
వంశ మూలాలే ఆధారం!
‘స్థానికత’పై విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి
డాక్యుమెంటరీ ఆధారాలున్నా ఓకే
తల్లిదండ్రులను కోల్పోయిన వారి విషయంలో ప్రత్యేక నిబంధనలు
‘ఫాస్ట్’ మార్గదర్శకాలు వచ్చాకే కౌన్సెలింగ్‌పై యోచన
ఉమ్మడి అడ్మిషన్లకు సిద్ధమే
హైదరాబాద్: ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం(ఫాస్ట్)’ పథకం అమల్లో స్థానికత ధ్రువీకరణకు వంశ మూలాలను ప్రధాన ఆధారంగా తీసుకుంటామని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఫాస్ట్’ పరిధిలోకి వచ్చేవారు ఎక్కువ శాతం నిరుపేదలే అయినందున అందరికీ డాక్యుమెంటరీ ఆధారాలు ఉండకపోవచ్చని... అయితే వారి తాత, తండ్రి వివరాలు గ్రామాల్లో ఎవరో ఒకరికి కచ్చితంగా తెలుస్తాయని ఆయన వివరించారు. ఈ అంశాన్నే ‘ఫాస్ట్’లో ప్రధాన ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటారని.. డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్న వారికి మాత్రం ఈ అవసరం ఉండదని మంత్రి చెప్పారు. స్థానికత గుర్తింపులో సమస్యలు వస్తాయని పేర్కొనడం అర్థరహితమని, మార్గదర్శకాల్లో అన్ని అంశాలు ఉంటాయని స్పష్టం చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంసెట్ కౌన్సెలింగ్ వ్యవహారం, ఫాస్ట్ పథకం, విద్యాశాఖకు సంబంధించిన వివిధ అంశాలను వెల్లడించారు.
ప్రభుత్వ నిర్ణయమే అంతిమం..
ఉన్నత విద్యా మండలి అనేది సలహా మండలి మాత్రమేనని, ప్రభుత్వ నిర్ణయమే అంతిమమని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అంగీకారానికి వచ్చాకే సర్టిఫికెట్ల పరిశీలనకు నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ అలా కాకుండా ఏకపక్షంగా జారీ చేసింది. తెలంగాణలో ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు జారీ కాలేదు. తప్పనిసరిగా అవసరమైన స్థానికత, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇక్కడి విద్యార్థులకు లేవు. ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు వచ్చాకే రెవెన్యూ శాఖ ఆ పత్రాలను జారీ చేస్తుంది. మరి ఈలోగా నోటిఫికేషన్ ఇచ్చిన మండలి ఏ సర్టిఫికెట్లను పరిశీలిస్తుంది? కాలేజీలకు అనుమతులే రాకుండా సీట్లు ఎక్కడ కేటాయిస్తారు. రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నాం. ఉమ్మడి కౌన్సెలింగ్‌కు మేం సిద్ధమే. వారే గిల్లికజ్జాలతో ఏపీ విద్యార్థులకు నష్టం వాటిల్లేలా చేస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.
ఇంకా దోచుకుంటారా?
తెలంగాణలోని ఏపీ విద్యార్థులకు 58 శాతం ఫీజులు చెల్లిస్తామన్న చంద్రబాబు ప్రతిపాదన పట్ల మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘అది పనికిమాలిన, అర్థరహితమైన ప్రతిపాదన. ఊరుకుంటే రుణమాఫీలో అదే అమలు చేద్దామంటారు? 60 ఏళ్లుగా ఫేర్ షేర్ పేరుతోనే దోచుకున్నారు. ఇంకా వారి మోసాలను ఒప్పుకుంటామా?..’’ అని వ్యాఖ్యానించారు.
19న చేసే సర్వేకు, ‘ఫాస్ట్’కు సంబంధం లేదు..
ఈ నెల 19న నిర్వహించనున్న ‘సమగ్ర కుటుంబ సర్వే’కు ఫాస్ట్ పథకానికి సంబంధం లేదని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ‘‘ఫాస్ట్ మార్గదర్శకాల ఆధారంగా స్థానికత, ఆదాయం సర్టిఫికెట్లను జారీ చేస్తారు. తెలంగాణ విద్యార్థులకు ఇబ్బందేం ఉండదు. ఎవరైనా తల్లిదండ్రులు లేని వారున్నా, వివరాలు లభించని వా రున్నా.. వారికి సంబంధించి పరిగణనలోకి తీసుకునే అంశాలు మార్గదర్శకాల్లో ఉంటాయి’’ అని చె ప్పారు. టి.ఉన్నత విద్యా మండలికి త్వరలోనే చైర్మన్, వైస్ చైర్మన్‌ను ప్రకటిస్తామని తెలిపారు.
కాలేజీల తనిఖీలు ఆపేది లేదు..
కాలేజీలకు గుర్తింపు ఇచ్చేందుకు తని ఖీలు చేయాల్సిందేనని, వాటిని ఆపే దిలేదని మంత్రి జగదీశ్ స్పష్టం చేశా రు. ‘‘ఫీజు బకాయిలు తెలంగాణ విద్యార్థులవే చెల్లిస్తాం. స్థాని కత ఆధారంగా తెలంగాణవారు కాదని తేలిన వారి ఫీజులను చెల్లించం..’’ అని పేర్కొన్నారు.బకాయిలు ఇవ్వకపోతే కాలేజీలు మాసేస్తామంటున్నారని విలేకరులు పేర్కొనగా... ‘మూసేసుకుంటే వారిష్టం. వ్యాపారాలు చేసుకుంటారు..’ అని పేర్కొన్నారు. ఇంకా ప్రవేశాలే ప్రారంభం కానప్పుడు యాజమాన్యాలతో మాట్లాడేందుకు తొందరేం వచ్చిందని పేర్కొన్నారు.
ఇంటర్‌లో పారా మెడికల్ కోర్సుల పునరుద్ధరణ
ఇంటర్మీడియెట్ వొకేషనల్‌లో పారా మెడికల్ కోర్సులను పునరుద్ధరిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి అధికారులతో చర్చించారు. నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాల్సి ఉన్నందున గతంలో రద్దు చేసిన ఆ కోర్సులను మళ్లీ ప్రవేశ పెడతామని చెప్పారు. ఇక పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల నోటిఫికేషన్ ఉత్తర్వులను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. నియామకాల సందర్భంగా కాంట్రాక్టు సీనియర్ అధ్యాపకులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామన్నారు.