
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని రకాల వినియోగదారులకు నిరంతరం మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. 2018 రబీ సీజన్ నుంచి వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇవ్వనున్నట్లు తెలిపారు. సరఫరాలో ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు ప్రయోగాత్మకంగా నిరవధికంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే ఉమ్మడి మెదక్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు వివరించారు. సోమవారం శాసనమండలిలో విద్యుత్‌పై జరిగిన చర్చలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. వ్యవసాయానికి నిరంతరం కరెంటు సరఫరా వల్ల ఇబ్బందులు ఉంటాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
దీనికి మంత్రి సమాధానమిస్తూ.. వ్యవసాయంతో పాటు అన్ని రకాల అవసరాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. విద్యుత్ బిల్లులు చెల్లించని రైతులను టీడీపీ ప్రభుత్వం జైల్లో పెట్టిందని, వైఎస్ రూ.1,200 కోట్ల బకాయిలను రద్దు చేశారని చెప్పారు. ప్రస్తుతం 14,133 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి సామర్థ్యముందని, 2024 వరకు దీన్ని 27,158 మెగావాట్లకు పెంచనున్నట్లు తెలిపారు.