
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకు..
గడువు పొడిగించాలని కోరనున్న తెలంగాణ సర్కార్
మంత్రి జగదీశ్‌రెడ్డి, అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఆగస్టు ఒకటి నాటికి ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ముగించడం సాధ్యం కాదని రాష్ర్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటైన రాష్ర్టంలో పాలనకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి అధికార యంత్రాంగం లేని పరిస్థితుల్లో ఎంసెట్ ప్రక్రియను హడావుడిగా ముగించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన విద్యాశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంసెట్ అడ్మిషన్లకు అక్టోబర్ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని తిరిగి సుప్రీంకోర్టునకు వెళ్లాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు, విద్యాశాఖ కార్యదర్శి నాగిరెడ్డి, సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీనియర్ అధికారులు అజయ్‌మిశ్రా, స్మితా సబర్వాల్‌లతో విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేశారు. ఎంసెట్ అడ్మిషన్లకు సంబంధించిన చర్చ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకొచ్చారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని అధికారులు సీఎంకు తేల్చిచెప్పారు.
తెలంగాణలో 320 మంది సివిల్ సర్వీసు అధికారులు ఉండాల్సి ఉండగా, 70 మంది మాత్రమే ఉన్నారని, వీరితో అన్ని పనులు సకాలంలో చేయడం సాధ్యం కాదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను సుప్రీంకోర్టుకు నివేదించి గడువు పెంపు కోరాలని ముఖ్యమంత్రితో సహా అందరూ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టులో కౌన్సెలింగ్ గడువు పెంపు కోసం అప్పీలు చేయనున్నారు.
సుప్రీం ఉత్తర్వులనే అమలు చేయాలి
ఎంసెట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షలాది తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘భూదాన్’ బోర్డు రద్దు
సాక్షి, హైదరాబాద్: ‘భూదాన్’ భూములపై వస్తున్న ఆరోపణల నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల ఎకరాల భూదాన్ భూములు అన్యాక్రాంతమయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో దీనిపై శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్రమాలు జరిగితే ఉపేక్షించేదిలేదని, రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతం అయిన భూముల వివరాలను నాలుగైదు రోజుల్లో నివేదికల రూపంలో తన ముందుంచాలని ఆజ్ఞాపించారు. మొదటి చర్యగా భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఫిర్యాదులతో కదిలిన సర్కార్..
రంగారెడ్డి జిల్లాల్లో భూదాన్ చట్టాలను ఉల్లంఘించి హయత్‌నగర్ మండల పరిధిలోని బీబీనగర్‌లో పెద్ద ఎత్తున భూములను వాణిజ్య సంస్థలు, కార్పోరేట్ కళాశాలలకు కేటాయించారని వీటిపై విచారణ జరిపించాలని రెండు రోజుల కిందటే మాజీ మంత్రి శంకర్రావ్, మరికొందరు రంగారెడ్డి జిల్లా నేతలు ముఖ్యమంత్రికి రాతపూర్వకంగా విన్నవించారు. దీంతో ముఖ్యమంత్రి సుమారు రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించి ఆ వివరాలు తెలుసుకున్నారు. ఆ భూములకు సంబంధించిన రికార్డులను వెంటనే బోర్డు కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అధికారులు వెంటనే నాంపల్లిలోని భూదాన్ యజ్ఞ బోర్డు కార్యాలయం నుంచి కీలక రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు.
త్వరలో ఉన్నతస్థాయి కమిటీ..: ఆరోపణల నిగ్గుతేల్చేందుకు త్వరలోనే ఉన్నతస్థాయి కమిటీని వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సీఎంతో రెవెన్యూ అధికారుల భేటీ ముగిసిన కొద్దిసేపటికే భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బోర్డును పునరుద్ధరించే వరకు దాని బాధ్యతలను ముఖ్య కార్యదర్శి చేపడతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, నగరంలోని ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కేసీఆర్ ఆదేశించారు. కోఠి ఈఎన్‌టీ హాస్పిటల్ సమీపంలోని రెండు ఎకరాల ఖాళీ స్థలాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.