స్ విషయంలోనైనా తెలంగాణ ప్రభుత్వ సేవలను అడిగేందుకు ఏపీ సిద్ధ పడుతుందా? లేదా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది.